Housing construction scheme
-
చురుగ్గా పనులు.. బిల్లుల చెల్లింపులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తిచేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. బిల్లుల చెల్లింపును గృహనిర్మాణ శాఖ వేగంగా చేపడుతోంది. ఈ నెల 1వ తేదీ నుంచి 22వ తేదీ నాటికి రూ.1,500 కోట్ల విలువైన పనులు పూర్తిచేసి, బిల్లులు చెల్లించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీన్లో భాగంగా ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నారు. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద తొలిదశలో ప్రభుత్వం 15,60,227 ఇళ్లు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. వీటిలో 11,65,006 ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. 16,784 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. గృహ నిర్మాణాలను వేగంగా పూర్తిచేసేందుకు ఉన్నతాధికారులు ప్రతి రెండు జిల్లాలకు ఓ ప్రత్యేక అధికారిని నియమించడమేగాక రోజూ జిల్లాల అధికారులతో సమీక్షిస్తున్నారు. పనులు ఊపందుకోవడంతో ఈ నెలలో ఇప్పటి వరకూ రూ.770 కోట్లు లబ్ధిదారులకు చెల్లించారు. దీంతో ఇప్పటివరకు ప్రభుత్వం లబ్ధిదారులకు చెల్లించిన సొమ్ము రూ.2,718.67 కోట్లకు చేరింది. మరోవైపు గురువారం నుంచి ఈ నెల 22వ తేదీ వరకు రోజుకు దాదాపు 57 కోట్ల రూపాయల చొప్పున ఖర్చు చేయనున్నారు. ఇందుకోసం చెల్లింపులు పెండింగ్‌లో లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. బ్యాంకు ఖాతా వివరాలు సరిగా అందజేయకపోవడం, ఇతర సాంకేతిక కారణాల వల్ల చెల్లింపులు నిలిచిపోయిన ఘటనలపైనా దృష్టి సారించారు. పనులు పుంజుకున్నాయి రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల నిర్మాణాల పనులు పుంజుకున్నాయి. రోజుకు సగటున 300 నుంచి 400 ఇళ్ల నిర్మాణాలు పూర్తవుతున్నాయి. ఈ సంఖ్య ఇంకా పెంచుతాం. బిల్లుల చెల్లింపులో ఆలస్యం కారణంగా నిర్మాణాలు నిలిచిపోవడానికి వీల్లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఎప్పటికప్పుడు బిల్లులు అప్లోడ్ చేయమని క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీచేశాం. – నారాయణభరత్ గుప్తా, ఎండీ, గృహనిర్మాణ సంస్థ -
అందుకే మహిళల పేరిట ఇళ్లు ఇవ్వాలనుకున్నాం: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ‘పేదలందరికి ఇళ్లు’ పథకంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ద్వారా పెద్దదెబ్బ తగిలిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. హైకోర్టు తీర్పు లక్షలాది మంది ఆశల మీద నీళ్లు చల్లినట్లు అయ్యిందన్నారు. ఈ తీర్పుతో ఎంతోమంది లబ్ధిదారులు ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. ఈ మేరకు తాడేపల్లిలో సోమవారం సజ్జల మాట్లాడుతూ.. పిటిషన్ వేసిన వారిలో కొంతమంది ఆ పిటిషన్‌తో సంబంధమే లేదని అంటున్నారని.. మరి దీని వెనుక ఎవరున్నారని ప్రశ్నించారు. దుష్ట పన్నాగాలతో కొన్ని రాజకీయ శక్తులు తెరవెనక ఉన్నట్లు అర్థమవుతోందన్నారు. ఇలాంటి వాటికి పేరుమోసిన టీడీపీ వెనక ఉందని నమ్ముతున్నామన్నారు. అయితే తమకు కోర్టులు న్యాయం చేస్తాయనే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. చదవండి: హైకోర్టును మోసం చేశారు ఇల్లు లేని వారు ఏపీలో ఇప్పటికీ 31 లక్షల మంది ఉన్నారని తేలిందని, చరిత్రలో వైఎస్సార్ తర్వాత ఇప్పుడే పెద్ద ఎత్తున భారీ యజ్ఞానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. తొలిదశలో 15 లక్షల నిర్మాణాలు కూడా చేపట్టామని, ఇల్లు లేదని ఏ ఒక్కరు చేయి ఎత్తకూడదని తాము భావించామన్నారు. మహిళకు ఇవ్వడం, వారికి ఓనర్ షిప్ ఇవ్వడం అనేది తమ ఆలోచన అని, తమ పార్టీ అధినేతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో తెలుసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. ఆ ఇల్లు వారికి నివాసమే కాకుండా ఒక ఆస్తిగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ఆధునిక టౌన్ షిష్‌లు తయారు చేయడం తమ ధ్యేయమని, అన్ని వసతులతో ఆ కాలనీలను తయారు చేస్తున్నామని పేర్కొన్నారు. చదవండి: అన్ని స్కూళ్లకూ సీబీఎస్ఈ అఫిలియేషన్: సీఎం జగన్ అయితే సీఎం జగన్‌పై ఉన్న అసూయతో చంద్రబాబు చేసిన నిర్వాకమే ఇదని, ఎన్బీసీ స్టాండర్డ్స్ ప్రకారమే స్థలం ఎంత ఉండాలనేది నిర్ణయించామన్నారు. గతంలో ఇందిరమ్మ ఇల్లు 215 చదరపు అడుగులు ఉంటే ఇప్పుడు 340 చదరపు అడుగులు ఇస్తున్నట్లు వెల్లడించారు. చాలా రాష్ట్రాల కంటే, ఎన్సీబీ గైడ్ లైన్స్ మించి తాము ఇళ్ల నిర్మాణం చేస్తున్నామన్నారు. టిడ్కో ఇల్లు తాము ఇచ్చే దానికంటే తక్కువ విస్తీర్ణంలో ఉన్నాయని, తాము ఇంకా ఎక్కువ విస్తీర్ణంలో ఇండిపెండెంట్ ఇల్లు ఇస్తున్నామని తెలిపారు. కేవలం జగన్మోహన్రెడ్డిపై చులకన భావం తీసుకురావాలని చంద్రబాబు దుర్బుద్ధి అని విమర్శించారు. ‘ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాల్సిన చంద్రబాబు ఇలా కోర్టులను అడ్డుపెట్టుకుని కుయుక్తులు చేస్తున్నాడు. ఇప్పుడు ఇల్లు సొంత ఆస్తిలా మారకూడదనే దుర్బుద్ధి కనిపిస్తోంది. చంద్రబాబు దుర్బుద్ధితో చేసిన ఈ ప్రయత్నానికి ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు. మేము ఎప్పుడూ మీ పసుపు కుంకుమ లాంటి కుట్రలు చేయం. బద్వేల్ ఎన్నికలో ప్రజల తీర్పుపై మాకు సందేహమే లేదు. ఈ రెండేళ్లలో మా ప్రభుత్వం చేసిన సంక్షేమమే మమ్మల్ని గెలిపిస్తోంది. బీజేపీ వాళ్ళకి తెలిసిన పాండిత్యం అంతా మతమే. సునీల్ థియోధర్ కూడా అదే మాట్లాడుతున్నాడు. లేని మతం అనే అంశాన్ని తెచ్చి ఎదో లబ్ది పొందాలని చూస్తున్నారు. రాష్ట్రంలో అప్పుల గురించి మాట్లాడతారు కానీ కేంద్రం చేసిన అప్పులు గురించి మాట్లాడటం లేదు యూపీలో రైతులపై కారు ఎక్కించిన అంశంపై మాట్లాడరు. ఏ ఎన్నికైనా మేము సీరియస్‌గానే తీసుకుంటాం. వాళ్లు ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజా క్షేత్రంలో వాటిని తిప్పికొడతాం. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ డిమాండ్ పెరిగింది. బొగ్గు కొరత వచ్చింది. విద్యుత్ కొనుగోలు రేట్లు కూడా పెరిగాయి. ఈ సందర్భంలో గృహావసర విద్యుత్ వినియోగం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. టీడీపీ ఆరోపించినట్లు పేమెంట్స్ సమస్య లేదు. కొనుగోలు చేయడానికి అక్కడ బొగ్గే దొరకడం లేదు. రానున్న అయిదారు నెలల్లో ప్రజలు కొంత విద్యుత్ ఆదా దిశగా ప్రయత్నాలు చేయాలి. ఉద్యోగ సంఘాలతో మేము సంప్రదింపులు చేస్తూనే ఉన్నాం. వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం.’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. -
ఇళ్ల విస్తీర్ణంలోనూ రికార్డే
సాక్షి, అమరావతి : ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద రాష్ట్రంలో ఇదివరకెన్నడూ లేనంత పెద్ద సంఖ్యలో నిర్మాణంలో ఉన్న ఇళ్లు విస్తీర్ణంలోనూ కొత్త చరిత్రను సృష్టిస్తున్నాయి. ఏ లెక్కన చూసుకున్నా, ఇదివరకెన్నడూ ఇంత విస్తీర్ణంలో పేదల ఇళ్లు నిర్మించలేదని స్పష్టం అవుతోంది. నేషనల్ బిల్డింగ్ కోడ్ (ఎన్బీసీ), ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూనే.. వారు సూచించిన విస్తీర్ణం కంటే ఎక్కువ విస్తీర్ణంలోనే ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. గతంలో ప్రభుత్వాలు నిర్మించిన దానికంటే ఎక్కువ విస్తీర్ణంలోనే ఇళ్ల నిర్మాణం సాగుతోందని గణాంకాలు చెబుతున్నాయి. నగరాలు, పట్టణాల్లోని కాలనీల్లో 435.56 చదరపు అడుగుల స్థలంలో, గ్రామాల్లో 653.34 చదరపు అడుగుల స్థలంలో ఇళ్ల నిర్మాణం సాగుతోంది. బెడ్రూమ్, హాలు, వంట గది, బాత్ రూమ్, వరండాతో ఇళ్లు రూపుదిద్దుకుంటున్నాయి. కాలనీల్లో ప్రభుత్వం అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. ఈ దిశగా ఇప్పటికే రూ.10 వేల కోట్లు వ్యయం చేసింది. -
రూ.34 వేల కోట్లతో జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం(గృహనిర్మాణశాఖ)పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఇళ్ల నిర్మాణ ప్రగతి, జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనపై కార్యాచరణ ప్రణాళిక, టిడ్కో ఇళ్లపై సీఎం సమగ్ర సమీక్ష జరిపారు. ఇళ్ల నిర్మాణంపై ముఖ్యమంత్రికి అధికారులు వివరాలు అందించారు. కాలనీల్లో మ్యాపింగ్, జియో ట్యాగింగ్, జాబ్‌కార్డుల జారీ, రిజిస్ట్రేషన్ పనులు అన్నిచోట్ల దాదాపుగా పూర్తికావొచ్చాయని అధికారులు తెలిపారు. 3.03 లక్షల ఇళ్లు ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభమయ్యాయని అధికారులు పేర్కొన్నారు. జులై 10 కల్లా మొత్తం 7 లక్షల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. ఆప్షన్లో భాగంగా ప్రభుత్వం కట్టే ఇళ్లు శ్రావణ మాసం ప్రారంభంకాగానే మొదలుపెడతామని అధికారులు తెలిపారు. జూన్ 2022 నాటికల్లా మొదటి విడత ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు. నాణ్యత నిర్ధారణ కోసం ఇంజనీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు శిక్షణ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఐఐటీలు ఇతర సంస్ధల సహకారంతో శిక్షణ ఇప్పిస్తున్నామన్నారు. అలాగే లే అవుట్ల వద్ద నీటి సదుపాయం, తదితర మౌలిక వసతుల కల్పనపైనా సీఎం సమీక్షించారు. రూరల్, అర్బన్ కలిపి 9,024 లే అవుట్లలో తాగునీరు, కరెంటు సదుపాయాలపై సీఎం సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే...: ►ఇళ్ల నిర్మాణానికి అవసరమైన నీళ్లు, కరెంటు సౌకర్యాలు ఏర్పాటులో ఏమైనా సమస్యలు ఉంటే శరవేగంగా పరిష్కరించాలని సీఎం ఆదేశం.. ►దీనిమీద మరింత ధ్యాస పెట్టండి. ►వారంరోజుల్లో అన్ని లే అవుట్లలో పనులు పూర్తికావాలి. ►ఇళ్ల నిర్మాణాన్ని దృష్టిలో ఉంచుకుని రవాణా ఛార్జీలు సహా ఇతరత్రా రేట్లు అమాంతంగా పెరగకుండా తగిన చర్యలు తీసుకోవాలి. ►రూ.34వేల కోట్లతో జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం అన్నది ఒక కల. ►గతంలో రాష్ట్రంలోకాని, దేశంలోకాని మౌలిక సదుపాయాల కల్పనకు ఇలా ఖర్చు చేసిన దాఖలాలు లేవు ►ఇంత పెద్ద లక్ష్యాన్ని గతంలో ఎవరూ ఆలోచన చేయలేదు ►దేవుడి దయ వల్ల ఈ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టాం. ►అవినీతికి తావుండకూడదు. ►నాణ్యతకు పెద్ద పీట వేయాలి. ►మనసా, వాచా, కర్మేణా ఈ పనుల పట్ల అధికారులు అంకితభావాన్ని ప్రదర్శించాలి. ►అప్పుడే ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతాం. ►ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టాలన్న ఆలోచన కూడా గతంలో ఎవరూ చేయలేదు. ►దీన్ని నిజం చేయాలని నేను తపన పడుతున్నాను. ►నా కల నిజం కావాలంటే మీ అందరి సహకారం కావాలి. మనందరి కల - పేదవాడి కల కావాలి ►నా కల మీ అందరి కల కావాలి. ►మనందరి కల పేదవాడి కల కావాలి. ►అప్పుడే ఈ కార్యక్రమం సాకారమవుతుంది. ►పేదవాడికి అత్యుత్తమ జీవన ప్రమాణాలు అందించాలన్నది మన లక్ష్యం. ►దేశం మొత్తం మనవైపు చూస్తోంది. ►పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా ఏర్పాటవుతున్న కాలనీలను మురికివాడలుగా కాదు, పేదవాళ్లకు మంచి ప్రమాణాలున్న ఆవాసాలుగా తీర్చిదిద్దాలి. ►దీనికి పై స్థాయి నుంచి కిందిస్థాయి అధికారి వరకూ సంకల్పంతో ముందుకు సాగాలి: నాణ్యత పై ఫిర్యాదులు, సలహాలకు ప్రత్యేక నెంబరు ►అవినీతికి తావులేని, నాణ్యతతో కూడిన పనులు చేయాలి: ►నాణ్యతపై ఫిర్యాదులు, సలహాలకు ఒక ప్రత్యేక నెంబరు ఏర్పాటు చేయాలి. ►దీనికి సంబంధించి ప్రతి లేఅవుట్లో ఒక బోర్డు ఏర్పాటు చేయాలి. ►దీని ద్వారా వచ్చిన ఫీడ్ బ్యాక్‌పై కూడా ఎప్పటికప్పుడు సమీక్షించాలి. టిడ్కో ఇళ్లపైనా సీఎం సమీక్ష ►18 నెలల కాలంలో 2,08,160 యూనిట్లు పూర్తిచేస్తామన్న అధికారులు ►దాదాపు రూ.10వేల కోట్లు వీటికోసం ఖర్చు చేస్తామన్న అధికారులు. ఈ సమీక్షా సమావేశానికి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గృహ నిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్‌జైన్, ఆర్ధిక శాఖ కార్యదర్శి కెవివి సత్యనారాయణ, గృహనిర్మాణశాఖ కార్యదర్శి రాహుల్ పాండే, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ నారాయణ భరత్ గుప్తా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. చదవండి: దిశ యాప్‌పై మరింత చైతన్యం కలిగించాలి -
అవినీతి గూళ్లు
‘ఇందిరమ్మ’ ఇళ్లలో స్వాహాపర్వం - అధికారులు తేల్చింది రూ.18 కోట్లే - రికవరీ రూ.20 లక్షలు మాత్రమే - అక్రమాలపై సీబీసీఐడీ విచారణ - అక్రమార్కుల గుండెళ్లో గుబులు సాక్షి, కరీంనగర్: ఇల్లు లేని పేదలకు గూడు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహనిర్మాణ పథకంలో అడుగడుగునా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. లబ్ధిదారుల ఎంపిక మొదలు బిల్లు మంజూరు వరకు అధికారులు, దళారులు పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు. అధికారాన్ని అదునుగా చేసుకుని కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు బినామీ పేర్లతో ఇళ్లు మంజూరీ చేయించుకుని బిల్లులు కాజేశారు. అధికారులు, ప్రజాప్రతినిధుల అండదండలతో కొందరు దళారులు ఇల్లు ఉన్నవారికే లబ్ధి చేకూర్చారు. మరికొందరైతే ఏకంగా పాత ఇళ్లకే సున్నం వేయించి సర్కారు ఖజానాకు కన్నం వేయించిన సంఘటనలు జిల్లాలో వెలుగులోకి వచ్చాయి. ఇలా వేలాది ఇళ్లు పునాదులు కూడా తవ్వకుంటే బిల్లులు డ్రా చేశారు. జిల్లావ్యాప్తంగా రూ.70 కోట్లకు పైనే నిధులు దుర్వినియోగమయ్యాయి. కానీ.. ఇప్పటివరకు రూ.18 కోట్ల మేర కే అవినీతి జరిగినట్టు అధికారులు విచారణలో తేల్చారు. ఇందులో కేవలం రూ.20 లక్షలు మాత్రమే అక్రమార్కుల నుంచి రికవరీ చేసినట్టు హౌసింగ్ అధికారులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా 9,80,789 ఇళ్లు ఉండగా, ఇందులో నివాసయోగ్యమైనవి 2,91,248 వరకు ఉన్నాయి. శిథిలావస్థదశలో.. వసతులు లేని మిగిలిన ఇళ్లలో ప్రజలు కాలం వెళ్లదీస్తున్నారు. ఇందిరమ్మ మూడు విడతల్లో జిల్లాకు 2.90 లక్షల ఇళ్లు మంజూరు కాగా, ఇందులో 55వేల ఇళ్లు కూడా పూర్తి కాలేదు. కొన్ని నిర్మాణ దశలో ఉండగా, చాలాచోట్ల అసలు పునాదులే తవ్వలేదు. జిల్లాల్లో 57 మండలాలు, 1207 గ్రామాలుంటే.. ఇప్పటివరకు ఏడువందల గ్రామాల్లో అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులున్నాయి. అధికారులు వందకు మించి గ్రామాల్లో విచారణ చేపట్టలేదు. మంథనిలో అధికం.. జిల్లావ్యాప్తంగా మంథని నియోజకవర్గంలోనే అధికంగా నిధులు దుర్వినియోగమైనట్టు ఆరోపణలున్నాయి. అప్పటి అధికార పార్టీ నేతలు పలు గ్రామాల్లో ఉన్న ఇళ్ల సంఖ్యకన్నా ఎక్కువ ఇళ్లు మంజూరు చేయించుకుని బిల్లులు మింగినట్టు తెలుస్తోంది. ఈనెల 25న జిల్లా పరిషత్ సమావేశమందిరంలో ‘మన జిల్లా-మన ప్రణాళిక’ సమావేశంలో అవినీతి విషయం చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కాటారం జెడ్పీటీసీ సభ్యుడు, గత ప్రభుత్వంలో జిల్లా మంత్రి అనుచరుడే గృహనిర్మాణాల్లో అవినీతిని ప్రస్తావించారు. గతంలో కాటారం, మహాముత్తారం, మహదేవపూర్ మండలాల్లో రూ.50 కోట్ల అవినీతి జరిగిందని లెక్కతేల్చారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ను కోరారు. స్పందించిన మంత్రి విచారణకు హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని మరుసటి రోజే ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన సీఎం నాలుగు వేల మంది సిబ్బందితో రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు విచారణ నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ కేసును సీబీసీఐడీకి అప్పజెప్పడం జిల్లాలో చర్చనీయాంశమైంది. అక్రమాలపై సమగ్రంగా, పకడ్బందీంగా విచారణ జరిపిస్తే జిల్లాలో మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి. కాగా.. ఈ అక్రమ వ్యవహారం దళారులతో పాటు అధికారులను కలవరానికి గురిచేస్తోంది. గతంలో గ్రామాల్లో పలువురు ప్రజాప్రతినిధుల సహకారంతో విలేజ్ ఆర్గనైజర్(వీవో)లు బిల్లులు చెల్లించకుండా డబ్బులు కాజేశారు. పనుల ప్రగతి చూసి బిల్లులు మంజూరు చేయాల్సిన వర్క్ ఇన్స్పెక్టర్లు ఇళ్లు లేకున్నా నిధులిచ్చేశారు. నిధుల దుర్వినియోగంపై గతంలో ఎన్నోసార్లు హౌసింగ్ అధికారులు విచారణ కూడా చేపట్టారు. కానీ అప్పట్లో ప్రజాప్రతినిధుల ఒత్తిడి కారణంగా అక్రమార్కులపై చర్యలకు వెనుకడుగు వేశారు. తాజాగా అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.