నా నిధులు.. నా ఇష్టం!
- హౌసింగ్ కాలనీల్లో మతలబు
- సీసీ రోడ్లపై నాయకుడి నజర్
- నేను చెప్పిన వారికే టెండర్ దక్కాలి
- లేకుంటే నిధుల కేటాయింపు రద్దు
- అధికారులకు అధికార నేత హుకూం
- నాలుగు రోజులుగా మంతనాలు
- ఇంకా కొలిక్కిరాని వ్యవహారం
సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ నిర్మించిన హౌసింగ్ కాలనీల్లో మౌలిక వసతుల కల్పన ప్రక్రియలో భాగంగా సిమెంటు రోడ్ల నిర్మాణానికి భారీగా నిధులు మంజూరయ్యాయి. భూపాలపల్లి నియోజకవర్గానికి ఏకంగా రూ.16 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. భూపాలపల్లి నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో నిర్మించినహౌసింగ్ కాలనీల్లో సిమెంటు రోడ్లు నిర్మించేందుకు ప్రభుత్వం ప్రత్యేక అభివద్థి నిధుల కింద నిధులు కేటాయించింది. 36 కాలనీల్లో సిమెంటు రోడ్ల నిర్మాణానికి జిల్లా గృహ నిర్మాణ సంస్థ 35 ప్యాకేజీలుగా ఇ-ప్రొక్యూర్‌మెంట్‌లో టెండర్లు పిలిచింది. భారీ మొత్తంలో నిధులు రావడంతో ఈ పనులపై నియోజకవర్గంలోని అధికార పార్టీ ముఖ్యనేత న జర్ పడింది. తనకు ‘అన్ని’ విధాలుగా సహకరిస్తున్న తన అనుయాయునికే ఈ పనులు కట్టబెట్టాలని ముఖ్యనేత చేస్తున్న ప్రయత్నాలు చివరి దశలో ఉన్నాయి.
ఈ విషయంలో ముఖ్యనేత అనుకున్నట్లుగా వ్యవహారం సాగకపోవడంపై సంబంధిత శాఖ ఉన్నాతాధరులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘నియోజకవర్గంలో అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయించాను. నేను చెప్పినట్లే, నేను చెప్పిన వారికే పనులు ఇవ్వాలి. నా వాళ్లకు దక్కకుంటే ఆ నిధులు వేరే ప్రాంతానికి మళ్లీస్తా’ అని ముఖ్యనేత, అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు ముఖ్యనేత సూచించిన కాంట్రాక్టర్లకు పనులు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
అన్యూహంగా పెరిగిన షెడ్యూళ్ల్లు..
సిమెంటు రోడ్ల నిర్మాణం కోసం గహ నిర్మాణ సంస్థ పి లిచిన 35 ప్యాకేజీలకు సుమారు 250 మంది షెడ్యూళ్ల ను తీసుకున్నారు. టెండర్ల ప్రక్రియలో భాగంగా ఆగస్టు 7 నుంచి షెడ్యూళ్ల డౌన్‌లోడ్ మొదలైంది. 21న సాయంత్రం 5 గంటలకు టెండర్ల గడువు ముగిసింది. అధికారు లు ఆగస్టు 24న టెక్నికల్ బిడ్ ఓపెన్ చేశారు. టెండర్ల షె డ్యూల్ ప్రకారం 28న ఫైనాన్సియల్ బిడ్ తెరవాల్సి ఉం ది. ఎక్కువ మంది టెండర్ల షెడ్యూళ్లు తీసుకోవడంతో వారి అర్హత, ఇతరత్రా డాక్యూమెంట్లను పరిశీలించాల్సి ఉంది. ఈ ప్రక్రియ ఈనెల ఒకటితో ముగిసే అవకాశం ఉంది. టెక్నికల్ బిడ్ తెరవడంతో ఎవరెవరు టెండర్లు వే శారనే విషయం బహిర్గతమైంది. ఈ పనులను ఒకరికే క ట్టబెట్టాలని ముఖ్యనేత ఆదేశాలు ఉండడంతో... మిగి లిన వారితో టెండరు ఉపసంహరించే పనిలో అధికారులు, ముఖ్యనేత అనుయాయులు నిమగ్నమయ్యారు.
ముగింపు లేదు..
సిమెంటు రోడ్ల పనుల కోసం టెండర్లు వేసిన కాంట్రాక్టర్లను విరమించుకునే పనిలో భాగంగా నాలుగురోజు లుగా అధికారులు, ముఖ్యనేత అనుయాయులు అంది రితో చర్చలు జరుపుతున్నారు. 35 ప్యాకేజీలకు 250 మంది టెండర్ షెడ్యూళ్లు తీసుకున్నా.. 200 మందికి పై గా కాంట్రాక్టర్లకు సాంకేతిక అర్హత లేదని తెలిసింది. అన్ని అర్హతలు కలిగిన వారు 36 మంది ఉన్నారు. వీరిని ఒప్పించి ముఖ్యనేత అనుకున్నవారికే పనులు కట్టబెట్టేందుకు హన్మకొండ, వరంగల్‌లోని హోటళ్లలో కాంటాక్టర్ల సమావేశాలు వరుసగా జరుగుతున్నాయి.
ఇద్దరుముగ్గురు కాంట్రాక్టర్లు మినహా మిగిలిన వారు టెండరు ను ఉపసంహించుకునేందుకు అంగీకరిస్తూ ఈ పత్రాల ను ముఖ్యనేత అనుయాయులకు ఇచ్చినట్లు తెలిసింది. ఇప్పుడు టెండర్ల ప్రక్రియ నుంచి వైదొలిగిన వారికి మరో రకంగా సాయం చేసేందుకు ముఖ్యనేత నుంచి హామీ పొందినట్లు అధికారులు చెబుతున్నారు. మరో ముగ్గురు కాంట్రాక్టర్లు మాత్రం ఎంతీకి అంగీకరించడంలేదని తెలుస్తోంది. ఈ ముగ్గురు తమ సెల్‌ఫోన్లను ఆఫ్ చేసుకుని అందుబాటులోకి రాకుండా ఉంటున్నారు. దీంతో టెండర్ల వ్యవహారం కొలిక్కిరావడంలేదు.
రింగ్ అయితే నష్టమే..
సిమెంటు రోడ్ల నిర్మాణ టెండర్లలో కాంట్రాక్టర్లు ఒక్కటైతే ప్రభుత్వంపై రూ.3 కోట్ల వరకు అదనపు భారం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ టెండర్లలో కాంట్రాక్టర్లు 10 నుంచి 30 శాతం వరకు తక్కువ మొత్తానికి పనులు చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకున్నట్లు తెలిసింది. అందరిని సిండికేట్‌గా మార్చి ఒక్క సంస్థకే పనులు దక్కేలా చూస్తే అందరికీ లాభాలు ఉంటాయనే కోణంలో వ్యవహారం సాగుతున్నట్లు అరోపణలు వస్తున్నాయి. అధికారులు ఇప్పటికైనా ప్రభుత్వ నిధులను కాపాడే ప్రయత్నం చేస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.