సాక్షి, తాడేపల్లి: ‘పేదలందరికి ఇళ్లు’ పథకంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ద్వారా పెద్దదెబ్బ తగిలిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. హైకోర్టు తీర్పు లక్షలాది మంది ఆశల మీద నీళ్లు చల్లినట్లు అయ్యిందన్నారు. ఈ తీర్పుతో ఎంతోమంది లబ్ధిదారులు ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. ఈ మేరకు తాడేపల్లిలో సోమవారం సజ్జల మాట్లాడుతూ.. పిటిషన్ వేసిన వారిలో కొంతమంది ఆ పిటిషన్‌తో సంబంధమే లేదని అంటున్నారని.. మరి దీని వెనుక ఎవరున్నారని ప్రశ్నించారు. దుష్ట పన్నాగాలతో కొన్ని రాజకీయ శక్తులు తెరవెనక ఉన్నట్లు అర్థమవుతోందన్నారు. ఇలాంటి వాటికి పేరుమోసిన టీడీపీ వెనక ఉందని నమ్ముతున్నామన్నారు. అయితే తమకు కోర్టులు న్యాయం చేస్తాయనే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
చదవండి: హైకోర్టును మోసం చేశారు
ఇల్లు లేని వారు ఏపీలో ఇప్పటికీ 31 లక్షల మంది ఉన్నారని తేలిందని, చరిత్రలో వైఎస్సార్ తర్వాత ఇప్పుడే పెద్ద ఎత్తున భారీ యజ్ఞానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. తొలిదశలో 15 లక్షల నిర్మాణాలు కూడా చేపట్టామని, ఇల్లు లేదని ఏ ఒక్కరు చేయి ఎత్తకూడదని తాము భావించామన్నారు. మహిళకు ఇవ్వడం, వారికి ఓనర్ షిప్ ఇవ్వడం అనేది తమ ఆలోచన అని, తమ పార్టీ అధినేతగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో తెలుసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. ఆ ఇల్లు వారికి నివాసమే కాకుండా ఒక ఆస్తిగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ఆధునిక టౌన్ షిష్‌లు తయారు చేయడం తమ ధ్యేయమని, అన్ని వసతులతో ఆ కాలనీలను తయారు చేస్తున్నామని పేర్కొన్నారు.
చదవండి: అన్ని స్కూళ్లకూ సీబీఎస్‌ఈ అఫిలియేషన్: సీఎం జగన్
అయితే సీఎం జగన్‌పై ఉన్న అసూయతో చంద్రబాబు చేసిన నిర్వాకమే ఇదని, ఎన్‌బీసీ స్టాండర్డ్స్ ప్రకారమే స్థలం ఎంత ఉండాలనేది నిర్ణయించామన్నారు. గతంలో ఇందిరమ్మ ఇల్లు 215 చదరపు అడుగులు ఉంటే ఇప్పుడు 340 చదరపు అడుగులు ఇస్తున్నట్లు వెల్లడించారు. చాలా రాష్ట్రాల కంటే, ఎన్‌సీబీ గైడ్ లైన్స్ మించి తాము ఇళ్ల నిర్మాణం చేస్తున్నామన్నారు. టిడ్కో ఇల్లు తాము ఇచ్చే దానికంటే తక్కువ విస్తీర్ణంలో ఉన్నాయని, తాము ఇంకా ఎక్కువ విస్తీర్ణంలో ఇండిపెండెంట్ ఇల్లు ఇస్తున్నామని తెలిపారు. కేవలం జగన్‌మోహన్‌రెడ్డిపై చులకన భావం తీసుకురావాలని చంద్రబాబు దుర్బుద్ధి అని విమర్శించారు.
‘ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాల్సిన చంద్రబాబు ఇలా కోర్టులను అడ్డుపెట్టుకుని కుయుక్తులు చేస్తున్నాడు. ఇప్పుడు ఇల్లు సొంత ఆస్తిలా మారకూడదనే దుర్బుద్ధి కనిపిస్తోంది. చంద్రబాబు దుర్బుద్ధితో చేసిన ఈ ప్రయత్నానికి ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు. మేము ఎప్పుడూ మీ పసుపు కుంకుమ లాంటి కుట్రలు చేయం. బద్వేల్ ఎన్నికలో ప్రజల తీర్పుపై మాకు సందేహమే లేదు. ఈ రెండేళ్లలో మా ప్రభుత్వం చేసిన సంక్షేమమే మమ్మల్ని గెలిపిస్తోంది. బీజేపీ వాళ్ళకి తెలిసిన పాండిత్యం అంతా మతమే. సునీల్ థియోధర్ కూడా అదే మాట్లాడుతున్నాడు. లేని మతం అనే అంశాన్ని తెచ్చి ఎదో లబ్ది పొందాలని చూస్తున్నారు. రాష్ట్రంలో అప్పుల గురించి మాట్లాడతారు కానీ కేంద్రం చేసిన అప్పులు గురించి మాట్లాడటం లేదు
యూపీలో రైతులపై కారు ఎక్కించిన అంశంపై మాట్లాడరు. ఏ ఎన్నికైనా మేము సీరియస్‌గానే తీసుకుంటాం. వాళ్లు ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజా క్షేత్రంలో వాటిని తిప్పికొడతాం. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ డిమాండ్ పెరిగింది. బొగ్గు కొరత వచ్చింది. విద్యుత్ కొనుగోలు రేట్లు కూడా పెరిగాయి. ఈ సందర్భంలో గృహావసర విద్యుత్ వినియోగం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. టీడీపీ ఆరోపించినట్లు పేమెంట్స్ సమస్య లేదు. కొనుగోలు చేయడానికి అక్కడ బొగ్గే దొరకడం లేదు. రానున్న అయిదారు నెలల్లో ప్రజలు కొంత విద్యుత్ ఆదా దిశగా ప్రయత్నాలు చేయాలి. ఉద్యోగ సంఘాలతో మేము సంప్రదింపులు చేస్తూనే ఉన్నాం. వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం.’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment