మళ్లీ వెలుగులోకి.. ‘వెలుగుబంటి’
హైదరాబాద్: ఈఎస్ఐ ఆస్పత్రుల నిర్మాణాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐ తాజాగా విచారణ జరుపుతోంది. ఏడేళ్ల క్రితం సంచలనం సృష్టించిన వెలుగుబంటి సూర్యనారాయణకు సంబంధించిన ఈ అవినీతి కేసు మళ్లీ వెలుగులోకి వచ్చింది. వెలుగుబంటి ఈఎస్ఐ ఆస్పత్రుల నిర్మాణాలు చేపట్టారు. వీటిపై ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసింది. ఈఎస్ఐ కేంద్రం పరిధిలోకి వస్తోంది కాబట్టి స్వయంగా సీబీఐ కేసును సుమోటోగా స్వీకరించింది. 2007-08లో సనత్‌నగర్ ఈఎస్ఐ ఆస్పత్రితో పాటు ఉమ్మడి రాష్ట్రంలో మరికొన్ని డిస్పెన్సరీల్లో సుమారు రూ.150 కోట్ల విలువైన నిర్మాణ పనులు జరిగాయి.
ఈ ఆస్పత్రులతో వెలుగుబంటి సూర్యనారాయణకు సంబంధమే లేకపోయినా, తన పలుకుబడితో ఇక్కడ నిర్మాణ పనుల బాధ్యత తీసుకున్నారు. ఈ పనులకు నిధుల చెల్లింపుల్లో భారీగా అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నట్టు రుజువైంది. సీబీఐ కేసును సుమోటోగా స్వీకరించాక కొన్ని రోజులుగా ఈఎస్ఐతో పాటు, అప్పట్లో పనుల నిర్వహణ బాధ్యతలు చేపట్టిన పలువురు ఇంజనీర్లనూ, తాజాగా పలువురు అధికారులనూ విచారిస్తున్నారు. ఈఎస్ఐ నిర్మాణాల్లో జరిగిన అవినీతికంటే పది రెట్లు ఎక్కువగా మందుల కొనుగోళ్లపై అవినీతి జరిగినట్టు విజిలెన్స్‌తో పాటు సీబీఐకి ఫిర్యాదులొచ్చాయి. కాంట్రాక్టర్లు, డెరైక్టరు కుమ్మక్కై కోట్లాది రూపాయలు దోచుకున్నట్టు ఆరోపణలు రావడంతో దీనిపైనా సీబీఐ ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.