Housing Colony
-
YSR Jagananna Colonies: కాలనీ కాదు.. ఊరే..
ఆనందపురం(భీమిలి): అర్హత గల ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృఢ సంకల్పంతో రాష్ట్రంలో కాలనీలు కాదు.. ఏకంగా ఊళ్లకు ఊళ్లే రూపుదిద్దుకుంటున్నాయి. గతంలో ఒకటి అరా కాలనీ ఇళ్లు మంజూరు చేసి.. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో.. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను సగంలోనే విడిచి పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా అన్ని సౌకర్యాలతో కాలనీలను నిర్మించి నివాసయోగ్యంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడంతో.. జగనన్న కాలనీ నిర్మాణ పనులు ఓ పద్ధతిలో జరిగి గ్రామాలను తలపిస్తున్నాయి. అందుకు ఉదాహరణే మండలంలోని వెల్లంకి జగనన్న కాలనీ. ఇక్కడ సుమారు రూ.60 కోట్లు విలువ చేసే 10 ఎకరాల ప్రభుత్వ భూమిని జగనన్న కాలనీకి కేటాయించి సుమారు 300 మంది లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. ముందుగానే విశాలమైన గ్రావెల్ రోడ్డును ఏర్పాటు చేశారు. విద్యుద్ధీకరణ పనులు చేపట్టారు. దీంతో మొత్తం లబ్ధిదారులందరూ ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టారు. అందులో దాదాపు వంద ఇళ్లు వరకూ పూర్తయ్యాయి. లబ్ధిదారులు గృహ ప్రవేశాలు కూడా చేసేశారు. సకాలంలో ఇసుక, సిమెంట్‌తోపాటు ఆర్థిక సాయాన్ని కూడా అందిస్తుండడంతో మిగతా ఇళ్ల నిర్మాణం కూడా చురుగ్గా సాగుతోంది. ఇక్కడ ఒకేసారి మూడు వందల ఇళ్లు నిర్మిస్తుండడంతో ఓ కొత్త ఊరును తలపిస్తోంది. నిర్దేశించిన స్థలంలో లబ్ధిదారుడు తనకు నచ్చిన విధానంలో ఇంటిని నిర్మించుకోవచ్చని ప్రభుత్వం స్వేచ్ఛనిచ్చింది. దీంతో లబ్ధిదారులు ఆధునిక సౌకర్యాలతో నిర్మించుకోవడంతో ఇక్కడ పట్టణ వాతావరణం ప్రతిబింబిస్తోంది. ఈ కాలనీపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న అధికారులు ఆదర్శకాలనీగా తీర్చిదిద్దుతున్నారు. కలలో కూడా ఊహించలేదు వలస వచ్చి వెల్లంకిలో భర్త, ఇద్దరు పిల్లలతో అద్దె ఇంట్లో ఉంటున్నాం. నా భర్త ముసిలిబాబు వంటల పనికి వెళ్లి కుటుంబాన్ని పోషిస్తున్నారు. చాలీచాలని కూలి వల్ల అద్దె చెల్లించుకోలేని పరిస్థితిలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇల్లు మంజూరు చేశారు. అధికారులు అన్ని రకాలగా సహకారం అందించడంతో ఇంటి నిర్మాణం పూర్తి చేసుకుని.. అందులోనే నివాసం ఉంటున్నాం. అద్దె భారం తొలగిపోయింది. ముఖ్యమంత్రి జగనన్నకు ఆజన్మాంతం రుణపడి ఉంటాం. – వెర్రి దేవి, జగనన్న కాలనీ లబ్ధిదారు, వెల్లంకి జగనన్న రూ.లక్షల ఆస్తినిచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాలాంటి పేదలకు లక్షలు విలువ చేసే ఆస్తిని కాలనీ ఇంటి రూపంలో అందజేసి ఎంతో సాయపడ్డారు. నేను నా భర్త రోజు కూలి చేసుకుని ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నాం. దీనికి ముందు తెలిసిన వారి స్థలంలో కమ్మలపాక వేసుకుని ఉండేవాళ్లం. వర్షాకాలం వస్తే కారిపోయి నానా ఇబ్బందులు పడ్డాం. రూపాయి ఖర్చే లేకుండా స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించిన జగన్ బాబే మరలా ముఖ్యమంత్రి కావాలి. – బూస రామయ్యమ్మ, ఇంటి లబ్ధిదారు, వెల్లంకి (చదవండి: అదిగో పులి... ఇదిగో తోక) -
కాలనీలు ఖాళీ చేయండి.. ఎయిర్ ఇండియా ఉద్యోగులతో కేంద్రం
న్యూఢిల్లీ: వ్యాపార రంగంలో నిజాయితీ, నీతి, విలువలకు మారుపేరని టాటా గ్రూప్‌పై జనాల్లో ఓ పేరుంది. అందుకు తగ్గట్లే ఆ కంపెనీ వ్యవహరిస్తుంటుంది కూడా. కిందటి ఏడాది ఎయిర్ ఇండియాను జేక్కించుకున్న టాటా గ్రూప్.. ఈమధ్యే పని చేసే చోట ఉద్యోగుల ధూమపానం, మద్యపానంపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఉద్యోగుల కోసం మరో కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ సంబంధిత హౌజింగ్ కాలనీల్లో ఉంటున్న ఉద్యోగులు.. ఖాళీ చేయాలంటూ కోరింది టాటా గ్రూప్ ఎయిర్ ఇండియా. ఇందుకోసం జులై 26వ తేదీ దాకా గడువు ఇచ్చింది. అలా చేయడంలో విఫలమైతే ఉద్యోగులు పెనాల్టీ, డ్యామేజ్ ఛార్జీలు చెల్లించడంతోపాటు రిటైర్మెంట్.. ఇతర ఉద్యోగ ప్రయోజనాలను కోల్పోతారని ఎయిర్ ఇండియా హెచ్చరించింది. ఈ మేరకు మే 18వ తేదీనే ఆదేశాలు జారీ చేసింది. ఎయిర్ ఇండియా స్పెసిఫిక్ అల్టర్నేటివ్ మెకానిజం (AISAM).. నిర్ణయానికి అనుగుణంగానే ఈ చర్యకు ఉపక్రమించింది ఎయిర్ ఇండియా అస్సెట్స్ హోల్డింగ్ లిమిటెడ్ (AIAHL). ఎయిర్ ఇండియా బిడ్‌ను టాటా గ్రూప్.. కిందటి ఏడాది అక్టోబర్ 8వ తేదీన గెల్చుకుంది. అయితే పెట్టుబడుల ఉపసంహరణ నిబంధనల ప్రకారం.. హౌసింగ్ కాలనీలు వంటి ఎయిర్‌లైన్ నాన్-కోర్ ఆస్తులు మాత్రం ప్రభుత్వం వద్దే ఉంటాయి. ఇదిలా ఉంటే.. ఎయిర్ ఇండియాకు ఢిల్లీ, ముంబైలో హౌజింగ్ కాలనీలు ఉన్నాయి. 1,800 మందికి పైగా ఉద్యోగులు అందులో నివాసం ఉంటున్నారు. వీళ్లంతా కేంద్రం చర్యను వ్యతిరేకిస్తూ.. కోర్టును ఆశ్రయించాలనుకుంటున్నారు. ఎయిర్ ఇండియా అస్సెట్స్ హోల్డింగ్ లిమిటెడ్ 2019లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక ఎయిర్ ఇండియా స్పెసిఫిక్ అల్టర్నేటివ్ మెకానిజంను కేంద్ర మంత్రుల బృందం పర్యవేక్షిస్తుంది. హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంతత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా.. ఈ వ్యవహారాలను చూస్తున్నారు. -
నా నిధులు.. నా ఇష్టం!
- హౌసింగ్ కాలనీల్లో మతలబు - సీసీ రోడ్లపై నాయకుడి నజర్ - నేను చెప్పిన వారికే టెండర్ దక్కాలి - లేకుంటే నిధుల కేటాయింపు రద్దు - అధికారులకు అధికార నేత హుకూం - నాలుగు రోజులుగా మంతనాలు - ఇంకా కొలిక్కిరాని వ్యవహారం సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ నిర్మించిన హౌసింగ్ కాలనీల్లో మౌలిక వసతుల కల్పన ప్రక్రియలో భాగంగా సిమెంటు రోడ్ల నిర్మాణానికి భారీగా నిధులు మంజూరయ్యాయి. భూపాలపల్లి నియోజకవర్గానికి ఏకంగా రూ.16 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. భూపాలపల్లి నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో నిర్మించినహౌసింగ్ కాలనీల్లో సిమెంటు రోడ్లు నిర్మించేందుకు ప్రభుత్వం ప్రత్యేక అభివద్థి నిధుల కింద నిధులు కేటాయించింది. 36 కాలనీల్లో సిమెంటు రోడ్ల నిర్మాణానికి జిల్లా గృహ నిర్మాణ సంస్థ 35 ప్యాకేజీలుగా ఇ-ప్రొక్యూర్మెంట్లో టెండర్లు పిలిచింది. భారీ మొత్తంలో నిధులు రావడంతో ఈ పనులపై నియోజకవర్గంలోని అధికార పార్టీ ముఖ్యనేత న జర్ పడింది. తనకు ‘అన్ని’ విధాలుగా సహకరిస్తున్న తన అనుయాయునికే ఈ పనులు కట్టబెట్టాలని ముఖ్యనేత చేస్తున్న ప్రయత్నాలు చివరి దశలో ఉన్నాయి. ఈ విషయంలో ముఖ్యనేత అనుకున్నట్లుగా వ్యవహారం సాగకపోవడంపై సంబంధిత శాఖ ఉన్నాతాధరులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘నియోజకవర్గంలో అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయించాను. నేను చెప్పినట్లే, నేను చెప్పిన వారికే పనులు ఇవ్వాలి. నా వాళ్లకు దక్కకుంటే ఆ నిధులు వేరే ప్రాంతానికి మళ్లీస్తా’ అని ముఖ్యనేత, అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు ముఖ్యనేత సూచించిన కాంట్రాక్టర్లకు పనులు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్యూహంగా పెరిగిన షెడ్యూళ్ల్లు.. సిమెంటు రోడ్ల నిర్మాణం కోసం గహ నిర్మాణ సంస్థ పి లిచిన 35 ప్యాకేజీలకు సుమారు 250 మంది షెడ్యూళ్ల ను తీసుకున్నారు. టెండర్ల ప్రక్రియలో భాగంగా ఆగస్టు 7 నుంచి షెడ్యూళ్ల డౌన్లోడ్ మొదలైంది. 21న సాయంత్రం 5 గంటలకు టెండర్ల గడువు ముగిసింది. అధికారు లు ఆగస్టు 24న టెక్నికల్ బిడ్ ఓపెన్ చేశారు. టెండర్ల షె డ్యూల్ ప్రకారం 28న ఫైనాన్సియల్ బిడ్ తెరవాల్సి ఉం ది. ఎక్కువ మంది టెండర్ల షెడ్యూళ్లు తీసుకోవడంతో వారి అర్హత, ఇతరత్రా డాక్యూమెంట్లను పరిశీలించాల్సి ఉంది. ఈ ప్రక్రియ ఈనెల ఒకటితో ముగిసే అవకాశం ఉంది. టెక్నికల్ బిడ్ తెరవడంతో ఎవరెవరు టెండర్లు వే శారనే విషయం బహిర్గతమైంది. ఈ పనులను ఒకరికే క ట్టబెట్టాలని ముఖ్యనేత ఆదేశాలు ఉండడంతో... మిగి లిన వారితో టెండరు ఉపసంహరించే పనిలో అధికారులు, ముఖ్యనేత అనుయాయులు నిమగ్నమయ్యారు. ముగింపు లేదు.. సిమెంటు రోడ్ల పనుల కోసం టెండర్లు వేసిన కాంట్రాక్టర్లను విరమించుకునే పనిలో భాగంగా నాలుగురోజు లుగా అధికారులు, ముఖ్యనేత అనుయాయులు అంది రితో చర్చలు జరుపుతున్నారు. 35 ప్యాకేజీలకు 250 మంది టెండర్ షెడ్యూళ్లు తీసుకున్నా.. 200 మందికి పై గా కాంట్రాక్టర్లకు సాంకేతిక అర్హత లేదని తెలిసింది. అన్ని అర్హతలు కలిగిన వారు 36 మంది ఉన్నారు. వీరిని ఒప్పించి ముఖ్యనేత అనుకున్నవారికే పనులు కట్టబెట్టేందుకు హన్మకొండ, వరంగల్‌లోని హోటళ్లలో కాంటాక్టర్ల సమావేశాలు వరుసగా జరుగుతున్నాయి. ఇద్దరుముగ్గురు కాంట్రాక్టర్లు మినహా మిగిలిన వారు టెండరు ను ఉపసంహించుకునేందుకు అంగీకరిస్తూ ఈ పత్రాల ను ముఖ్యనేత అనుయాయులకు ఇచ్చినట్లు తెలిసింది. ఇప్పుడు టెండర్ల ప్రక్రియ నుంచి వైదొలిగిన వారికి మరో రకంగా సాయం చేసేందుకు ముఖ్యనేత నుంచి హామీ పొందినట్లు అధికారులు చెబుతున్నారు. మరో ముగ్గురు కాంట్రాక్టర్లు మాత్రం ఎంతీకి అంగీకరించడంలేదని తెలుస్తోంది. ఈ ముగ్గురు తమ సెల్ఫోన్లను ఆఫ్ చేసుకుని అందుబాటులోకి రాకుండా ఉంటున్నారు. దీంతో టెండర్ల వ్యవహారం కొలిక్కిరావడంలేదు. రింగ్ అయితే నష్టమే.. సిమెంటు రోడ్ల నిర్మాణ టెండర్లలో కాంట్రాక్టర్లు ఒక్కటైతే ప్రభుత్వంపై రూ.3 కోట్ల వరకు అదనపు భారం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ టెండర్లలో కాంట్రాక్టర్లు 10 నుంచి 30 శాతం వరకు తక్కువ మొత్తానికి పనులు చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకున్నట్లు తెలిసింది. అందరిని సిండికేట్‌గా మార్చి ఒక్క సంస్థకే పనులు దక్కేలా చూస్తే అందరికీ లాభాలు ఉంటాయనే కోణంలో వ్యవహారం సాగుతున్నట్లు అరోపణలు వస్తున్నాయి. అధికారులు ఇప్పటికైనా ప్రభుత్వ నిధులను కాపాడే ప్రయత్నం చేస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. -
డిసెంబర్ నాటికి రాజీవ్ గృహకల్ప ఇళ్లు పూర్తి
- ఎలాగైనా లబ్ధిదారులకు అప్పగించాలి - గృహనిర్మాణశాఖ మంత్రి మృణాళిని అనకాపల్లి: రాజీవ్ గృహకల్ప ఇళ్లను ఎలాగైనా డిసెంబర్ నాటికి లబ్ధిదారులకు అప్పగించాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి కిమిడి మృణాళిని సూచించారు. మండలంలోని శంకరంలో అసంపూర్తిగా నిలిచిపోయిన రాజీవ్ గృహకల్ప సముదాయాన్ని శుక్రవారం ఆమె పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో అసంపూర్తిగా నిలిచిపోయిన హౌసింగ్ కాలనీపై దృష్టి సారిస్తున్నట్టు చెప్పారు. శంకరంలో 572 మందికి కేటాయించిన రాజీవ్ గృహకల్ప నిర్మాణానికి తాగునీటి వనరులు లేకుండా ఎలా అనుమతి ఇచ్చారని అధికారులను ఆమె ప్రశ్నించారు. నిర్మాణం చేపట్టి ఎనిమిదేళ్లు అయినా పూర్తికాకపోవడానికి కారణాలను మంత్రి తెలుసుకున్నారు. ఈ గృహకల్ప పూర్తి కావాలంటే అంతర్గత మౌలిక సదుపాయాలకు రూ.6.89 లక్షలు అవసరమని ఆమె పేర్కొన్నారు. ఈ రాజీవ్ గృహకల్ప సముదాయం లబ్ధిదారుల్లో 41 శాతం మందికి ఇంతకుముందే ఇళ్లు ఉన్నట్టుగా గుర్తించినట్లు తెలిపారు. వీరిలో 49 శాతం మంది అర్హులున్నారన్నారు. అయితే గృహకల్ప సముదాయం పట్టణానికి దూరంగా ఉన్నందున లబ్ధిదారులు అద్దె, విక్రయించే అవకాశం ఉందన్నారు. ఈ కారణంగా వారినుంచి ఒప్పంద పత్రాలు తీసుకున్న తరువాత ఇళ్లు అప్పగిస్తామన్నారు. ఇక్కడి తాగునీటి అవసరాలకు సంపత్‌పురం పైప్‌లైన్ వినియోగించుకోవాలని సూచించారు. హుద్‌హుద్ తుపానుకు కశింకోట మండలం తాళ్లపాలెంలో 140 ఇళ్లు, జమాదులపాలెంలో 190 ఇళ్లకు నష్టం వాటిల్లిందన్నారు. వీటికి సంబంధించిన ప్రతిపాదనలు పురోగతిలో ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ సుబ్రహ్మణ్యం కాలనీ, డీబీ కాలనీ, పూసలకాలనీల ప్రజలకు పక్కాఇళ్లు మంజూరుచేయాలని మంత్రిని కోరారు. అనంతరం మంత్రి మృణాళిని శంకరం ఎస్సీ కాలనీలోని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అవంతి శ్రీనివాసరావు, హౌసింగ్ పీడీ ప్రసాద్, ఆర్డీవో పద్మావతి, టీడీపీ నాయకులు గుత్తా ప్రభాకర్ చౌదరి, మళ్ల సురేంద్ర, కాండ్రేగుల విష్ణుమూర్తి, కాండ్రేగుల సత్యవతి, గొర్లి అప్పలరాజు, స్థానిక నేతలు పాల్గొన్నారు. నూకాంబికను దర్శించుకున్న మంత్రి అనకాపల్లి: అనకాపల్లి నూకాంబిక అమ్మవారిని రాష్ట్ర మంత్రి కిమిడి మృణాళిని శుక్రవారం దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆమెకు ఎంపీ అవంతి, ఎమ్మెల్యే పీలా గోవింద స్వాగతం పలికారు. వారి చేతుల మీదుగా అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారిణి సుజాత, భక్త జనమండలి చైర్మన్ బీఎస్‌ఎంకే జోగినాయుడు, బుద్ధనాగజగదీష్ తదితరులు పాల్గొన్నారు.