కావాల్సిన ఫర్నిచర్... ఆన్‌లైన్లో!
⇒ గదిని బట్టి మనమే ఫర్నీచర్‌ను ఎంచుకునే వీలు
⇒ కస్టమ్‌ఫర్నిష్.కామ్ సరికొత్త సేవలు
⇒ రూ.16 కోట్ల పెట్టుబడులు పెట్టిన సంస్థలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంటికి ఫర్నిచర్ ఎలా ఉండాలి? తెలుసుకోవటానికి నాలుగు షాపులు తిరగటం... తక్కువ మోడల్స్ ఉంటాయి కనక ఎక్కువ చోట చూడటం... చివరికి ఎక్కడో ఒక చోట రాజీపడటం!!.
చాలామంది చేస్తున్నదిదే. ఇపుడు ఆ అవసరం లేకుండా నచ్చిన ఫర్నిచర్‌ను మన టేస్ట్‌కు తగ్గట్టుగా మనమే సెలక్ట్ చేసుకునే అవకాశాన్ని... అది కూడా ఇంట్లో నుంచే కొనుక్కునే అవకాశాన్ని ఆన్‌లైన్ సంస్థలు అందిస్తున్నాయి. ఇంటికి కావలసిన బెడ్స్, వార్డ్ రోబ్స్, డైనింగ్ టేబుల్, కిచెన్... ఇలా ఏ ఫర్నిచర్ కావాలన్నా ఆర్డరిచ్చేయొచ్చు. ఇంట్లోని గది సైజులకు సరిగ్గా సరిపోయేలా నచ్చిన రంగు, నచ్చిన మెటీరియల్.. ఇలా మన అభిరుచికి అనుగుణంగా ఏం కావాలంటే అది ‘కస్టమ్‌ఫర్నిష్.కామ్’ ద్వారా మనమే ఎంచుకోవచ్చు. ఈ హైదరాబాదీ సంస్థలో రాష్ట్రానికి చెందిన పలువురు ప్రముఖులు పెట్టుబడులు పెట్టారు. దీనికి సంబంధించి సంస్థ వ్యవస్థాపక సీఈఓ డాక్టర్ మధుకర్ గంగాడీఏమంటారంటే...
- సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. అభిరుచికి తగ్గ ఫర్నీచర్ ఉండాలనుకోవటం తప్పేంకాదు. కానీ రిటైల్ షాపులు ఆ కోరికను తీర్చట్లేదు. వారు తయారు చేసిన ఫర్నీచర్లో మనకు నచ్చింది ఎంచుకుంటున్నాం. అంతే!!. కానీ, కస్టమ్‌ఫర్నిష్.కామ్‌లో మనకు నచ్చిన ఫర్నీచర్‌ను మనమే ఎంచుకునే వీలుంది. కస్టమ్‌ఫర్నిష్.కామ్ వెబ్‌సైట్‌కు వెళ్లగానే వార్డ్‌రోబ్స్, మాడ్యులర్ కిచెన్స్, సోఫాలు, ఫుల్ హౌజింగ్ ఫర్నీషింగ్ అనే విభాగాలు కన్పిస్తాయి. కావాల్సిన విభాగాన్ని ఎంచుకొని ఇంట్లోని గది సైజులను, నచ్చిన రంగు, మెటీరియల్.. అంతేకాదండోయ్ ఆయా ఫర్నీచర్ల మీద మనకు నచ్చిన ఫొటోలు, థీమ్‌లు ఇలా ఇలా ఎలా కావాలంటే అలా తయారు చేయించుకోవచ్చు.
7-15 రోజుల్లో డెలివరీ..
ఫర్నిచర్ ఎంచుకున్నాక ధర కూడా పక్కనే డిస్‌ప్లే అవుతుంటుంది. 50 శాతం అడ్వాన్స్ చెల్లించిన తర్వాత.. 7-15 రోజుల్లో ఇంటికి డెలివరీ చేస్తాం. ప్రతి ఫర్నీచర్‌పైనా గ్యారంటీ ఇస్తాం. కస్టమ్‌ఫర్నిష్.కామ్‌లో కొనే ప్రతి ఫర్నీచర్ రిటైల్ షాపులో కంటే 30 శాతం తక్కువ ధరకే వస్తుంది. ఇతర ఆన్‌లైన్ పోర్టళ్ల కంటే 40 శాతం తక్కువ ధరకు లభిస్తుంది.
ఏడాదిన్నరలో 10 ఫ్యాక్టరీలు
ప్రస్తుతం మూసాపేట్‌లో 30 వేల చ.అ. విస్తీర్ణంలో ఫర్నీచర్ తయారీ యూనిట్ ఉంది. నెల రోజుల్లో 60 వేల చదరపు అడుగుల్లో మరో యూనిట్‌ను ప్రారంభిస్తాం. వచ్చేనెల్లో బెంగళూరు, చెన్నై నగరాలకు, ఆరు నెలల్లో ఢిల్లీ, కోల్‌కత్తా, ముంబై నగరాలకు విస్తరిస్తాం. ఏడాన్నరలో దేశవ్యాప్తంగా 10 ఫ్యాక్టరీలను నెలకొల్పుతాం. ఒక్కో ఫ్యాక్టరీపై రెండున్నర కోట్ల పెట్టుబడులు పెడతాం.
రూ.16 కోట్ల పెట్టుబడులు..
తొలిసారిగా హైదరాబాద్‌లో మా సంస్థకు స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (సిడ్బీ) రూ.3 కోట్ల రుణం మంజూరు చేసింది. అలాగే డీఆర్‌ఎల్ చైర్మన్ సతీష్ రెడ్డి, పీపుల్ కేపిటల్ శ్రీని రాజు, హైదరాబాద్ ఏంజిల్స్ ఫౌండర్ శ్రీని కొప్పోలు, గ్రీన్‌కో గ్రూప్ అనిల్ చలమశెట్టి వ్యక్తిగతంగా రూ.16 కోట్ల పెట్టుబడులను పెట్టారు. త్వరలోనే మ రో రూ.100 కోట్ల పెట్టుబడుల కోసం రౌండ్స్ నిర్వహిస్తాం.
ఫర్నీచర్ పరిశ్రమ 20 బిలియన్ డాలర్లు..
దేశంలో ఫర్నీచర్ మార్కెట్ విలువ 20 బిలియన్ డాలర్లు. దీన్లో 15 శాతం వాటా సంఘటిత రంగానిది. 2-3 శాతం వాటా మాత్రమే ఆన్‌లైన్ ఫర్నీచర్ కంపెనీలది. ఇది చాలు దేశంలో ఆన్‌లైన్‌లో ఫర్నిచర్ అమ్మకాలకు ఎంత అవకాశముందో చెప్పడానికి. అసంఘటిత రంగ ఉత్పత్తులు ఎక్కువగాఉండటం, రవాణా ఛార్జీలు కలిసి రిటైల్ షాపుల్లో ఎక్కువ ధరకు కారణమవుతున్నాయి. ఇది కూడా ఆన్‌లైన్‌కు కలిసొచ్చేదే.