ఆస్కార్ పండగొచ్చేసింది!
‘‘అండ్ ది అవార్డ్ గోస్ టూ..’’ తర్వాత ఏర్పడే ఉత్కంఠ భరిత క్షణాలను చూసేరోజు రానే వచ్చింది. నేడే ఆస్కార్ అవార్డ్ వేడుక జరగనుంది. విశ్లేషణలు అయిపోయాయి. విశేషాలు మాట్లాడేసుకున్నాం. మిగిలిందల్లా ఆస్కార్ ఎన్వలప్లో ఎవరి పేరు రాసిందో తెలుసుకోవడమే మిగిలి ఉంది. 91వ ఆస్కార్ అవార్డుల వేడుక లాస్ఏంజెల్స్ డాల్బీ థియేటర్లో ఘనంగా జరగనుంది. ఆస్కార్‌లో ఎప్పుడూ కనిపించని విషయాలు ఈ ఏడాది చోటు చేసుకోనున్నాయి. వాటితో పాటు మరికొన్ని విశేషాలు. ఆస్కార్ సినిమాలు అనగానే ఆర్ట్ సినిమాలకే అనే ఉద్దేశాలు లేకపోలేదు. అయితే వాటిని ఈ ఏడాది కొట్టిపారేసింది. ఏడు నామినేషన్లతో ‘బ్లాక్ ప్యాంథర్’ చిత్రం మొదటి సూపర్ హీరో సినిమాగా నిలిచింది. ఆస్కార్ నామినేషన్ దక్కితే గొప్పే అన్నట్లుగా ఉంటుంది. కానీ ఒక్కరే ఒకటికంటే ఎక్కువ నామినేషన్లు పొందితే ఆశ్చర్యపడే విషయం. ఈ ఏడాది హాట్ ఫేవరెట్ ‘రోమా’ దర్శకుడు ఆల్ఫోన్స్ కువరో నాలుగు నామినేషన్లు దక్కించుకున్నారు.
నిర్మాత, దర్శకుడు, స్క్రీన్‌ప్లే, కెమెరామేన్ విభాగాల్లో నామినేషన్ సాధించారాయన. ఈ ఫీట్‌ని ఆల్రెడీ వారెన్ బీట్టీ రెండుసార్లు (హెవెన్ కెన్ వెయిట్, రెడ్స్), జోయిల్, ఎతన్ ‘నో కంట్రీ ఫర్ ఓల్డ్’ సినిమాకు సాధించారు. ఎక్కువ సార్లు నామినేషన్ అందుకున్న రికార్డ్ నటీమణుల్లో మెరీల్ స్ట్రీప్ 21 నామినేషన్స్‌తో ముందు వరుసలో ఉన్నారు. నటుల్లో 12 నామినేషన్లతో జాక్ నికోల్సన్ ఉన్నారు. ఆస్కార్ ఎక్కువసార్లు అందుకున్న నిర్మాణ సంస్థగా వాల్ట్ డిస్నీ 22 ఆస్కార్లను అందుకుంది.ఆస్కార్ విగ్రహాన్ని ఏ నటీనటులైనా, సాంకేతిక నిపుణుడైనా తన అవార్డ్ షెల్ప్‌లో చూసుకోవాలని కోరుకుంటాడు. ఆస్కార్ విగ్రహం తయారీ గురించిన విషయాలు తెలుసుకుందాం. 13.5 సె.మీ ఉండే ఈ ప్రతిమ సుమారు మూడున్నర కేజీల బరువు ఉంటుంది. ఫిల్మ్ మీద కత్తి పట్టుకుని నిల్చున్న యోధుడిలా ఉండే ఆస్కార్ ప్రతిమను న్యూ యార్క్‌కు చెందిన కంపెనీ తయారు చేస్తుంది.