జాకీచాన్‌కు ‘సన్’ స్ట్రోక్!
హాలీవుడ్ యాక్షన్ స్టార్ జాకీ చాన్‌కు ఇప్పుడు ఊహించని తలనొప్పి ఎదురైంది. చైనాలో మాదక ద్రవ్యాల వినియోగం విషయంలో ఆయన కుమారుడు తాజాగా అభిశంసనకు గురవడంతో ఆయనకు తల కొట్టేసినంత పని అయింది. అయితే, ఈ వ్యవహారం నుంచి తన కుమారుణ్ణి బయట పడేయడానికి రాజకీయ అనుబంధాలేమీ వాడుకోలేదంటూ ఆయన తాజాగా వివరణనిచ్చుకోవాల్సి వచ్చింది. అసలు జరిగిందేమిటంటే, మూడు నెలల క్రితం బీజింగ్‌లో తమ ఇంట్లో స్నేహితుల బృందంతో కలసి మాదకద్రవ్యాలు పీలుస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు - జాకీ చాన్ కుమారుడైన 32 ఏళ్ళ జేసీ.
మాదక ద్రవ్యాల వినియోగదారులకు వేదిక కల్పించారనే నేరంపై అతగాడికి ఏకంగా మూడేళ్ళ జైలు శిక్ష పడే ప్రమాదం తలెత్తింది. హాంగ్‌కాంగ్‌కు చెందిన జాకీచాన్ ఏకైక కుమారుడైన జేసీ కూడా వృత్తి రీత్యా నటుడు, గాయకుడు. స్థానికులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దాడి జరిపి జేసీనీ, ఆయన మిత్రబృందంలో సభ్యుడైన తైవాన్‌కు చెందిన సినీ తార అయిన 23 ఏళ్ళ కోచెన్-టుంగ్ను కూడా అరెస్ట్ చేశారు. జేసీ నివాసంపై జరిపిన దాడిని చైనా ప్రభుత్వ నిర్వహణలోని సి.సి. టి.వి.లో కూడా ప్రసారం చేశారు. ఎనిమిదేళ్ళుగా తాను మాదక ద్రవ్యాలను వాడుతున్నట్లు జేసీ సైతం పోలీసుల వద్ద అంగీకరించారు.
చైనాలో బోలెడంత పలుకుబడి గల రాజకీయవేత్త కూడా అయిన జాకీచాన్ తన కొడుకు చేసిన తప్పుతో తలెత్తుకోలేకుండా ఉన్నానంటున్నారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహనను పెంపొందించడం కోసం చైనాలో 2009లో ఏర్పాటైన చైనా జాతీయ యాంటీ - డ్రగ్ కమిటీకి జాకీచాన్ గుడ్‌విల్ అంబాసడర్ కావడం విశేషం. కొడుకు అరెస్ట్‌తో ఆయన ఇప్పటికే అందరికీ క్షమాపణలు చెప్పారు. కాగా, తన లాగే తన కుమారుడు కూడా ఏదో ఒక రోజుకు మాదకద్రవ్యాల వినియోగ వ్యతిరేక ఉద్యమానికి అంబాసడర్‌గా నిలుస్తాడని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.