సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిరుపేదలైన అక్కచెల్లెమ్మలు మరింతమందికి సొంతింటి కలను సాకారం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఇప్పటికే దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద 31 లక్షలకు పైగా నిరుపేద మహిళల పేరిట ఉచితంగా స్థలాలను పంపిణీ చేసి రికార్డు సృష్టించారు. 17 వేల వైఎస్సార్, జగనన్న కాలనీల్లో పేదలకు స్థలాలు ఇచ్చి, ఇళ్ల నిర్మాణం ద్వారా కొత్తగా ఊళ్లనే నిర్మిస్తున్నారు.
ఇప్పటికే 22 లక్షలకు పైగా ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఇచ్చి, శరవేగంగా నిర్మాణాలు చేపడుతున్నారు. నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకం కింద జగనన్న కాలనీల్లోనే మరో 2,32,686 ఇళ్లు నిర్మించడానికి తాజాగా ప్రణాళికలు రూపొందించారు. ఇందుకోసం రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ నుంచి కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖకు ప్రతిపాదనలు వెళ్లాయి.
వేగంగా ఇళ్ల నిర్మాణం
జగనన్న కాలనీల్లో అనుమతులు ఇచ్చిన 22 లక్షలకు పైగా ఇళ్ల పనులు వేగంగా జరుగుతున్నాయి. వీటిలో 19.13 లక్షలు సాధారణ ఇళ్లు కాగా, మిగిలినవి టిడ్కో ఇళ్లు. సాధారణ ఇళ్లలో ఇప్పటికే 7.25 లక్షల గృహాల నిర్మాణం పూర్తయింది. మరో 4.15 లక్షల ఇళ్లు పునాది నుంచి రూఫ్ లెవల్ వరకు వివిధ దశల్లో ఉన్నాయి. జిల్లాల వారీగా రోజువారి లక్ష్యాలను నిర్దేశించి నిర్మాణ పనులను గృహ నిర్మాణ శాఖ పర్యవేక్షిస్తోంది. వేగంగా బిల్లులు చెల్లిస్తూ త్వరితగతిన నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటోంది.
అత్యధికంగా కర్నూలు జిల్లాలో
కొత్తగా నిర్మించనున్న 2.32 లక్షల ఇళ్లలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 30,652 ఉన్నాయి. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 29,892, కాకినాడ జిల్లాలో 25,826, పల్నాడు జిల్లాలో 22,202 ఇళ్లు ఉన్నాయి. పేదల ఇంటి నిర్మాణానికి యూనిట్‌కు రూ.1.80 లక్షలు చొప్పున ఇవ్వడమే కాకుండా, ఉచితంగా ఇసుక సరఫరా ద్వారా రూ.15వేలు, సిమెంట్, స్టీలు, మెటల్ ఫ్రేమ్స్, ఇతర నిర్మాణ సామగ్రిని తక్కువ ధరకే అందించడం ద్వారా మరో రూ.40 వేల మేర ప్రభుత్వం పేదలకు లబ్ధి చేకూరుస్తోంది.
అదేవిధంగా పావలా వడ్డీకే రూ.35 వేలు చొప్పున బ్యాంకు రుణం అందిస్తున్నారు. ఇలా మొత్తంగా ఒక్కో లబ్దిదారుకు రూ.2.70 లక్షలు చొప్పున మేలు కలుగుతోంది. దీనికి అదనంగా మౌలిక వసతుల కోసం ప్రతి ఇంటిపై మరో రూ.లక్షకు పైగా వైఎస్ జగన్ ప్రభుత్వం ఖర్చు పెడుతోంది.
వసతులు కల్పిస్తున్నాం
రాష్ట్రంలో మరో 2.32 లక్షల ఇళ్లు నిర్మించనున్నాం. కేంద్ర నుంచి అనుమతులు వచ్చేలోపు లేఅవుట్‌లలో నీరు, విద్యుత్ సరఫరా పనులు చేపడుతున్నాం. అనుమతులు వచ్చిన వెంటనే నిర్మాణం చేపడతాం. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఇళ్లకు విద్యుత్, నీటి సరఫరా, ఇతర వసతులు కల్పిస్తున్నాం.- ఎండీ కె.వెంకట రమణారెడ్డి, గృహ నిర్మాణ సంస్థ
Comments
Please login to add a commentAdd a comment