15 నెలల్లో 10 వేల ఇళ్ల నిర్మాణం
- జగన్నాథగట్టుపై స్థలం ఎంపిక
- ఈనెల 17న టెండర్ల ప్రక్రియ
- వచ్చే సంక్రాంతికి 5 వేల ఇళ్లు ప్రారంభానికి చర్యలు
- శాశ్వతంగా మంచినీటి సమస్యకు పరిష్కారం
- కర్నూలులో పురపాలక మంత్రి నారాయణ విస్రృత పర్యటన
కర్నూలు(టౌన్): ఎన్టీఆర్ పట్టణ గృహ నిర్మాణ పథకం కింద కర్నూలు నగర శివారులో వచ్చే 15 నెలల్లో 10 వేల ఇళ్లు నిర్మిస్తున్నట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. హౌసింగ్ ఫర్ ఆల్, మంచినీటి సమస్యను స్వయంగా పరిశీలించేందుకు మంత్రి శనివారం కర్నూలుకు వచ్చారు. స్థానిక ప్రభుత్వ అతిథి గృహానికి చేరుకున్న మంత్రిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, జిల్లా కలెక్టర్ సి.హెచ్. విజయమోహన్, జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ మర్యాద పూర్వకంగా కలిశారు. కొద్దిసేపు హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ గురించి చర్చించారు.
శివారు ప్రాంతాల పరిశీలన
హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ కింద ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు నగర శివారులోని పలు ప్రాంతాలను మంత్రి పరిశీలించారు. మంత్రి వెంట ఎంపీ టీజీ వెంకటేష్, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ, అర్బన్ హౌసింగ్ అధికారులు ఈఈ చంద్రశేఖర్ రెడ్డి, డీఈ నాగరాజు, కేజే రెడ్డి, నగరపాలక కమిషనర్ ఎస్. రవీంద్రబాబు ఉన్నారు. ముందుగా స్థానిక జొహరాపురం డంపింగ్ యార్డు స్థలాన్ని పరిశీలించారు. అలాగే టీవీ 9 కాలనీ, రాగమయూరి హిల్స్, జగన్నాథగట్టు, తడకనపల్లె, సమ్మర్‌స్టోరేజ్ ట్యాంకు ప్రాంతాలను పరిశీలించారు. వీటన్నింటిని పరిశీలించిన తరువాత స్థానిక నగరపాలక సంస్థలో ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి చర్చించారు. చివరకు జగన్నాథగట్టుపై స్థలాన్ని ఖరారు చేశారు.
మంత్రిని కలసిన జేసీ: కర్నూలు నగరంలో మంత్రి పర్యటిస్తున్నట్లు తెలుసుకున్న అనంతపురం పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్ రెడ్డి స్థానిక నగరపాలకలో మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాదు వెళ్తున్న ఆయన మంత్రి ఉన్నట్లు తెలియడంతో పది నిముషాలు కలసి వెళ్లిపోయారు. అనంతరం నగరపాలక కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
ఇళ్ల నిర్మాణంలో ఆధునిక టెక్నాలజీ: మంత్రి నారాయణ
పేద, మధ్యతరగతి ప్రజలకు అత్యంత టెక్నాలజీని ఉపయోగించి ఇళ్ల నిర్మాణాలను చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. స్థానిక జగన్నాథగట్టు వద్ద 100 ఎకరాల్లో అందరికీ ఇళ్లు స్కీమ్‌కు సంబంధించి ఈనెల 17 టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి వేగవంతంగా పనులు చేపడతామన్నారు. వచ్చే సంక్రాంతి నాటికి 5 వేల ఇళ్లు పూర్తి చేస్తామన్నారు. కాంట్రాక్టర్లు జాప్యం చేస్తే ఫెనాల్టీ విధిస్తున్నట్లు తెలిపారు. గృహ నిర్మాణాలకు వినియోగించే స్టీల్, వెర్టిఫైడ్ ఫ్లోరింగ్, కలపతో తయారు చేసిన తలుపులు, కిటికీలు వినియోగిస్తామన్నారు.
కర్నూలు నగర ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ కర్నూలు నగరంలో మంచినీటి సమస్య పరిష్కారానికి శాశ్వతంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ముచ్చుమర్రి స్కీమ్ ద్వారా నేరుగా మంచినీటి తరలించేందుకు ప్రతిపాదనలకు మంత్రి ఆమోదం వ్యక్తం చేశారన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా మున్సిపల్ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రూ. 10 కోట్లు మంజూరు చేశారన్నారు. సమావేశంలో నగరపాలక అధికారులు, ఇంజినీర్లు పాల్గొన్నారు.