ఏపీతో ’ఈఈఎస్‌ఎల్‌’ ఒప్పందం | EESL Agreement With Andhra Pradesh Housing Department | Sakshi
Sakshi News home page

ఏపీతో ’ఈఈఎస్‌ఎల్‌’ ఒప్పందం

Published Mon, Nov 21 2022 6:00 AM | Last Updated on Mon, Nov 21 2022 6:00 AM

EESL Agreement With Andhra Pradesh Housing Department - Sakshi

సాక్షి, అమరావతి: గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు విద్యుత్‌ ఆదా చేయగల గృహోపకరణాలను తక్కువ ధరకు పంపిణీ చేయాలనీ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ చేసిన ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఈఈఎస్‌ఎల్‌) సూత్రప్రాయంగా అంగీకరించింది. రాష్ట్రంలో మొదటి దశలో నిర్మిస్తున్న 15.6 లక్షల ఇళ్లకు సంబంధించి ఒక్కో లబ్ధిదారునికి నాలుగు ఎల్‌ఈడీ బల్బులు, రెండు ఎల్‌ఈడీ ట్యూబ్‌లైట్లు, రెండు ఫ్యాన్లను మార్కెట్‌ ధర కన్నా తక్కుకే అందచేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా గృహ నిర్మాణ శాఖ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఇంధన సామర్థ్య అభివృద్ధి సంస్థ (ఏపీ సీడ్కో)తో త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవడానికి ఈఈఎస్‌ఎల్‌ సంసిద్ధత వ్యక్తంచేసింది.

గృహ నిర్మాణ శాఖ, ఏపీఎస్‌ఈసీఎం అధికారులతో ఆదివారం జరిగిన టెలీకాన్ఫెరెన్స్‌లో ఈఈఎస్‌ఎల్‌ సీఈఓ విశాల్‌ కపూర్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇంధన సామర్థ్య రంగ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషిచేస్తున్న అతికొద్ది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఒకటని ఆయన కొనియాడారు. రాష్ట్రంలో అమలుచేస్తున్న ఇంధన సామర్థ్య ప్రాజెక్టులకు సహకరించేందుకు ఈఈఎస్‌ఎల్‌ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు.  

ఏపీసీడ్కో ప్రాజెక్టు నిర్వహణ సలహాదారు (పీఎంసీ)గా వ్యవహరిస్తుందని ఆయన తెలిపారు. గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు ఇంధన సామర్థ్య ఉపకరణాలు ఒక ఎంపిక మాత్రమే కానీ తప్పనిసరి కాదని, అయితే.. వీటి వినియోగంవల్ల ఒక్కో గృహంలో ఏడాదికి 734 యూనిట్ల విద్యుత్‌ ఆదా అవుతుందని అంచనా వేస్తున్నామన్నారు. ఆ విధంగా మొత్తం 15.6 లక్షల ఇళ్లలో ఏటా రూ.352 కోట్లు విలువైన విద్యుత్‌ ఆదా అయ్యే అవకాశం ఉందని ఆయన వివరించారు.  

గృహ నిర్మాణ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అజయ్‌జైన్‌ మాట్లాడుతూ గృహ నిర్మాణ రంగంలో ఇంధన సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం ద్వారా పేదల జీవన ప్రమాణాలు మెరుగుపరచటమే లక్ష్యమన్నారు. ఏపీ హౌసింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఎండీ లక్ష్మీశా, స్పెషల్‌ సెక్రటరీ రాహుల్‌ పాండే, జేఎండీ ఎం. శివప్రసాద్, ఆంధ్రప్రదేశ్‌ ఇంధన సంరక్షణ మిషన్‌ (ఏపీఎస్‌ఈసీఎం) సీఈఓ ఎ. చంద్రశేఖరరెడ్డి పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement