హౌసింగ్ బోర్డు స్థలాలపై కలెక్టర్ ఆరా
సిద్దిపేట, న్యూస్‌లైన్ : సిద్దిపేట హౌసింగ్ బోర్డు స్థలాల మీద అక్రమార్కులు కన్నేసిన వైనంపై జిల్లా పాలనా యంత్రాంగం అప్రమత్తమైంది. ‘జాగు చేస్తే జాగా గల్లంతు!’ శీర్షికన ‘సాక్షి’లో గురువారం ప్రచురితమైన కథనానికి జిల్లా కలెక్టరు స్మితాసబర్వాల్ స్పందించారు. అర్బన్డేను పురస్కరించుకుని ఆయా మున్సిపాలిటీల కమిషనర్లతో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఆమె సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం సిద్దిపేట పురపాలక సంఘం కమిషనర్ ఆర్.రాంబాబును ప్రత్యేకంగా పిలిచి ఆ జాగా వ్యవహారంపై ప్రశ్నించారని సమాచారం. ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాలని కలెక్టర్ తేల్చిచెప్పారని తెలుస్తోంది. తనకు రెవెన్యూ శాఖ తరఫున సహకారం ఇప్పిస్తే సదరు స్థలాలను సందర్శిస్తామని కమిషనర్ విన్నవించడంతో ఆమె అందుకు సానుకూలత వ్యక్తం చేశారని తెలిసింది. తహశీల్దారు/డిప్యూటీ తహశీల్దారుతో కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేయాలని స్మితాసబర్వాల్ ఆదేశించారు. నాలుగు ఎకరాల 15 గుంటల స్థలాన్ని సంయుక్తంగా సర్వే చేసి ఏమైనా ఆక్రమణకు గురైందా లేక సురక్షితంగా ఉన్నదా..? అనేది ఈ నేపథ్యంలో నిర్ధారించనున్నారు.
స్థానిక అధికారుల్లో కదలికలు...
సిద్దిపేటలోని హౌసింగ్ బోర్డు 1340 సర్వే నంబరులో నాలుగు ఎకరాల 15 గుంటల ప్రభుత్వ స్థలాన్ని కాపాడేందుకు స్థానిక అధికారుల్లో కదలికలు మొదలయ్యాయి. కలెక్టరు ఆదేశాల ప్రకారం రంగంలోకి దిగేందుకు సన్నద్ధమవుతున్నారు. ఆ జాగా మొత్తం ఖాళీగా ఉన్నదా లేక ఏమైనా కట్టడాలు వెలిశాయా? అనేది చూస్తారు. అక్రమార్కులు ఆక్రమించుకోకుండా కంచె వేయించేందుకు ఇప్పటికే ప్రతిపాదించారు. ప్రభుత్వ భూమిని రక్షించేందుకు రెవెన్యూ అధికారులు, ఏమైనా అనుమతిలేని నిర్మాణాలు జరిగితే చర్యలు తీసుకునేందుకు మున్సిపల్ యంత్రాంగం యోచిస్తున్నాయి. మొత్తంగా రెండు శాఖలూ సమన్వయంతో పట్టణంలోని సర్కారు జాగాలను కాపాడడంలో ఏమేరకు సఫలీకృతమవుతాయో చూడాలి.