టోల్‌ప్లాజా వద్ద భద్రత చర్యలకు శ్రీకారం
మేడ్చల్: మండల పరిధిలోని సుతారిగూడ టోల్‌ప్లాజా వద్ద మంగళవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం చెందడంతో హెచ్ఎండీఏ అధికారులు నివారణ చర్యలకు ఉపక్రమించారు. టోల్‌ప్లాజా ఉన్నట్లు దూరం నుంచే రాత్రి సమయంలో తెలిసేవిధంగా రోడ్డుపై రేడియం లైట్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు శ్రీకారం చుట్టారు. 100 మీటర్ల ముందు నుంచి వేగాన్ని నిరోధించేందుకు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసేందుకు గురువారం హెచ్ఎండీఏ సిబ్బంది కొలతలు తీసుకొని పనులు ప్రారంభించారు. మంగళవారం జరిగిన ప్రమాదానికి రింగురోడ్డుపై దారిమళ్లింపు, టోల్‌ప్లాజా ఉన్నట్లు సూచిక బోర్డులు లేకపోవడం, వేగ నిరోధకాలు లేకపోవడమే కారణమని తెలిసిందే. దీంతో హెచ్ఎండీఏ అధికారులు ఇకపై ప్రమాదాలు చోటుచేసుకోకుండా నివారణ చర్యలు చేపట్టింది.