hostilities
-
మంచి మాట: శత్రుత్వంతో శత్రుత్వం పెట్టుకుందాం
ఏ ఒకవ్యక్తిని మాత్రమో... ఏ కొంతమందిని మాత్రమో కాదు, కుటుంబాలకు కుటుంబాలను, ఊళ్లకు ఊళ్లను, రాష్ట్రాలకు రాష్ట్రాలను, దేశాలకు దేశాలను, మొత్తం ప్రపంచాన్ని వేధించేది శత్రుత్వం. ప్రతిమనిషికీ, ప్రపంచానికీ శత్రుత్వం తీరని గాయాల్ని కలిగిస్తూనే ఉంది. జీవితాలకు జీవితాలే శత్రుత్వానికి కాలి బూడిద అయిపోయాయి. శత్రుత్వం అగ్ని అయి అందరికీ అంటుకుంది, అంటుకుంటోంది... ఉన్నంతవరకూ నిప్పు కాలుస్తూనే ఉంటుంది. అదేవిధంగా శత్రుత్వం మనిషి కడతేరిపోయేంతవరకూ రగులుతూనే ఉంటుంది. అంతేకాదు వ్యక్తులుపోయాక కూడా వాళ్ల వారసులకూ అంటుకుని శత్రుత్వం వ్యాపిస్తూనే ఉంటుంది, వ్యాపిస్తూనే ఉంది. శ్వాస తీసుకుంటున్నట్లుగా మనిషి శత్రుత్వాన్ని కూడా తీసుకుంటున్నాడేమో అని అనిపిస్తోంది. పుట్టీపుట్టడంతోనే శత్రువును, వ్యాధిని ఎవరైతే పోగొట్టుకోడో అతడు ఎంతటి బలవంతుడైనా నశించిపోతాడని భోజ చరిత్రం చెబుతోంది. అంటే వ్యాధిని, శత్రువును లేదా శత్రుత్వాన్ని ముదరనివ్వకూడదు. సాధ్యమైనంత వేగంగా వాటిని తీర్చేసుకోవాలి. శత్రుత్వం వ్యాధిలాంటిది అని అనడం, అనుకోవడం కాదు శత్రుత్వం వ్యాధికన్నా వినాశకరమైంది అనే సత్యాన్ని మనం తప్పకుండా అవగతం చేసుకోవాలి. కొన్ని దేశాల మధ్యనున్న శత్రుత్వం మరికొన్ని దేశాలనూ బాధించింది, బాధిస్తోంది... కొన్ని దేశాల మధ్యనున్న శత్రుత్వం వల్ల జరిగిన యుద్ధాల్లో కలిగిన ప్రాణ నష్టాన్ని, సంపద నష్టాన్ని చరిత్ర మనకు తెలియజెబుతూనే ఉంది. శత్రుత్వం కారణంగా దేశ దేశాల ప్రజలు విలవిలలాడిపోయారు, విలవిలలాడిపోతున్నారు...ఇటీవలి కరోనా విలయానికి కూడా కొన్ని దేశాల శత్రుత్వమే కారణం అని కొన్ని పరిశీలనలు, విశ్లేషణలు తెలియజేస్తున్నాయి. సంస్కృతి పరంగానూ, సంపదపరంగానూ, విద్యపరంగానూ, అభివృద్ధి పరంగానూ ఏర్పడిన శత్రుత్వం ప్రధాన కారణం కాగా మనదేశంలోకి విదేశీ దురాక్రమణదారులు చొరబడి దేశాన్ని కొల్లగొట్టడమూ, ఆక్రమించుకోవడమూ, సామాజిక పరిస్థితిని అల్లకల్లోలం చెయ్యడమూ అందువల్ల మనదేశానికి పెద్ద ఎత్తున నష్టం, కష్టం కలగడమూ చారిత్రికసత్యంగా మనకు తెలిసిందే. కొన్ని శతాబ్దులకాలం మనదేశం పరపాలనపీడనలో దురవస్థలపాలవడానికి శత్రుత్వం ప్రధానమైన కారణం అయింది. ఒక్క మనదేశంలోనే కాదు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో కూడా శత్రుత్వం కారణంగా ఇలాంటి ఉదంతాలు ఉన్నాయి. ప్రపంచంలోని ఎన్నో దురంతాలకు శత్రుత్వం ఒక్కటే ప్రాతిపదిక అయింది. శత్రుత్వం ఉంటే దురంతమే ఉంటుంది. శత్రుత్వం ప్రేరణకాగా ప్రపంచంలో ఎన్నో ఘోరమైన పరిణామాలు జరిగాయి. శత్రుత్వంవల్ల మనం ఎంత మాత్రమూ క్షేమంగా లేం. శత్రుత్వంవల్ల చాలకాలం క్రితమే మనిషితో మనిషికి ఉండాల్సిన సంబంధం లేకుండాపోయింది. శత్రుత్వం మనిషిని ఆవహించింది అందువల్ల మనం ఎంత మాత్రమూ భద్రంగా లేం. ఈ క్షేత్రవాస్తవాన్ని మనం బుద్ధిలోకి తీసుకోవాలి. మనిషి ప్రగతి, ప్రశాంతతలను, ప్రపంచ ప్రగతి, ప్రశాంతతలను ధ్వంసం చేస్తున్న శత్రుత్వాన్ని తక్షణమే త్యజించాలి. క్షయకరమైన శత్రుత్వం మనిషి లక్షణం కాకూడదు. శత్రుత్వం మనిషి జీవనంలో భాగం కాకూడదు. ‘ఇది నాలుగురోజుల జీవితం ఎందుకు ఎవరితోనైనా శత్రుత్వం? నీకు శత్రుత్వమే కావాలనుకుంటే చెయ్యి శత్రుత్వంతోనే శత్రుత్వం’ ఈ భావంతో తెలుగు కవి–గాయకుడు పి.బి. శ్రీనివాస్ ఒక ఉర్దూగజల్ షేర్ రాసి, పలికారు. ఆలోచిద్దాం... మన బతుకుల వర్తమానాన్నీ, భవిష్యత్తునూ ఛిద్రం చేసే శత్రుత్వం మనకు ఎందుకు? ఆలోచిద్దాం... మనం జీవించడానికి శత్రుత్వం అవసరం ఉందా? మనం శత్రుత్వాన్ని సంపూర్ణంగా వదిలేసుకుందాం. అది సాధ్యం కాకపోతే శత్రుత్వంతోనే శత్రుత్వం చేద్దాం. సాటి మనిషికీ, సమాజానికీ కాదు మనిషి శత్రుత్వానికి శత్రువైపోవాలి. మనిషికి శత్రుత్వంలో ఉన్న నిజాయితి, అభినివేశం స్నేహంలో లేకుండా పోయాయి. ఇది విధ్వంసకరమైన స్థితి. ఈ స్థితి మనకు వద్దు. మనిషి తీరు మారాలి. శత్రుత్వం ఇలలో లేకుండా పోవాలి. ఇప్పటికే మనమందరమూ శత్రుత్వం వల్ల ఆవేదన చెందుతున్నాం. ఇకనైనా సంసిద్ధులమై శత్రుత్వంతో శత్రుత్వమూ, స్నేహంతో స్నేహమూ చేస్తూ బతుకుదాం. నిజమైన మనుషులమై మనం మనకూ, ప్రపంచానికీ వీలైనంత మంచి, మేలు చేసుకుందాం. ‘ఇది నాలుగురోజుల జీవితం, ఎందుకు ఎవరితోనైనా శత్రుత్వం? / నీకు శత్రుత్వమే కావాలనుకుంటే చెయ్యి శత్రుత్వంతోనే శత్రుత్వం‘ – రోచిష్మాన్ -
పాత కక్షలతో వ్యక్తి హత్య
జిన్నారం(పటాన్చెరు) : పెళ్లి విషయంలో పాత కక్షలు పెంచుకొని మేనల్లుడే మామను హత్య చేశాడు. ఈ సంఘటన జిన్నారం మండలం బొల్లారం గ్రామ బీసీ కాలనీలో సోమవారం తెల్లవారు జామున జరిగింది. బొల్లారం సీఐ లక్ష్మారెడ్డి, స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. జిన్నారం మండలం బొల్లారం గ్రామ బీసీ కాలనీలో సాంతుల గోవిందు(55) అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. స్థానికంగా రాళ్లు కొట్టుకుంటూ గోవిందు జీవనాన్ని సాగిస్తున్నాడు. చెల్లెలు కుమారుడు, మేనల్లుడైన సెల్వికి తన కూతురును ఇచ్చి పెళ్లి చేస్తానని గతంలో గోవిందు చెప్పారు. కొన్ని కారణాల వల్ల గోవిందు తన కుమార్తెను సెల్వికి ఇచ్చి పెళ్లి చేయలేదు. ఈ సంఘటన జరిగి ఏడాది గడుస్తోంది. ఈ క్రమంలో సెల్వి తన మేనమామ గోవిందుపై అప్పటి నుంచి కక్ష పెంచుకున్నాడు. ఆదివారం రాత్రి గోవిందు తన భార్య కస్తూరి, కుమారుడు పెరుమాళ్లుతో కలిసి తను నివాసం ఉంటున్న ఇంటి బయట నిద్రించాడు. తెల్లవారు జామున అతని కుమారుడు, భార్య ఇంట్లోకి వెళ్లి నిద్రించాడు. ఇంటి పక్కనే ఉంటున్న సెల్వి ఒంటరిగా గోవిందు నిద్రిస్తుండడాన్ని గమనించి బండరాయితో అతడి తలపై బాదాడు. దీంతో తీవ్ర రక్తస్రావమైంది. బయట శబ్ధం రావడంతో భార్య కస్తూరి బయటకు వచ్చి చూసింది. అప్పటికే గోవిందు రక్తం మడుగులో ఉన్నాడు. ఆçసుపత్రికి తరలించేందుకు 108 వాహనాన్ని పిలిపించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు 108 సిబ్బంది తెలిపారు. మృతుడి భార్య కస్తూరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ లక్ష్మారెడ్డి తెలిపారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
విద్వేషాలు సృష్టిస్తున్నారు : కోదండరాం
వరంగల్, న్యూస్‌లైన్ : ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి, ఘర్షణలు సృష్టించేందుకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు యత్నిస్తున్నారని టీజేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని హింసను ప్రేరేపించి తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. సీఎం తెరవెనుక ఉండి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణకు తాను అడ్డంకాదంటూ పాలకుర్తిలో చెప్పిన చంద్రబాబు... ఇప్పుడు తానే గతంలో అడ్డుకున్నానంటూ ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో శాంతిని కోరుకుంటున్న తెలంగాణ ప్రజలపై బాధ్యత ఎక్కువగా ఉందన్నారు. వరంగల్ జిల్లా హన్మకొండ కాళోజీ సెంటర్లో టీజేఏసీ ఆధ్వర్యంలో మహాశాంతి దీక్ష గురువారం జరిగింది. తెలంగాణ నినాదాలు, ఆటాపాటలతో ఓరుగల్లు హోరెత్తగా... ప్రధాన రహదారి జనంతో నిండిపోయింది. ఈ దీక్షలకు ముఖ్య అతిథిగా హాజరైన కోదండరాం మాట్లాడుతూ, ‘ఉల్టా చోర్ కొత్వాల్‌కు డాంటే’ అనే తీరుగా మనమే (తెలంగాణ వారు) ఏదో చేస్తున్నట్లుగా కేంద్రంలో వీళ్లే ఫిర్యాదులు చేస్తున్నారని మండిపడ్డారు. సీమాంధ్ర ప్రజల్లో సైతం ఆందోళన కలిగిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రం విడిపోతే ఏ హక్కు ఉండదంటూ చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ఇక కొందరు నాయకులు హైదరాబాద్‌ను యూటీ చేయాలంటున్నారని, ఇది సరికాదన్నారు. సీఎం స్థాయిలో ఉండి సీఎం కిరణ్ నీళ్ల విషయంలో రెచ్చగొడుతున్నారన్నారు. చంద్రబాబుతో హైదరాబాద్ నాశనం రావొచ్చు.. పోవొచ్చు... సచివాలయంపై పెత్తనం మాత్రం వద్దన్నదే తమ అభిప్రాయమని కోదండరాం అన్నారు. రాష్ట్రం విడిపోతే కాంట్రాక్టులు, వనరులపై పెత్తనం దక్కయేమోనని సీమాంధ్ర పాలకులు ఆందోళన చెందుతున్నారని కోదండరాం విమర్శించారు. చంద్రబాబువల్ల హైదరాబాద్ నగరం నాశనమైందని ఆరోపించారు. విభజన జరిగితే ఏ సమస్యలు ఉత్పన్నమవుతాయో చెప్పకుండా శాంతిభద్రతలకు విఘాతాలు సృష్టించి అగ్గిరాజేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు తక్షణం పెడితే సమస్యకు పరిష్కారం లభిస్తుందనేది తమ ప్రతిపాదనగా చెప్పారు. ఎవరు అడ్డుపడ్డా తెలంగాణ ఆగదు తెలంగాణ మీటింగ్‌లకు, ర్యాలీలకు అనుమతివ్వకుండా సీమాంధ్ర సర్కార్ అడ్డుకుంటోందని కోదండరాం అన్నారు. వీళ్లతో ఏమైతదని భావించే చంద్రబాబు, కిరణ్ అడ్డుపడుతున్నారని విమర్శించారు. ఎవరు అడ్డుపడ్డా తెలంగాణ ఆగదన్నారు. ఏడో తేదీనశాంతిర్యాలీ జరిపితీరుతమన్నారు. దీక్షల్లో టీజేఏసీ కో-కన్వీనర్ శ్రీనివాసగౌడ్, టీఎన్జీవోల రాష్ట్ర అధ్యక్షుడు దేవిప్రసాద్, ప్రధాన కార్యదర్శి కారం రవీందర్‌రెడ్డి, టీఆర్ఎస్ నేతలు ఈటెల రాజేందర్, వినయ్‌భాస్కర్, విద్యార్థులు, తెలంగాణవాదులు పాల్గొన్నారు.