హనీమూన్ కాటేజ్‌లో..!
సెలబ్రిటీల జీవితం చాలా బాగుంటుంది. అద్దాల మేడలు, పడవలాంటి కార్లు, అడుగులకు మడుగులొత్తే సేవకులు.. స్వర్గం అంటే ఇదేనేమో అనిపించేలా ఉంటుంది. నాణేనికి రెండు వైపులు ఉన్నట్టుగా.. ఈ స్వర్గం ఒకవైపు మాత్రమే ఉంటుంది. మరోవైపు వీళ్లకి అస్సలు స్వేచ్ఛ ఉండదు. గుట్టుచప్పుడు కాకుండా చేయాలనుకునే విషయాలు కూడా గుప్పుమని నలుగురికీ తెలిసిపోతాయ్. కెరీర్‌పరంగా అపజయాలు. ఇలా ఒక్కోసారి ప్రత్యక్ష నరకం చవిచూస్తారు.
ఆ మధ్య రణబీర్‌కపూర్, కత్రినా కైఫ్ విషయంలో ఇదే జరిగింది. ఈ ఇద్దరూ ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. ఇక్కడుంటే పబ్లిక్‌గా తిరగడానికి కుదరదు కాబట్టి, విదేశాలకు వెళ్లారు. అక్కడ ఓ బీచ్‌లో పొట్టి నిక్కరులో రణబీర్, బికినీలో కత్రినా ఏకాంతంగా గడిపిన దృశ్యాలు ఎవరో సెల్ఫోన్లో బంధించి, ఆ ఇద్దరూ ఇక్కడికొచ్చేసరికి రచ్చ రచ్చ చేసేశారు. గుట్టురట్టయిందని ఇద్దరూ తెగ బాధపడిపోయారు. అప్పుడైతే ఈ ఇద్దరూ అలా చేశారు కాబట్టి, వార్తల్లో నిలిచారు. కానీ, ఇప్పుడేం చేయకుండానే వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం ఈ జంట ఓ చిత్రంలో నటిస్తున్నారు.
ఆ చిత్రం షూటింగ్ ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగింది. అక్కడ రణబీర్, కత్రినాకు ఓ కాటేజ్‌లో బస ఏర్పాటు చేశారు. దాన్ని ‘హనీమూన్ కాటేజ్’ అంటారట. ఆ కాటేజ్‌లో ఈ ఇద్దరూ విడివిడి గదుల్లోనే ఉన్నప్పటికీ, ‘హనీమూన్ కాటేజ్’లో ఉన్నారని ప్రచారమైంది. చివరికి చిత్రబృందం కూడా ఈ విషయంపై జోకులేశారట. రణబీర్, కత్రినా కూడా సరదాగా నవ్వుకున్నారని సమాచారం. ఓవైపు ఈ జోకులను ఎంజాయ్ చేస్తూనే, మరోవైపు ఈ ఇద్దరూ షూటింగ్‌కి విరామం దొరికినప్పుడల్లా తెగ షాపింగ్ చేశారట. ముంబయ్‌లో ఈ ఇద్దరూ ఒకే ఇంట్లో ఉండనున్నారట. ఆ కొత్త ఇంటి కోసమే ఈ షాపింగ్ అనే ఊహాగానాలున్నాయి.