‘ఫర్నిచర్ స్టోరేజ్’కు కలిసొచ్చిన కరోనా!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: శ్రీనివాస్ ఐటీ ఉద్యోగి. హైదరాబాద్‌లో ఫ్యామిలీతో కలిసి అద్దెకుంటున్నాడు. గతేడాది కరోనా, లాక్డౌన్ నేపథ్యంలో కంపెనీ వర్క్ ఫ్రం హోమ్ ఆఫర్ ఇచ్చింది. పరిస్థితులు మాములుగా మారితే మళ్లీ రావొచ్చులే అనుకొని సొంతూరుకు వెళ్లిపోయాడు. ఏడాదిన్నర దాటినా సేమ్ సీన్. నగరంలో అద్దె భారం భరించలేక.. ఇంట్లోని ఫర్నిచర్‌ను తక్కువ అద్దె వసూలు చేసే స్టోరేజ్ గోడౌన్‌కు షిప్ట్ చేశాడు.
హైటెక్‌సిటీలోని ఓ కంపెనీ ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రం హోమ్ బాధ్యతలు అప్పగించింది. మరి, ఆఫీసులోని ఏసీలు, ఫ్యాన్లు, ఇతరత్రా ఫర్నిచర్‌ను అలాగే వదిలేస్తే నిర్వహణ భారమవుతుందని, స్టాఫ్ లేని ఆఫీసుకి అద్దె చెల్లించడం అనవసరమని ఫర్నిచర్ మొత్తాన్ని స్టోరేజ్ గోడౌన్‌కు తరలించింది.. ఇలా కరోనా నేపథ్యంలో ఫర్నిచర్ స్టోరేజ్ కంపెనీలకు గిరాకీ పెరిగింది. ఇల్లు, ఆఫీసుల్లోని ఫర్నిచర్ కోసం ప్రతినెలా వేల రూపాయల అద్దెను చెల్లించడం భారమైన ఉద్యోగులు, కంపెనీలకు ఫర్నిచర్ స్టోరేజ్ గోడౌన్ సర్వీసులు యూజ్‌ఫుల్‌గా మారాయి. అద్దెలో సగం కంటే తక్కువ ఖర్చుకే స్టోరేజీ, బీమా, భద్రత సేవలను అందిస్తున్నాయి.
డిమాండ్ పెరిగింది..
ఫర్నిచర్ స్టోరేజ్ సర్వీస్‌లు కొత్తమీ కాదు. గతంలో వినియోగదారులు, బిజినెస్ టూరిస్ట్‌లు హోమ్ రెనోవేషన్ లేదా కంపెనీలు రీలొకేషన్ సమయంలో ఫర్నిచర్ స్టోరేజ్ సర్వీస్‌లను వినియోగించుకునేవి. కానీ, ఇప్పుడు కరోనా, లాక్‌డౌన్‌తో సొంతూర్లకు వెళ్లినవారు రెండేళ్లయినా తిరిగిరాని పరిస్థితి. ఇక్కడ ఉన్నా లేకున్నా ఇంటి అద్దెలు చెల్లించాల్సిందే. చాలామంది రెంట్ భారం తగ్గించుకునేందుకు ఇళ్లను ఖాళీ చేసి సామాన్లను వేర్‌హౌస్‌లో పెడుతున్నారు. వస్తువులను బట్టి ధరలు ఉండటం, కాలపరిమితి లేకపోవటం, బీమా, భద్రత ఏర్పాట్లు ఉండటంతో డిమాండ్ ఏర్పడింది. కరోనా కంటే ముందు ఈ రంగం వృద్ధి ఏటా 20–30 శాతంగా ఉండేది.. ప్రస్తుతం 50–60 శాతంగా ఉంది.
వస్తువులను బట్టి చార్జీలు..
స్టోనెస్ట్, సేఫ్స్టోరేజ్, స్టోర్గనైజ్ వంటి వందలాది కంపెనీలు హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై వంటి ప్రధాన నగరాలలో సేవలను అందిస్తున్నాయి. శివారు ప్రాంతాలలో వేర్‌హౌస్‌లను ఏర్పాటు చేసి ఫర్నిచర్‌ను భద్రపరుస్తున్నాయి. స్టోనెస్ట్‌కు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పుణే నాలుగు నగరాలలో కలిపి 5 లక్షల చదరపు అడుగు (చ.అ.)లలో, సేఫ్‌స్టోరేజ్‌కు 7.5 లక్షల చ.అ. విస్తీర్ణంలో వేర్‌హౌస్‌లున్నాయి. 4 నగరాల్లో స్టోనెస్ట్‌కు 1000 కంపెనీలు, 10 వేల మంది కస్టమర్లున్నారు. సేఫ్‌స్టోరేజ్‌కు 300 కంపెనీలు, 12 వేల మంది యూజర్లున్నారు. వస్తువుల సైజ్‌ను బట్టి స్టోరేజీ ధరలుంటాయి. రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్, ఏసీ, టీవీ, బెడ్, పరుపు, కప్‌బోర్డ్స్, అల్మారా, సోఫా, డైనింగ్ టేబుల్ వంటి పెద్ద సైజు ఫర్నిచర్లకు ఒక్కో దానికి నెలకు రూ.130, కుర్చీలు, వాటర్ప్యూరిఫయ్యర్, ఎయిర్ కూలర్, టేబుల్ ఫ్యాన్లు వంటి మిడియం సైజ్ అప్లియెన్సెస్‌కు రూ.70, పాదరక్షలు, బట్టలు, బెడ్షీట్లు, గ్యాస్ స్టవ్, సీలింగ్ ఫ్యాన్లు, కుక్కర్, మైక్రోవేవ్ వంటి స్మాల్ అప్లియెన్సెస్‌కు రూ.35 చార్జీలుంటాయి. కంపెనీలకు చ.అ.లను బట్టి ధరలుంటాయి. నెలకు 300 చ.అ.లకు రూ.21 వేలు, 450 చ.అ.లకు రూ.28 వేలుగా ఉన్నాయి.
సీసీ కెమెరాలు, బయోమెట్రిక్‌లతో భద్రత..
ప్యాకింగ్, మూవింగ్, స్టోరేజ్ అంతా కంపెనీలే చూసుకుంటాయి. ఆర్డర్ రాగానే స్టోరేజ్ కంపెనీకి చెందిన బృందం కస్టమర్ల ఇంటికి వెళ్తుంది. కస్టమర్ రాలేకపోతే బంధువులు, ఫ్రెండ్స్ ఎవరైనా కానీ షిఫ్టింగ్ టైమ్‌లో ఉండాలని చెప్తారు. ఎవరూ లేకపోతే కస్టమర్‌కు వీడియో కాల్ చేసి వారి చెప్పిన వస్తువులను ప్యాకింగ్ చేసి గోడౌన్‌కు తరలిస్తారు. అక్కడ కస్టమర్ పేరు రాసి సామన్లను భద్రపరుస్తారు. సీసీటీవీ కంట్రోల్లో ఉంచడమే కాకుండా సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉంటారు. వస్తువులకు డ్యామేజీ జరిగితే రూ.3–5 లక్షల వరకు బీమా సౌకర్యాన్ని కూడా కల్పిస్తారు. నెలకొకసారి పెస్ట్ కంట్రోల్ చేయడం, ఫర్నిచర్ ఫొటోలు, వీడియోలు తీసి కస్టమర్లకు పంపుతారు. కంపెనీల ల్యాప్‌ట్యాప్‌లు, డాక్యుమెంట్ల వంటి వాటిని ప్రత్యేకమైన గదులలో పెట్టి వాటికి బార్కోడ్ ట్రాకింగ్, బయోమెట్రిక్ సిస్టమ్‌తో యాక్సిస్‌ను ఏర్పాటు చేస్తారు.
హైదరాబాద్‌లో రోజుకు 60–70 ఆర్డర్లు..
స్టోనెస్ట్‌కు కొంపల్లిలో 60 వేల చ.అ.లలో రెండు గిడ్డంగులున్నాయి. 2,500 మంది వ్యక్తిగత కస్టమర్లున్నారు. క్లౌడ్‌ఎరా, జెన్‌డెస్క్ వంటి 150 కంపెనీలు ఫర్నిచర్, ల్యాప్‌ట్యాప్స్ ఇతరత్రా ఎలక్ట్రానిక్ వస్తువులను నిల్వ చేసుకున్నాయని స్టోనెస్ట్ స్టోరేజ్ మార్కెటింగ్ హెడ్ రాహుల్ తెలిపారు. ప్రీ–కోవిడ్ సమయంలో 4 నగరాల్లో నెలకు 300–400 కాల్స్ వచ్చేవి. ఇప్పుడు 800–1000 కాల్స్ వస్తున్నాయి. వీటిల్లో 150–200ల బుక్సింగ్ అవుతున్నాయి. హైదరాబాద్‌లో రోజుకు 60–70 ఆర్డర్లు వస్తున్నాయని పేర్కొన్నారు. ఫర్నిచర్‌కు రూ.3 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు. త్వరలోనే ఢిల్లీ, కోల్కత్తా నగరాలలో సేవలను ప్రారంభించనున్నాం. మార్కెట్ ట్రెండ్స్‌ను బట్టి ఆంధ్రప్రదేశ్‌లో సేవలను విస్తరిస్తామని తెలిపారు.