Nepal earthquake: నేపాల్‌ను కుదిపేసిన భూకంపం
కఠ్మాండు: హిమాలయ దేశం నేపాల్‌లోని మారుమూల పర్వత ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి సంభవించిన తీవ్ర భూకంపంలో 157 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 160 మందికి పైగా గాయపడ్డారు. వందలాదిగా నివాసాలు ధ్వంసమయ్యాయి. దేశ రాజధాని కఠ్మాండుకు పశి్చమాన 500 కిలోమీటర్ల దూరంలోని జజర్కోట్ జిల్లాలో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదైందని అధికారులు తెలిపారు.
అనంతర ప్రకంపనలు 159 వరకు నమోదైనట్లు చెప్పారు. జాజర్‌కోట్‌తోపాటు రుకుమ్ జిల్లాపైనా భూకంప ప్రభావం చూపిందని పేర్కొన్నారు. తీవ్రతకు కఠ్మాండుతోపాటు భారత్ రాజధాని ఢిల్లీలోనూ భూమి కంపించింది. ఘటనా ప్రాంతంలో నేపాల్ సైన్యం, పోలీసు బృందాలు సహాయ కార్యక్రమాలను వేగవంతం చేశాయి. నేలమట్టమైన ఇళ్ల శిథిలాల్లో చిక్కుబడిపోయిన వారి కోసం సహాయక సిబ్బంది గాలింపు చేపట్టారు.
రోడ్లు, వంతెనలు దెబ్బతినడంతో సహాయ, పునరావాస కార్యక్రమాలకు అవరోధం కలుగుతోందని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య జాజర్కోట్, రుకుమ్ జిల్లాల్లో కలిపి 157కి చేరుకున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. అదేవిధంగా, క్షతగాత్రుల సంఖ్య 160 దాటిందని పేర్కొంది. మృతుల్లో జజర్కోట్ జిల్లా నల్గధ్ మున్సిపాలిటీ డిప్యూటీ మేయర్ సరితా సింగ్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఇళ్లు దెబ్బతినడంతోపాటు భూ ప్రకంపనలు కొనసాగుతుండటంతో భయభ్రాంతులకు గురైన జనం రాత్రంతా వీధుల్లోనే జాగారం చేశారు. శిథిలాల కింద చిక్కుకున్న తమ వారి కోసం జనం చిమ్మచీకట్లోనే తమవంతు ప్రయత్నాలను కొనసాగిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రధానమంత్రి పుష్పకుమార్ దహల్ ‘ప్రచండ’శనివారం ఉదయం వైద్య బృందంతో భూకంప ప్రభావిత ప్రాంతంలో పర్యటించారు. సుర్ఖెట్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు.
నేపాల్ భూకంపంలో ప్రాణ, ఆస్తినష్టం సంభవించడంపై భారత ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సాధ్యమైనంత మేర నేపాల్ ప్రజలకు సాయం అందిస్తామని ప్రకటించారు. టిబెటన్, ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్లు కలిసే ప్రాంతంలో ఉన్న నేపాల్‌కు భూకంపాల బెడద ఎక్కువగా ఉంటోంది. 2015లో నేపాల్‌లో సంభవించిన శక్తివంతమైన భూకంపంలో 9వేల మంది చనిపోగా మరో 22 వేల మందికి పైగా క్షతగాత్రులయ్యారు. 8 లక్షలకు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ ఏడాది అక్టోబర్ నెలలో నేపాల్‌లో మూడుసార్లు భూకంపం సంభవించింది.