ఇసుక, సిమెంట్ లేకుండానే.. గోడలకు ప్లాస్టరింగ్!
సాధారణంగా మనం చూసే భవనాలన్నీ ఇసుక, సిమెంట్ కలిపిన ఆర్సీసీ కాంక్రీట్ లేదా మైవాన్ అల్యూమీనియంతో ఉంటాయి. పైకప్పు, గోడలు అన్నీ వీటితోనే నిర్మిస్తుంటారు. దీంతో ఈ ఇళ్లలో వేడి ఎక్కువగా ఉంటుంది. పైగా ఇసుక, సిమెంట్ ధరల పెరుగుదల కారణంగా గోడలు, ప్లాస్టరింగ్‌లకు అయ్యే ఖర్చు తడిసిమోపడవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా ఖనిజ జిప్సం అందుబాటులోకి వచ్చేసింది. ఇసుక, సిమెంట్ అవసరం లేకుండానే నేరుగా ఇటుకల మీదపూతలాగే పూయడమే మినరల్ జిప్సం పన్నింగ్ ప్రత్యేకత. పైగా దీనికి చుక్క నీటితో క్యూరింగ్ కూడా అవసరం లేదు. అంతేకాకుండా మినరల్ జిప్సం ఇళ్లలో గది ఉష్ణోగ్రతలు 2–3 డిగ్రీలు తక్కువగా ఉంటాయి. – సాక్షి, సిటీబ్యూరోమన దేశంలో అపారమైన నదుల కారణంగా ఇసుక లభ్యత ఎక్కువ. దీన్ని ఆసరా చేసుకొని బ్రిటీష్ రాజులు మన దేశంలో సిమెంట్ కర్మాగారాలు నెలకొల్పి, అందుబాటులో ఉన్న ఇసుకను కలిపి నిర్మాణ రంగంలో వినియోగించడం మొదలు పెట్టారు. కాలక్రమేణా నది ఇసుక కొరత ఏర్పడటంతో రోబో శాండ్ మార్కెట్లోకి వచ్చింది. దీనికి పట్టుత్వం తక్కువగా ఉండటంతో ప్రత్యామ్నాయంగా జిప్సం వినియోగం పెరిగింది. భూగర్భంలో బంగారం, బొగ్గు, ఇనుము వంటి గనులలాగే జిప్సం కూడా ఖనిజమే. మన దేశంలో రాజస్థాన్‌లోని బికానెర్, కశ్మీర్ వ్యాలీలో మాత్రమే మినరల్ జిప్సం గనులు ఉన్నాయి. మార్కెట్లో కాంపోజిట్, మినరల్ జిప్సం అని రెండు రకాలు ఉంటాయి. సిమెంట్ పరిశ్రమల వ్యర్థాల నుంచి వెలువడే తెల్లటి పదార్థాన్ని కాంపోజిట్ జిప్సం అంటారు. దీన్ని ఇటుక, చాక్‌పీస్ తయారీలో ఎక్కువగా వినియోగిస్తుంటారు. మినరల్ జిప్సం భూగర్భంలో నుంచి వెలికితీసే గని. దీని రసాయన నామం కాల్షియం సల్ఫేట్ డీహైడ్రేట్ (సీఏఎస్‌ఓ4).అంతర్గత గోడలు, సీలింగ్లకే.. ఖనిజ జిప్సంకు నిరంతరం నీరు తాకితే తేమ కారణంగా పాడైపోతాయి. అందుకే దీన్ని ఇంటి లోపల అంతర్గత గోడలు, సీలింగ్‌లకు మాత్రమే వినియోగిస్తారు. బయట గోడలకు, బాత్రూమ్, టాయిలెట్స్ గోడలకు వినియోగించరు. ఆర్సీసీ కాంక్రీట్‌ను తాపీతో వేయాలి లేకపోతే చేతులు, కాళ్లకు పొక్కులు వస్తాయి. అదే మినరల్ జిప్సంను నేరుగా చేతులతో కలుపుతూ గోడలకు పూత లాగా పూస్తారు. ఈ గోడలు చాలా తేలికగా ఉండటంతో ఇంటి శ్లాబ్ మీద బరువు పెద్దగా పడదు. మినరల్ జిప్సంను నివాస, వాణిజ్య, కార్యాలయ అన్ని రకాల భవన సముదాయాల నిర్మాణంలో వినియోగిస్తారు.ఎంత ఖర్చు అవుతుందంటే.. ఆర్సీసీ కాంక్రీట్‌తో చదరపు అడుగు గోడ ప్లాస్టరింగ్ రూ.50–55 ఖర్చు అవుతుంది. అదే జిప్సం పన్నింగ్కు అయితే రూ.35–40తో అయిపోతుంది. అలాగే చ.అ. కాంక్రీట్ గోడ క్యూరింగ్‌కు 7 లీటర్ల నీళ్లు అవసరం కాగా.. కనిష్టంగా ఏడు రోజుల పాటు క్యూరింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక, జిప్సం గోడలకు క్యూరింగే అవసరం లేదు. ఉదాహరణకు.. త్రీ బీహెచ్‌కే ఫ్లాట్‌లో అంతర్గత గోడలు నాలుగు వైపులా కలిపితే 5 వేల చ.అ. ఉంటాయి. వీటి క్యూరింగ్‌కు 25 వేల నీళ్లు అవసరం అవుతాయి. ఈలెక్కన ఖనిజ జిప్సంతో నీళ్లు, సమయం, డబ్బు ఆదా అవుతుందన్నమాట.ఇళ్లంతా చల్లగా.. మినరల్ జిప్సంకు వేడి, అగ్ని, ధ్వనిని నిరోధించే శక్తి ఉంటుంది. ఇందులోని థర్మల్ ప్రూఫ్ కారణంగా బయటితో పోలిస్తే ఇంటి లోపల ఉష్ణోగ్రతలు 2–3 డిగ్రీలు తక్కువగా ఉంటాయి. అలాగే ఖనిజ జిప్సంతో ఉండే ఇంట్లో చల్లదనం కోసం ఏసీ ఎక్కువ సమయం వేయాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా మినరల్ జిప్సంకు అగ్ని ప్రమాదాలను తట్టుకుంటాయి. నింతరంగా మూడు గంటల పాటు అగ్నిని నిరోధిస్తాయి. ఖనిజ జిప్సంతో కట్టే గోడలు చాలా మృదువుగా, పాలవలే తెల్లగా ఉంటాయి. దీంతో చూసేందుకు ఎంతో అందంగా ఉంటాయి.