విద్వేషాలు సృష్టిస్తున్నారు : కోదండరాం
వరంగల్, న్యూస్‌లైన్ : ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి, ఘర్షణలు సృష్టించేందుకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు యత్నిస్తున్నారని టీజేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని హింసను ప్రేరేపించి తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. సీఎం తెరవెనుక ఉండి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణకు తాను అడ్డంకాదంటూ పాలకుర్తిలో చెప్పిన చంద్రబాబు... ఇప్పుడు తానే గతంలో అడ్డుకున్నానంటూ ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో శాంతిని కోరుకుంటున్న తెలంగాణ ప్రజలపై బాధ్యత ఎక్కువగా ఉందన్నారు.
వరంగల్ జిల్లా హన్మకొండ కాళోజీ సెంటర్‌లో టీజేఏసీ ఆధ్వర్యంలో మహాశాంతి దీక్ష గురువారం జరిగింది. తెలంగాణ నినాదాలు, ఆటాపాటలతో ఓరుగల్లు హోరెత్తగా... ప్రధాన రహదారి జనంతో నిండిపోయింది. ఈ దీక్షలకు ముఖ్య అతిథిగా హాజరైన కోదండరాం మాట్లాడుతూ, ‘ఉల్టా చోర్ కొత్వాల్‌కు డాంటే’ అనే తీరుగా మనమే (తెలంగాణ వారు) ఏదో చేస్తున్నట్లుగా కేంద్రంలో వీళ్లే ఫిర్యాదులు చేస్తున్నారని మండిపడ్డారు. సీమాంధ్ర ప్రజల్లో సైతం ఆందోళన కలిగిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రం విడిపోతే ఏ హక్కు ఉండదంటూ చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ఇక కొందరు నాయకులు హైదరాబాద్‌ను యూటీ చేయాలంటున్నారని, ఇది సరికాదన్నారు. సీఎం స్థాయిలో ఉండి సీఎం కిరణ్ నీళ్ల విషయంలో రెచ్చగొడుతున్నారన్నారు.
చంద్రబాబుతో హైదరాబాద్ నాశనం
రావొచ్చు.. పోవొచ్చు... సచివాలయంపై పెత్తనం మాత్రం వద్దన్నదే తమ అభిప్రాయమని కోదండరాం అన్నారు. రాష్ట్రం విడిపోతే కాంట్రాక్టులు, వనరులపై పెత్తనం దక్కయేమోనని సీమాంధ్ర పాలకులు ఆందోళన చెందుతున్నారని కోదండరాం విమర్శించారు. చంద్రబాబువల్ల హైదరాబాద్ నగరం నాశనమైందని ఆరోపించారు. విభజన జరిగితే ఏ సమస్యలు ఉత్పన్నమవుతాయో చెప్పకుండా శాంతిభద్రతలకు విఘాతాలు సృష్టించి అగ్గిరాజేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు తక్షణం పెడితే సమస్యకు పరిష్కారం లభిస్తుందనేది తమ ప్రతిపాదనగా చెప్పారు.
ఎవరు అడ్డుపడ్డా తెలంగాణ ఆగదు
తెలంగాణ మీటింగ్‌లకు, ర్యాలీలకు అనుమతివ్వకుండా సీమాంధ్ర సర్కార్ అడ్డుకుంటోందని కోదండరాం అన్నారు. వీళ్లతో ఏమైతదని భావించే చంద్రబాబు, కిరణ్ అడ్డుపడుతున్నారని విమర్శించారు. ఎవరు అడ్డుపడ్డా తెలంగాణ ఆగదన్నారు. ఏడో తేదీనశాంతిర్యాలీ జరిపితీరుతమన్నారు. దీక్షల్లో టీజేఏసీ కో-కన్వీనర్ శ్రీనివాసగౌడ్, టీఎన్జీవోల రాష్ట్ర అధ్యక్షుడు దేవిప్రసాద్, ప్రధాన కార్యదర్శి కారం రవీందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నేతలు ఈటెల రాజేందర్, వినయ్‌భాస్కర్, విద్యార్థులు, తెలంగాణవాదులు పాల్గొన్నారు.