బాధ్యతాయుతంగా పనిచేయాలి
అధికారులు, ఉద్యోగులకు మంత్రి ఈటల సూచన
తిమ్మాపూర్ : ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం కలిగేలా అధికారులు, ఉద్యోగులు పని చేయాలని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తిమ్మాపూర్ తహసీల్దార్ కార్యాలయ నూతన భవనాన్ని ఆయన బుధవారం ప్రారంభించి, మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ.. కొత్త రాష్ట్రంలో కొత్త ఒరవడితో, బాధ్యతాయుతంగా పని చేయాలని సూచించారు. నిజాంల కాలంలో నిర్మించిన భవనాలు వందేళ్లు చెక్కు చెదరకుండా ఉంటే.. ఇప్పుడు లక్షలు ఖర్చు చేసి నిర్మిస్తున్న భవనాలు మాత్రం ఇరవై సంవత్సరాలకే శిథిలావస్థకు చేరుతున్నాయని, పనుల్లో నాణ్యత కొరవడుతోందని అన్నారు. ప్రభుత్వం ఖర్చు చేస్తున్న ప్రతి పైసా ప్రజల కష్టార్జితమనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, పుట్ట మధు, ఎమ్మెల్సీ నారాదాసు లక్ష్మణ్‌రావు, జాయింట్ కలెక్టర్ శ్రీదేవసేన, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, ఎంపీపీ ప్రేమలత, జెడ్పీటీసీలు పద్మ, ఎంపీపీ శరత్‌రావు, కేడీసీసీబీ డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, ఆర్డీవో చంద్రశేఖర్, తహశీల్దార్ కోమల్‌రెడ్డి, ఎంపీడీవో పవన్‌కుమార్, వైస్ ఎంపీపీ భూలక్ష్మి, సర్పంచ్ స్వరూప, ఎంపీటీసీ సుగుణమ్మ పాల్గొన్నారు.
నిర్మితికేంద్రం స్థలాన్ని ఖాళీ చేయించండి
నిర్మితికేంద్రాన్ని వెంటనే ఖాళీ చేయించి స్థలాన్ని మోడల్ స్కూల్‌కు అప్పగించాలని జేసీ శ్రీదేవసేనను మంత్రి ఆదేశించారు. ఇటుకలు ఉండడంతో మోడల్‌స్కూల్ హాస్టల్లోకి పాములు, పురుగులు వస్తున్నాయని ఎమ్మెల్యే తెలపడంతో స్థలాన్ని మంత్రి పరిశీలించి ఆదేశాలు జారీ చేశారు. తహసీల్దార్ ఆఫీసు మెట్లపై జారకుండా ఉండే టైల్స్ వేయాలని సూచించారు. మోడల్ స్కూల్లో వంట చేయడాన్ని పరిశీలించారు.
సమాచారం ఇచ్చేలా చూడాలి
జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాల సమాచారాన్ని ప్రొటోకాల్ ప్రకారం అందరికీ అందేలా చూడాలని ఎమ్మెల్సీ నారాదాసు లక్ష్మణ్‌రావు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఎల్ఎండీ అతిథిగృహంలో ఆయన మంత్రితో మాట్లాడారు. పలు కార్యక్రమాల సమాచారం ప్రజాప్రతినిధులకు అందడం లేదని, ఇలాంటి సమాచార లోపం పునరావృతం కాకుండా చూడాలని కోరారు.