హరి ఫైర్
ఎంపీ హరిబాబును విస్మరించిన హోం మంత్రి
ఆగ్రహంతో కార్యక్రమం నుంచి వెనుదిరిగిన ఎంపీ
సముదాయించిన మంత్రులు
సభా ముఖంగా ఎంపీ, డీజీపీ ఫైర్
బహిర్గతమైన బీజేపీ, టీడీపీ విభేదాలు
విశాఖపట్నం: నివురుగప్పిన నిప్పులా ఉన్న బీజేపీ, టీడీపీ ప్రజాప్రతినిధుల మధ్య విభేదాలు మంగళవారం బహిర్గతమయ్యాయి. రాష్ట్ర హోమ్ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మంగళవారం నగరంలో పర్యటించారు. ఈ పర్యటన నాయకుల మధ్య పెద్ద రగడకు దారితీసింది. తన విషయంలో ప్రొటోకాల్ విస్మరించారంటూ బీజేపీ ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో సాక్షాత్తూ హోమ్ మంత్రి క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. అయినప్పటికీ ఎంపీ పోలీసు శాఖపై విమర్శలు గుప్పించారు. ఆ విమర్శలపై డీజీపీ రాముడు అంతే ఘాటుగా ప్రతి స్పందించారు. ఈ సంఘటన చర్చనీయాంశమైంది.
మహిళల రక్షణ కోసం ‘అభయం’ మెబైల్ అప్లికేషన్, ‘ఐ క్లిక్’ పరికరాన్ని ప్రారంభించడానికి పోలీసులురాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, డీజీపీ జెవి రాముడుతో పాటు జిల్లా ఎంపీ కంబంపాటి హరిబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు,ప్రజాప్రతినిధులను ఆహ్వానించారు. సీఎంఆర్ షాపింగ్‌మాల్‌లో ఐ క్లిక్‌ను ఏర్పాటు చేశారు. దాని ప్రారంభానికి నిర్దేశిత సమయానికే ఎంపీ హరిబాబు అక్కడకు చేరుకున్నారు. ఆలస్యంగా వచ్చిన హోం మంత్రి చినరాజప్ప, మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు లోపలికి వెళ్లి ఐక్లిక్ను ప్రారంభించారు. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఎంపీ హరిబాబు,ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజులను పట్టించుకోలేదు. దీంతో హరిబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు అధికారులపై విరుచుకుపడ్డారు. ప్రజా ప్రతినిధిని గౌరవించే పద్ధతి ఇదేనా అంటూ దుయ్యబట్టారు. కార్యక్రమం నుంచి బయటకు వచ్చేశారు. దీంతో మంత్రి గంటా శ్రీనివాసరావు, డీజీపీ రాముడు ఆయనను వారించారు. అప్పటికే బయలుదేరేందుకు కారులోకి వెళ్లిపోయిన హోం మంత్రి విషయం తెలుసుకుని కారు దిగివచ్చి ఎంపీ హరిబాబును మన్నించమని అడిగారు. తాను ఉద్దేశపూర్వకంగా ఆ విధంగా చేయలేదన్నారు. సీఎంఆర్‌లో ప్రొటోకాల్ రగడ సద్దుమణిగిందనుకున్నప్పటికీ ఎంపీ హరిబాబు తన ఆగ్రహాన్ని ఎఆర్ గ్రౌండ్స్‌లో జరిగిన అభయం యాప్ ఆవిష్కరణలోనూ కొనసాగించారు.
తన ప్రసంగంలో పోలీసు శాఖపై విమర్శనాస్త్రాలు సంధించారు. పోలీసు వ్యవస్థలో ఇటీవల వస్తున్న మార్పులు, వారి బలహీనలతలు ప్రశాంత నగరంలో అసాంఘిక శక్తులు పెరగడానికి కారణమవుతున్నాయని ఆరోపించారు. రాబోయే రోజుల్లో ఐటి, పర్యాటక రాజధానిగా విశాఖ మారబోతోందని, ఫార్మా కంపెనీలు వస్తున్నాయని కానీ ఇక్కడ నేరాలు పెరుగుతుంటే పారిశ్రామిక వేత్తలు ఎలా వస్తారని ప్రశ్నించారు. పోలీసులు సక్రమంగా, సమర్ధవంతంగా పనిచేస్తే ఇలాంటి అప్లికేషన్ల అవసరం ఉండదని, వీటిని వాడే అవసరం రాకుండా పోలీసు వ్యవస్ధ ఉండాలని అన్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా పోలీసులను సున్నితంగా హె చ్చరించారు. ఆరు నెల ల్లో మూడు హత్యలు జరిగినా ఇన్నాళ్లూ నగరంలో సీపీ, అధికారులు లేరని తప్పించుకున్నామని, ఇక అది కుదరదన్నారు. అనంతరం డీజీపీ రాముడు మాట్లాడుతూ ఎంపీ వ్యాఖ్యలను ఖండిం చారు. పోలీసులు ఎంత సమర్ధవంతంగా పనిచేసినా నేరాలు పూర్తిగా రూపుమాపడం సాధ్యం కాదన్నారు. ఎక్కడైనా అలాంటివి జరిగినట్లు తెలిస్తే ఎంపీ హరిబాబు తెలపాలని సభా ముఖంగా అడిగారు. దీంతో ఎంపీ కాస్త ఇబ్బంది పడ్డారు. సభ అనంతరం సర్కూట్ హౌస్‌లో తనను కలిసిన విలేకరుల వద్ద హోమంత్రి ప్రొటోకాల్ రగడపై విచారం వ్యక్తం చేశారు. కార్యక్రమ నిర్వాహకులు, స్ధానిక ప్రజాప్రతినిధులు ఈ అంశంపై శ్రద్ధ వహించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. అయితే బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలను పిలిచి పనిగట్టుకుని విస్మరించడంతో ఇది టీడీపీ ప్రజాప్రతినిధుల నిర్వాకంగానే వారు భావిస్తున్నట్లు వారి ఆగ్రహంలో కనిపించింది.