కొత్తపేట (హైదరాబాద్) : కశ్మీర్‌లో కర్ఫ్యూ కొనసాగుతున్న నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన అమరనాధ్ యాత్రికుల రక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. సోమవారం తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం స్వగృహంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి రావెల కిశోర్‌బాబు తదితరులతో కలిసి హోంమంత్రి చిన రాజప్ప విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీలో ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు తదితర జిల్లాల నుంచి సుమారు 500 మంది బయలుదేరి వెళ్ళి కశ్మీర్ కర్ఫ్యూలో చిక్కుకున్నారని తెలిపారు. వారంతా సురక్షితంగానే ఉన్నారని, ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున డీజీపీ అక్కడి డీజీపీతో సంప్రదిస్తున్నారని రాజప్ప తెలిపారు. సీఎం చంద్రబాబు కూడా పరిస్థితిని సమీక్షించారన్నారు. అక్కడ కర్ఫ్యూ సడలించిన అనంతరం యాత్రికులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.