వెల్లంకిలో ఊరును తలపిస్తున్న జగనన్న కాలనీ
ఆనందపురం(భీమిలి): అర్హత గల ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృఢ సంకల్పంతో రాష్ట్రంలో కాలనీలు కాదు.. ఏకంగా ఊళ్లకు ఊళ్లే రూపుదిద్దుకుంటున్నాయి. గతంలో ఒకటి అరా కాలనీ ఇళ్లు మంజూరు చేసి.. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో.. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను సగంలోనే విడిచి పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా అన్ని సౌకర్యాలతో కాలనీలను నిర్మించి నివాసయోగ్యంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడంతో.. జగనన్న కాలనీ నిర్మాణ పనులు ఓ పద్ధతిలో జరిగి గ్రామాలను తలపిస్తున్నాయి.
అందుకు ఉదాహరణే మండలంలోని వెల్లంకి జగనన్న కాలనీ. ఇక్కడ సుమారు రూ.60 కోట్లు విలువ చేసే 10 ఎకరాల ప్రభుత్వ భూమిని జగనన్న కాలనీకి కేటాయించి సుమారు 300 మంది లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. ముందుగానే విశాలమైన గ్రావెల్ రోడ్డును ఏర్పాటు చేశారు. విద్యుద్ధీకరణ పనులు చేపట్టారు. దీంతో మొత్తం లబ్ధిదారులందరూ ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టారు. అందులో దాదాపు వంద ఇళ్లు వరకూ పూర్తయ్యాయి.
లబ్ధిదారులు గృహ ప్రవేశాలు కూడా చేసేశారు. సకాలంలో ఇసుక, సిమెంట్‌తోపాటు ఆర్థిక సాయాన్ని కూడా అందిస్తుండడంతో మిగతా ఇళ్ల నిర్మాణం కూడా చురుగ్గా సాగుతోంది. ఇక్కడ ఒకేసారి మూడు వందల ఇళ్లు నిర్మిస్తుండడంతో ఓ కొత్త ఊరును తలపిస్తోంది. నిర్దేశించిన స్థలంలో లబ్ధిదారుడు తనకు నచ్చిన విధానంలో ఇంటిని నిర్మించుకోవచ్చని ప్రభుత్వం స్వేచ్ఛనిచ్చింది. దీంతో లబ్ధిదారులు ఆధునిక సౌకర్యాలతో నిర్మించుకోవడంతో ఇక్కడ పట్టణ వాతావరణం ప్రతిబింబిస్తోంది. ఈ కాలనీపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న అధికారులు ఆదర్శకాలనీగా తీర్చిదిద్దుతున్నారు.
కలలో కూడా ఊహించలేదు
వలస వచ్చి వెల్లంకిలో భర్త, ఇద్దరు పిల్లలతో అద్దె ఇంట్లో ఉంటున్నాం. నా భర్త ముసిలిబాబు వంటల పనికి వెళ్లి కుటుంబాన్ని పోషిస్తున్నారు. చాలీచాలని కూలి వల్ల అద్దె చెల్లించుకోలేని పరిస్థితిలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇల్లు మంజూరు చేశారు. అధికారులు అన్ని రకాలగా సహకారం అందించడంతో ఇంటి నిర్మాణం పూర్తి చేసుకుని.. అందులోనే నివాసం ఉంటున్నాం. అద్దె భారం తొలగిపోయింది. ముఖ్యమంత్రి జగనన్నకు ఆజన్మాంతం రుణపడి ఉంటాం.
– వెర్రి దేవి, జగనన్న కాలనీ లబ్ధిదారు, వెల్లంకి
జగనన్న రూ.లక్షల ఆస్తినిచ్చారు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మాలాంటి పేదలకు లక్షలు విలువ చేసే ఆస్తిని కాలనీ ఇంటి రూపంలో అందజేసి ఎంతో సాయపడ్డారు. నేను నా భర్త రోజు కూలి చేసుకుని ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నాం. దీనికి ముందు తెలిసిన వారి స్థలంలో కమ్మలపాక వేసుకుని ఉండేవాళ్లం. వర్షాకాలం వస్తే కారిపోయి నానా ఇబ్బందులు పడ్డాం. రూపాయి ఖర్చే లేకుండా స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించిన జగన్ బాబే మరలా ముఖ్యమంత్రి కావాలి.
– బూస రామయ్యమ్మ, ఇంటి లబ్ధిదారు, వెల్లంకి
(చదవండి: అదిగో పులి... ఇదిగో తోక)
Comments
Please login to add a commentAdd a comment