పల్లె పొమ్మంది.. పట్టణం రమ్మంది
అన్నదాతల ప్రధాన పండుగ సంక్రాంతి...వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటలు పండక రైతులు అప్పులపాలయ్యారు. ఆనందానికి, ఆడంబరానికి దూరమయ్యారు. ఫలితంగా ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందడి పల్లెల్లో అంతంతమాత్రంగానే ఉంది. పట్టణాలు, నగరాల్లో నివసించే ప్రజలు మాత్రం సంక్రాంతిపై మక్కువచూపుతున్నారు. ఘనంగా జరుపుకుంటున్నారు.
అనంతపురం కల్చరల్ : పల్లె సీమల పండుగైన సంక్రాంతిని గ్రామీణుల కంటే పట్టణవాసులే ఎక్కువగా, వినూత్నంగా జరుపుకుంటున్నారు. ప్రతి ఇల్లు ముత్యాల ముగ్గులతో సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానిస్తోంది. కార్పొరేట్ పాఠశాలలు, వివిధ స్వచ్ఛంద సంస్థలు సంప్రదాయలను మరుగున పడకుండా కాపాడుతున్నారు. విద్యార్థులతో పండుగ చేరుుంచి మన సంస్కృతిని కాపాడుతున్నారు.
మకర సంక్రమణమే...మకర సంక్రాంతి
సాధారణంగా జనవరిలో పంట చేతికి వస్తుంది. సూర్యుడు తన నిరంతర కాల ప్రయాణంలో ఏ రోజైతే ధనుస్సు రాశిని వీడి మకర రాశిలోకి ప్రవేశిస్తాడో ఆ రోజును మకర సంక్రాంతి లేదా సంక్రమణం పిలుస్తారు. సంబరాలు చేసుకుంటారు. సంక్రమణం అంటే ఒక చోట నుంచి మరో చోటుకు జరిగే మార్పు! సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశికి మారుతున్నాడని దీనినే సంక్రమణం అంటారు. ఈ సమయంలోనే ఆయనం మారుతుంది. అప్పటి వరకూ దక్షిణాయనంగా ఉండే కాలం సంక్రాంతి సమయంలో ఉత్తరాయణ పుణ్యకాలంగా మారుతుంది.
పంచాంగంలో ఈ సంక్రమణ తేదీలు, సమయాలు యథావిధిగా కనపడతాయి. ముఖ్యంగా ఈ తేదీలలోనే సంక్రాంతి పర్వదినాలు వస్తాయి. సంక్రమణ కాలంలో మహావిష్ణువు నేత్రాలు తెరుచుకుంటాయని ప్రతీతి. ఈ ఆధునిక కాలంలో కల్పవక్షం లాంటి దేవుళ్లలో ‘అయ్యప్ప’ ఒకడు. నేడు హరిహర సుతునికి నెయ్యి అభిషేకాలతో ఆరాధనలు జరుగనున్నాయి. స్వామివారి మహత్యం తెలిపే మకరజ్యోతి ఆకాశంలో దివ్య తేజస్సుతో వెలుగొందేది కూడా ఈ సంక్రమణలోనే.
ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే... మంచి పంటలు, పశువుల సంపదలు.... ఆయురారోగ్యాలు ఎప్పటికి ఇలాగే ఉండాలని ‘సంక్రాంతి’ని కాంతి వంతంగా జరుపుకుంటున్నాం. సూర్యుడు ఒక చోట నుంచి మరో చోటికి సంక్రమణం చేస్తున్నట్టే... పల్లెల అందాలు పట్టణాలకు వలసలొచ్చినట్టు ప్రతి ఇంటి ముందు రంగవల్లులు.... హరివిల్లులవుతున్నాయి. ముత్యాల ముగ్గుల్లో ఆచార వ్యవహారాలు చిందులేస్తున్నాయి. భక్తి భావం రెట్టింపై పర్వదినాలలో ఆలయాలు భక్తజన సందోహంతో కిటకిటలాడుతున్నాయి.
యువతలో పెరిగిన ఆధ్యాత్మికత
సంస్కృతి సంప్రదాయాలపై ఒక నాడు పెద్దవారిలో మాత్రమే ఆసక్తి... గౌరవం కనపడేది. ఈ రోజుల్లో వయసుతో నిమిత్తం లేకుండా ఆచారాలను పాటిస్తున్నారు. ముఖ్యంగా యువతలో ఆధ్యాత్మిక భావజాలం గణనీయంగా పెరిగింది. ఈ సంక్రాంతి పర్వదినాలలో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా యువతీ యువకులు ఉత్సాహంగా వివిధ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.
ఈ పర్వదినం సందర్భంగా పలు ఆలయాలలో తిరుప్పావై ఉత్సవాలు, గోదారంగనాథుల కళ్యాణ మహోత్సవాలు, మకరజ్యోతి వేడుకలు, సూర్యగ్రహ పూజలు వైభవంగా జరుగుతున్నాయి. వీటిన్నింటిలో యువత ఉత్సాహంగా ముందుంటోంది. ఇది ఒక రకంగా ఆహ్వానించదగ్గ పరిణామం. సంప్రదాయాలను పాటించడానికి... ముందు వరుసలో నడుస్తున్న కొందరి అభిప్రాయాలు వారి మాటల్లోనే...
సంక్రాంతి అంటే సంబరం
అన్ని పండుగలకన్నా సంక్రాంతి పర్వదినాలొస్తున్నాయంటే మాకెంతో సంబరం. మూడు రోజుల పాటు ముత్యాల ముగ్గులలో మునిగి తేలుతాం. ఇంటినిండా వచ్చిన బంధువులు... పండుగ హడావుడి వెరసి ఇళ్లే చిన్నసైజు పల్లెలా సంబరాలను తెస్తాయి. ముఖ్యంగా అపార్టుమెంట్లలో జరిగే సందడే వేరుగా ఉంటుంది.
- దివ్య, విద్యార్థిని, పాతూరు
సంక్రాంతి పల్లె పండుగ
సంక్రాంతి పర్వదినాలు ఒకప్పుడు పల్లెలకు పరిమితమయ్యేవి. కాలం తెచ్చిన విం తలో భాగమేమోననిపించే విధంగా అది కాస్తా పట్టణాలకు చేరుకుని ఇక్కడంతా సందడిగా మారిపోయింది. మా ఇంట్లో అందరూ పండుగ వచ్చిదంటే మహా సరదాగా ఉంటారు. పిల్లలేమో ప్రతిరోజు ముత్యాల ముగ్గుల వేయాలని పట్టుబడతారు. ప్రకృతిని ఆరాధించాలనే భావం, దివ్య సందేశంలా సంక్రాంతి తెస్తుంది.
- జయ, గృహిణి