Home Construction Department
-
కొత్తగా మరో 2.32 లక్షల ఇళ్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిరుపేదలైన అక్కచెల్లెమ్మలు మరింతమందికి సొంతింటి కలను సాకారం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఇప్పటికే దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద 31 లక్షలకు పైగా నిరుపేద మహిళల పేరిట ఉచితంగా స్థలాలను పంపిణీ చేసి రికార్డు సృష్టించారు. 17 వేల వైఎస్సార్, జగనన్న కాలనీల్లో పేదలకు స్థలాలు ఇచ్చి, ఇళ్ల నిర్మాణం ద్వారా కొత్తగా ఊళ్లనే నిర్మిస్తున్నారు. ఇప్పటికే 22 లక్షలకు పైగా ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఇచ్చి, శరవేగంగా నిర్మాణాలు చేపడుతున్నారు. నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకం కింద జగనన్న కాలనీల్లోనే మరో 2,32,686 ఇళ్లు నిర్మించడానికి తాజాగా ప్రణాళికలు రూపొందించారు. ఇందుకోసం రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ నుంచి కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖకు ప్రతిపాదనలు వెళ్లాయి. వేగంగా ఇళ్ల నిర్మాణం జగనన్న కాలనీల్లో అనుమతులు ఇచ్చిన 22 లక్షలకు పైగా ఇళ్ల పనులు వేగంగా జరుగుతున్నాయి. వీటిలో 19.13 లక్షలు సాధారణ ఇళ్లు కాగా, మిగిలినవి టిడ్కో ఇళ్లు. సాధారణ ఇళ్లలో ఇప్పటికే 7.25 లక్షల గృహాల నిర్మాణం పూర్తయింది. మరో 4.15 లక్షల ఇళ్లు పునాది నుంచి రూఫ్ లెవల్ వరకు వివిధ దశల్లో ఉన్నాయి. జిల్లాల వారీగా రోజువారి లక్ష్యాలను నిర్దేశించి నిర్మాణ పనులను గృహ నిర్మాణ శాఖ పర్యవేక్షిస్తోంది. వేగంగా బిల్లులు చెల్లిస్తూ త్వరితగతిన నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటోంది. అత్యధికంగా కర్నూలు జిల్లాలో కొత్తగా నిర్మించనున్న 2.32 లక్షల ఇళ్లలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 30,652 ఉన్నాయి. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 29,892, కాకినాడ జిల్లాలో 25,826, పల్నాడు జిల్లాలో 22,202 ఇళ్లు ఉన్నాయి. పేదల ఇంటి నిర్మాణానికి యూనిట్‌కు రూ.1.80 లక్షలు చొప్పున ఇవ్వడమే కాకుండా, ఉచితంగా ఇసుక సరఫరా ద్వారా రూ.15వేలు, సిమెంట్, స్టీలు, మెటల్ ఫ్రేమ్స్, ఇతర నిర్మాణ సామగ్రిని తక్కువ ధరకే అందించడం ద్వారా మరో రూ.40 వేల మేర ప్రభుత్వం పేదలకు లబ్ధి చేకూరుస్తోంది. అదేవిధంగా పావలా వడ్డీకే రూ.35 వేలు చొప్పున బ్యాంకు రుణం అందిస్తున్నారు. ఇలా మొత్తంగా ఒక్కో లబ్దిదారుకు రూ.2.70 లక్షలు చొప్పున మేలు కలుగుతోంది. దీనికి అదనంగా మౌలిక వసతుల కోసం ప్రతి ఇంటిపై మరో రూ.లక్షకు పైగా వైఎస్ జగన్ ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. వసతులు కల్పిస్తున్నాం రాష్ట్రంలో మరో 2.32 లక్షల ఇళ్లు నిర్మించనున్నాం. కేంద్ర నుంచి అనుమతులు వచ్చేలోపు లేఅవుట్లలో నీరు, విద్యుత్ సరఫరా పనులు చేపడుతున్నాం. అనుమతులు వచ్చిన వెంటనే నిర్మాణం చేపడతాం. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఇళ్లకు విద్యుత్, నీటి సరఫరా, ఇతర వసతులు కల్పిస్తున్నాం.- ఎండీ కె.వెంకట రమణారెడ్డి, గృహ నిర్మాణ సంస్థ -
టార్గెట్ 5 లక్షల ఇళ్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పేదింటి అక్కచెల్లెమ్మ సొంతింటి కలను నెరవేర్చాలన్న సంకల్పంతో ఉన్న సీఎం జగన్ సర్కార్.. వచ్చే సంక్రాంతి నాటికి రాష్ట్రంలో మరో ఐదు లక్షల పేదల ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాలనే లక్ష్యంతో గృహ నిర్మాణ శాఖ అడుగులు వేస్తోంది. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల పథకం కింద 30.75 లక్షల మంది పేద మహిళల పేరిట విలువైన ఇంటి స్థలాలను ఉచితంగా పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అంతేకాక.. ఇందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు కూడా ఇచ్చారు. మొదటి దశ కింద మొన్న ఆగస్టు నెలాఖరు నాటికి ఐదు లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేశారు. గత నెల 12 నాటికి రెండో దశలోని కొన్ని ఇళ్లతో కలిపి 7.43 లక్షల (5.86 లక్షల సాధారణ + 1.57 లక్షల టిడ్కో) ఇళ్లను లబ్దిదారులకు అందజేశారు. శరవేగంగా రెండో దశ ఇళ్ల నిర్మాణం.. ఇక రెండో దశలో ఐదు లక్షల ఇళ్ల నిర్మాణం చేయాల్సి ఉండగా ఇప్పటికే 98,308 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. మిగిలిన నాలుగు లక్షలకు పైగా ఇళ్లను నిర్దేశించుకున్న లక్ష్యంలోగా పూర్తిచేసి పేదలకు అందించేందుకు గృహ నిర్మాణ శాఖ శరవేగంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ముగింపు దశలో 12,479, రూఫ్ లెవెల్లో 1.03 లక్షలు, పునాది పైదశల్లో 3.94 లక్షల చొప్పున ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. వీటన్నింటినీ వేగంగా పూర్తిచేయడంపై అధికారులు దృష్టిపెట్టారు. ఉచితంగా స్థలం.. ఆపై అమిత సాయం మరోవైపు.. ఇళ్ల లబ్దిదారులకు ఖరీదైన స్థలాలను ఉచితంగా పంపిణీ చేసిన సీఎం జగన్ ప్రభుత్వం అక్కడితో ఆగకుండా ఇంటి నిర్మాణం నిమిత్తం యూనిట్‌కు రూ.1.80 లక్షల బిల్లు మంజూరు చేస్తోంది. ♦ స్వయం సహాయక బృందాల ద్వారా లబ్దిదారులైన మహిళలకు పావలా వడ్డీకి రూ.35 వేలు రుణసాయం చేస్తోంది. ♦ ఉచితంగా ఇసుకను పంపిణీ చేయడం ద్వారా రూ.15 వేలు.. స్టీల్, సిమెంట్, ఇలా 12 రకాల నిర్మాణ సామగ్రిని సబ్సిడీపై సరఫరా> చేయడం ద్వారా మరో రూ.40 వేలు చొప్పున మొత్తంగా రూ.2.70 లక్షల చొప్పున అదనంగా లబ్దిచేకూరుస్తోంది. ♦ అలాగే, జగనన్న కాలనీల్లో ఉచితంగా నీటి, విద్యుత్ సరఫరా కనెక్షన్లు ఇవ్వడం, డ్రెయిన్లు, రోడ్లు లాంటి సకల వసతులను సమకూరుస్తోంది. ♦ ఇలా స్థలం, ఇంటితో కలిపి పేదింటి మహిళల పేరిట రూ.10 లక్షలు, ఆపైన విలువైన స్థిరాస్తిని జగన్ సర్కార్ సమకూరుస్తోంది. అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం పేదల ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. సంక్రాంతి నాటికి పూర్తిచేయాల్సిన లక్ష్యాన్ని అధిగమించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. దీపావళి, క్రిస్మస్, జనవరి ఫస్ట్ ఇలా వరుస పండుగలు, ప్రత్యేక రోజులు ఉన్నందున.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలు సొంతూళ్లకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ సమస్యను అధిగమించి పనులు చకచకా పూర్తిచేయడానికి శ్రమిస్తాం. – అజయ్ జైన్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ -
జగనన్న కాలనీలు ఆధునిక లోగిళ్లు
సాక్షి, అమరావతి: జగనన్న కాలనీల్లో శాశ్వతప్రాతిపదికన అత్యాధునిక మౌలిక సౌకర్యాలు కల్పించి, ఆధునిక లోగిళ్లుగా తీర్చిదిద్దుతున్నామని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తెలిపారు. శుక్రవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి మాట్లాడారు. త్వరలోనే జగనన్న కాలనీలు పూర్తవుతాయని, రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం ఒక చరిత్ర అని చెప్పారు. 4బీ అప్లికేషన్ జియో ట్యాగ్ విషయంలో చర్యలు తీసుకుంటామన్నారు. ఇళ్ల స్థలాల పంపిణీకి చంద్రబాబు అడ్డంకులు సృష్టిస్తున్నారని, చివరికి కోర్టులో కేసులు కూడా వేయించారని తెలిపారు. భూములను కొని మరీ పేదవారికి ఇళ్లు ఇస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. జగనన్న కాలనీల్లో అత్యాధునిక సౌకర్యాలు కల్పించడం గొప్ప విషయమని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఏ పార్టీ వారైనా ఇళ్లు లేని ప్రతి ఒక్కరికీ సీఎం జగన్ ఇళ్లు కట్టించి ఇస్తున్నారని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తెలిపారు. వేలాది ఎకరాల భూమి కొనుగోలు చేసి సంతృప్తస్థాయిలో పేదలందరికీ ఇళ్లు ఇవ్వడం ఓ చరిత్ర అని ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి కొనియాడారు. కొన్నిచోట్ల పట్టా కేటాయించిన తర్వాత రద్దవడంపై పరిశీలన జరపాలని ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు కోరారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు ఇళ్లను అమ్ముకునేవని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి అన్నారు. సాంకేతిక సమస్యలతో ఇళ్లు లభించని వారికి వేరే చోట పట్టాలివ్వాలని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ కోరారు. సీఎం జగన్ చేపడుతున్న కార్యక్రమాలు అద్భుతమని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి చెప్పారు. శ్రీకృష్ణదేవరాయలు తరం, వైఎస్ జగన్మోహన్రెడ్డి తరం అని చరిత్ర చెప్పుకుంటుందని అన్నారు. టీడీపీ హయాంలో అనారోగ్యశ్రీగా మార్చారు - మంత్రి రజిని టీడీపీ హయాంలో ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఆమె మాట్లాడుతూ... టీడీపీ హయాంలో 107 ప్రొసీజర్లు పెంచితే, ఆరోగ్యశ్రీలో 3,138 ప్రొసీజర్లు పెంచిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కు దక్కుతుందని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ పథకానికి ఆరోగ్యశ్రీ స్ఫూర్తిగా నిలిచిందని మంత్రి తెలిపారు. మత్స్యకారులకు అండగా ఉంటాం- మంత్రి సీదిరి అప్పలరాజు వేట నిషేధ సమయంలో ప్రతి మత్స్యకారునికి మత్స్యకార భరోసా అందిస్తున్నామని పశు సంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. ప్రమాదంలో మరణించిన మత్స్యకారుడు కుటుంబ పెద్ద కాకపోయినప్పటికీ పరిహారం అందిస్తున్నామని చెప్పారు. భీమిలి, చింతపల్లి, రాజయ్యపేట వద్ద ఎఫ్‌ఎల్‌సీలకు టెండర్ల ప్రక్రియ త్వరలో ప్రారంభిస్తామన్నారు. అవసరమైతే సబ్సిడీ మొత్తాన్ని పెంచుతామన్నారు. మత్స్యకార భరోసా కుటుంబంలో అందిరికీ వర్తింపజేయాలని ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌కుమార్ కోరారు. 15 రోజుల శిక్షణతో అర్చకత్వం హిందూ ధర్మ ప్రచారం, రక్షణకు చర్యలు తీసుకుంటున్నామని దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ ఏడాది 2,900 దేవాలయాలు నిర్మిస్తున్నామని, ధూపదీప నైవేద్యాల కింద రూ.27.47 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ధూపదీప నైవేద్యాల పెండింగ్ బిల్లులు పది రోజుల్లో క్లియర్ చేస్తామన్నారు. దేవాలయానికి సంబంధం ఉన్న ప్రతి కమిటీకి ఏటా రూ.15 కోట్లు ఇస్తున్నామని వెల్లడించారు. దేవాలయాల్లో పని చేసేందుకు ఆసక్తితో ఉన్న వారికి 15 రోజులు శిక్షణ ఇచ్చి అర్చకత్వంలో నియమిస్తామని చెప్పారు. 16 ఏళ్లు నిండిన తరువాత వంశపారంపర్య అర్చకులుగా నియమిస్తామన్నారు. హిందూధర్మ పరిరక్షణకు జగన్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేసిందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు చెప్పారు. చంద్రబాబు కూల్చేసిన ఆలయాలను సీఎం జగన్ పునర్మిస్తున్నారని తెలిపారు. -
ఏపీతో ’ఈఈఎస్ఎల్’ ఒప్పందం
సాక్షి, అమరావతి: గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు విద్యుత్ ఆదా చేయగల గృహోపకరణాలను తక్కువ ధరకు పంపిణీ చేయాలనీ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ చేసిన ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) సూత్రప్రాయంగా అంగీకరించింది. రాష్ట్రంలో మొదటి దశలో నిర్మిస్తున్న 15.6 లక్షల ఇళ్లకు సంబంధించి ఒక్కో లబ్ధిదారునికి నాలుగు ఎల్ఈడీ బల్బులు, రెండు ఎల్ఈడీ ట్యూబ్‌లైట్లు, రెండు ఫ్యాన్లను మార్కెట్ ధర కన్నా తక్కుకే అందచేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా గృహ నిర్మాణ శాఖ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన సామర్థ్య అభివృద్ధి సంస్థ (ఏపీ సీడ్కో)తో త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవడానికి ఈఈఎస్ఎల్ సంసిద్ధత వ్యక్తంచేసింది. గృహ నిర్మాణ శాఖ, ఏపీఎస్ఈసీఎం అధికారులతో ఆదివారం జరిగిన టెలీకాన్ఫెరెన్స్లో ఈఈఎస్ఎల్ సీఈఓ విశాల్ కపూర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇంధన సామర్థ్య రంగ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషిచేస్తున్న అతికొద్ది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటని ఆయన కొనియాడారు. రాష్ట్రంలో అమలుచేస్తున్న ఇంధన సామర్థ్య ప్రాజెక్టులకు సహకరించేందుకు ఈఈఎస్ఎల్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. ఏపీసీడ్కో ప్రాజెక్టు నిర్వహణ సలహాదారు (పీఎంసీ)గా వ్యవహరిస్తుందని ఆయన తెలిపారు. గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు ఇంధన సామర్థ్య ఉపకరణాలు ఒక ఎంపిక మాత్రమే కానీ తప్పనిసరి కాదని, అయితే.. వీటి వినియోగంవల్ల ఒక్కో గృహంలో ఏడాదికి 734 యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుందని అంచనా వేస్తున్నామన్నారు. ఆ విధంగా మొత్తం 15.6 లక్షల ఇళ్లలో ఏటా రూ.352 కోట్లు విలువైన విద్యుత్ ఆదా అయ్యే అవకాశం ఉందని ఆయన వివరించారు. గృహ నిర్మాణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్‌జైన్ మాట్లాడుతూ గృహ నిర్మాణ రంగంలో ఇంధన సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం ద్వారా పేదల జీవన ప్రమాణాలు మెరుగుపరచటమే లక్ష్యమన్నారు. ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ లక్ష్మీశా, స్పెషల్ సెక్రటరీ రాహుల్ పాండే, జేఎండీ ఎం. శివప్రసాద్, ఆంధ్రప్రదేశ్ ఇంధన సంరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) సీఈఓ ఎ. చంద్రశేఖరరెడ్డి పాల్గొన్నారు. -
‘నెట్టింట్లో’ చుట్టేస్తారు
* ప్రభుత్వ సాయంతో కట్టే ఇళ్లకు జియో టాగింగ్ * అక్రమాలను అరికట్టే దిశగా గృహ నిర్మాణ శాఖ అడుగులు ఏలూరు (టూ టౌన్) : ఒకే స్థలంపై రెండు మూడు రుణాలు.. ఒకే వ్యక్తి పేరుతో అదే స్థాయిలో బిల్లుల మంజూరు.. ఒకే ఇంటిపై ఇద్దరు లేదా ముగ్గురికి వేర్వేరు పథకాల్లో ఇళ్ల కేటాయింపు.. గృహ నిర్మాణ శాఖలో ఇలాంటి అక్రమాలు అన్నీఇన్నీ కావు. ఇకపై వీటికి అడ్డుకట్ట వేసేందుకు ఆ శాఖ సమాయత్తమైంది. ఇందుకు జియో టాగింగ్ విధానాన్ని అమలు చేస్తోంది. రాష్ట్రంలోనే తొలిసారిగా మన జిల్లాలో పెలైట్ ప్రాజెక్టు కింద లక్ష ఇళ్లను జియో టాగింగ్ విధానం ద్వారా ఆన్లైన్ చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే గృహ నిర్మాణ శాఖ మంజూరు చేసిన ఇళ్లలో 98 వేల ఇళ్లకు సంబంధించిన వివరాలను సేకరించారు. ఈ ఇళ్లన్నీ నెట్టింట్లోకే.. ప్రభుత్వం ఐఏవై, ఇందిరమ్మ, ఆర్పీహెచ్, అర్బన్ పథకాల కింద జిల్లాలోని పేదలకు సబ్సిడీతో కూడిన గృహ రుణాలను మంజూరు చేసింది. వీటిలో చాలా యూనిట్లు అక్రమార్కులు దక్కించుకున్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరు లేదా ముగ్గురికి ఇళ్లు కేటాయించిన సందర్భాలు అనేకం ఉన్నారుు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ గృహ నిర్మాణ శాఖ ద్వారా సబ్సిడీతో కూడిన రుణాలు తీసుకున్న లబ్ధిదారుల వివరాలను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడంతోపాటు ప్రతి ఇంటిని జియో టాగింగ్ పద్ధతిలో ఆన్లైన్ చేయూలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందారుు. పని మొదలుపెట్టాం గృహ నిర్మాణ శాఖ ద్వారా లబ్ధిపొందిన వారి ఆధార్ నంబర్లను అనుసంధానం చేయడంతోపాటు జియో టాగింగ్ విధానానికి శ్రీకారం చుట్టామని గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డెరైక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా జిల్లాలో మొత్తం 2 లక్షల 37వేల 770 ఇళ్లను నిర్మించగా, 2 లక్షల 34వేల 500 ఇళ్లకు సంబంధించి ఆధార్ సీడింగ్, ఆన్లైన్ ప్రక్రియల్ని పూర్తి చేశామని చెప్పారు. లబ్ధిదారుల ఇళ్లను హౌసింగ్ ఏఈలో ఫొటోలు తీసి సిద్ధంగా ఉంచారన్నారు. ఈ వివరాలన్నిటితో లక్ష ఇళ్లకు జియో టాగింగ్ చేయనున్నామని వివరించారు. ఇది పూర్తి కాగానే మిగిలిన అన్ని ఇళ్ల వివరాలను, ఫొటోలను జియో టాగింగ్లో పొందుపరుస్తామని చెప్పారు. ప్రతి గ్రామంలో ఎవరెవరు సబ్సిడీతో కూడిన ఇంటి రుణాలు పొందారు, ఏ పేర్లతో తీసుకున్నారు, ఎక్కడ, ఎప్పుడు తీసుకున్నారనే వివరాలను ఆన్లైన్లో పొందుపరుస్తామని వివరించారు. తద్వారా అదే వ్యక్తులు భవిష్యత్‌లో ఎక్కడైనా అక్రమ పద్ధతుల్లో గృహ రుణాలు పొందేందుకు ప్రయత్నిస్తే అడ్డుకునేందుకు వీలు కలుగుతుందని పేర్కొన్నారు. జియో టాగింగ్ విధానమంటే.. ఒక లబ్ధిదారుడు సబ్సిడీతో కూడిన రుణం తీసుకుని ఇల్లు కడితే అతని ఫొటోతోపాటు అతని ఇంటి ఫొటోను కూడా తీసుకుంటారు. ఆధార్ నంబర్, రేషన్ కార్డు వివరాలను అనుసంధానం చేస్తారు. ఇల్లు కట్టిన ప్రదేశం, సర్వే నంబర్, గ్రామం, మండలం తదితర వివరాలను సవివరంగా నమోదు చేస్తారు. ఇల్లు, లబ్ధిదారుడి ఫొటోలను అందులో పొందుపరుస్త్తారు. ఇవన్నీ ఆన్లైన్లో భద్రపరు స్తారు. భవిష్యత్‌లో గృహ రుణం తీసుకునేందుకు ఎవరు దరఖాస్తు చేసిన తక్షణమే ఆ వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారు. సదరు వ్యక్తి గతంలో సబ్సిడీతో కూడిన రుణం తీసుకుని ఉంటే ఆ వివరాలు ఆన్లైన్లో ప్రత్యక్షమవుతారుు. అలాంటి వారికి రుణాలు మంజూరు చేయకుండా జాగ్రత్త వహిస్తారు.