మీరే బాధ్యులు!
శ్రీకాకుళం సిటీ : పోలీస్‌శాఖపై పత్రికల్లో వ్యతిరేక వార్తలు వస్తున్నాయి. ఇది ఇబ్బందికరంగా ఉంది. శ్రీకాకుళం జిల్లాలోని కొంతమంది సీఐ, ఎస్ఐ స్థాయి అధికారులు అవినీతికి పాల్పడుతున్నట్టు తనకు రోజూ మెసేజ్‌లు అందుతున్నాయి. ఇక్కడ శాంతిభద్రతల లోపం స్పష్టంగా కనిపిస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (హోంశాఖ మంత్రి) నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. విమర్శలు వస్తున్న వారిపై విచారణ జరిపి వాస్తవాలు ఉంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
పత్రికా కథనాలు రుజువైతే అందుకు మీరే బాధ్యులన్నారు. జిల్లాలోని పలు ప్రాంతా ల్లో అభివృద్ధి పనులను మంగళవారం ప్రారంభించిన ఆయన జిల్లా పోలీస్ కార్యాలయంలో డీఐజీ ఎ.రవిచంద్ర, జిల్లా ఎస్పీ ఏఎస్ ఖాన్‌లతో కలిసి డీఎస్పీలు, సీఐల సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా ఇసుకను ఇస్తోందని..అక్రమాలు జరగకుండా ఇందులో రెవెన్యూ, పోలీస్‌శాఖలు భాగస్వామ్యం చేసినట్లు వివరించారు.
జిల్లాలో శాంతిభద్రల పరిస్థితులను ఎస్పీ ఏఎస్ ఖాన్ హోంమంత్రికి వివరించా రు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు పరిస్థితి, కొత్తగా ఆరు పోలీస్స్టేషన్ల మంజూరు, పోలీస్క్వార్టర్లు, పోలీసులకు అందుబాటులో ఉండే వాహనాల స్థితిగతులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాలో నెలకొని ఉన్న క్రైం రేటుపై ఓఎస్డీ పేర్కొన్నారు. ప్రత్యేక బృందాలను వేసి నేరాలు జరగకుండా చూడాలని ఉపముఖ్యమంత్రి ఆదేశించారు. శతశాతం రికవరీ సొత్తును రాబట్టాలని సూచించారు. శ్రీకాకుళంలో మూడు సబ్‌డివిజన్ పరిస్థితులను డీఎస్పీలు వివరించారు. మహిళా పోలీసు స్టేషన్లో నెలకున్న పరిస్థితులను, అక్కడకి వచ్చే వారికి ఇస్తున్న కౌన్సెలింగ్‌లను డీఎస్పీ సుబ్రహ్మణ్యం వివరించారు. జిల్లాలో ట్రాఫిక్‌పై పరిస్థితులను చినరాజప్ప ఆరా తీశారు.
- పత్రికల్లో వస్తున్న వార్తలపై ఎస్పీ ఏమన్నారంటే..
పత్రికల్లో విలువలు తగ్గిపోతున్నాయని, అందుకే పోలీసులపై వస్తున్న వ్యతిరేక వార్తలకు తాము స్పందించడం లేదని జిల్లా ఎస్పీ ఏఎస్ ఖాన్ ఉపముఖ్యమంత్రి దృష్టికి సమావేశంలో తీసుకెళ్లినట్టు తెలిసింది. పోలీసులకు వ్యతిరేకంగా పత్రికల్లో వస్తున్న వార్తలపై స్పందించాలని ఉపముఖ్యమంత్రి పదేపదే అనడంతో ఎస్పీ జోక్యం చేసుకున్నారు.
ఇటీవల ఓ పత్రికలో అంటూ..జిల్లాలోని ఏఎస్సై ఒకరు రూ.25 లక్షలు అవినీతికి పాల్పడిన వ్యవహారంపై సాక్షిలో కథనం ప్రచురితమైన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లేప్రయత్నం చేసినట్లు తెలిసింది. దీనికి హోంమంత్రి బదులిస్తూ పత్రికల్లో వ్యతిరేక కథనాలు వస్తే వాస్తవ పరిస్థితులపై కౌంటర్ ఇవ్వాల్సిన బాధ్యత పోలీస్ అధికారులపై ఉందన్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాలని పోలీస్ యంత్రాంగాన్ని ఆదేశించారు.
హోంమంత్రి పర్యటన సాగిందిలా
హోం మంత్రి చినరాజప్ప శ్రీకాకుళం, ఆమదాలవలస, పలాస, సోంపేట, టెక్కలి, ఎచ్చెర్ల మండలాల్లో పర్యటించి పలు భవనాలను ప్రారంభించారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. శ్రీకాకుళంలోని పొట్టిశ్రీరాములు జంక్షన్ సమీపంలో పెట్రోల్‌బంకుకు శంకుస్థాపన చేశారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
ఎచ్చెర్లలో పోలీస్ ఆపరేషన్ కమాండెంట్ బ్యారక్స్‌ను, ఆమదాలవలస మండలం కొర్లకోటలో రక్షితమంచినీటి పథకాన్ని, సీసీ రోడ్డు, పాఠశాల భవనాన్ని, కోటబొమ్మాళిలో పోలీస్‌స్టేషన్‌ను, కాశీబుగ్గలో పోలీస్బ్యారక్స్, సెంట్రల్ భవనాన్ని, ఎంపీడీవో కార్యాలయం వద్ద స్త్రీశక్తి భవనాన్ని ప్రారంభించారు. హరిపురంలో ఎన్టీఆర్, గౌతులచ్చన్నల విగ్రహాలను ఆవిష్కరించారు.
ఆదిత్యున్ని దర్శించుకున్న హోంమంత్రి
ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లి శ్రీసూర్యనారాయణస్వామివారిని ఉపముఖ్యమంత్రి చినరాజప్ప దర్శించుకున్నారు. అర్చకుడు నగేశ్కాశ్యప ఆధ్వర్యంలో అర్చక బృందం శాస్త్రోక్తంగా పూర్ణకుంభంతో ఆయకు స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం అనివెట్టి మండపంలో అర్చకుల బృందం ఆశీర్వదించగా, ఆలయ సహాయ కమిషనర్ శ్యామలాదేవి స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. ఈయన వెంట రాష్ట్ర కార్మికశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, జెడ్పీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి, జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గౌతు శిరీష, ఓఎస్డీ తిరుమలరావు, డీఎస్పీ భార్గవరావునాయుడు, ఆర్డీవో బలివాడ దయానిధిలు పాల్గొన్నారు.