- ఎలాగైనా లబ్ధిదారులకు అప్పగించాలి
- గృహనిర్మాణశాఖ మంత్రి మృణాళిని
అనకాపల్లి: రాజీవ్ గృహకల్ప ఇళ్లను ఎలాగైనా డిసెంబర్ నాటికి లబ్ధిదారులకు అప్పగించాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి కిమిడి మృణాళిని సూచించారు. మండలంలోని శంకరంలో అసంపూర్తిగా నిలిచిపోయిన రాజీవ్ గృహకల్ప సముదాయాన్ని శుక్రవారం ఆమె పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో అసంపూర్తిగా నిలిచిపోయిన హౌసింగ్ కాలనీపై దృష్టి సారిస్తున్నట్టు చెప్పారు. శంకరంలో 572 మందికి కేటాయించిన రాజీవ్ గృహకల్ప నిర్మాణానికి తాగునీటి వనరులు లేకుండా ఎలా అనుమతి ఇచ్చారని అధికారులను ఆమె ప్రశ్నించారు. నిర్మాణం చేపట్టి ఎనిమిదేళ్లు అయినా పూర్తికాకపోవడానికి కారణాలను మంత్రి తెలుసుకున్నారు.
ఈ గృహకల్ప పూర్తి కావాలంటే అంతర్గత మౌలిక సదుపాయాలకు రూ.6.89 లక్షలు అవసరమని ఆమె పేర్కొన్నారు. ఈ రాజీవ్ గృహకల్ప సముదాయం లబ్ధిదారుల్లో 41 శాతం మందికి ఇంతకుముందే ఇళ్లు ఉన్నట్టుగా గుర్తించినట్లు తెలిపారు. వీరిలో 49 శాతం మంది అర్హులున్నారన్నారు. అయితే గృహకల్ప సముదాయం పట్టణానికి దూరంగా ఉన్నందున లబ్ధిదారులు అద్దె, విక్రయించే అవకాశం ఉందన్నారు. ఈ కారణంగా వారినుంచి ఒప్పంద పత్రాలు తీసుకున్న తరువాత ఇళ్లు అప్పగిస్తామన్నారు. ఇక్కడి తాగునీటి అవసరాలకు సంపత్‌పురం పైప్‌లైన్ వినియోగించుకోవాలని సూచించారు.
హుద్‌హుద్ తుపానుకు కశింకోట మండలం తాళ్లపాలెంలో 140 ఇళ్లు, జమాదులపాలెంలో 190 ఇళ్లకు నష్టం వాటిల్లిందన్నారు. వీటికి సంబంధించిన ప్రతిపాదనలు పురోగతిలో ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ సుబ్రహ్మణ్యం కాలనీ, డీబీ కాలనీ, పూసలకాలనీల ప్రజలకు పక్కాఇళ్లు మంజూరుచేయాలని మంత్రిని కోరారు. అనంతరం మంత్రి మృణాళిని శంకరం ఎస్సీ కాలనీలోని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అవంతి శ్రీనివాసరావు, హౌసింగ్ పీడీ ప్రసాద్, ఆర్డీవో పద్మావతి, టీడీపీ నాయకులు గుత్తా ప్రభాకర్ చౌదరి, మళ్ల సురేంద్ర, కాండ్రేగుల విష్ణుమూర్తి, కాండ్రేగుల సత్యవతి, గొర్లి అప్పలరాజు, స్థానిక నేతలు పాల్గొన్నారు.
నూకాంబికను దర్శించుకున్న మంత్రి
అనకాపల్లి: అనకాపల్లి నూకాంబిక అమ్మవారిని రాష్ట్ర మంత్రి కిమిడి మృణాళిని శుక్రవారం దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆమెకు ఎంపీ అవంతి, ఎమ్మెల్యే పీలా గోవింద స్వాగతం పలికారు. వారి చేతుల మీదుగా అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారిణి సుజాత, భక్త జనమండలి చైర్మన్ బీఎస్‌ఎంకే జోగినాయుడు, బుద్ధనాగజగదీష్ తదితరులు పాల్గొన్నారు.
డిసెంబర్ నాటికి రాజీవ్ గృహకల్ప ఇళ్లు పూర్తి
Published Sat, May 2 2015 5:18 AM | Last Updated on Sun, Sep 3 2017 1:14 AM
Advertisement