అవినీతి గూళ్లు
‘ఇందిరమ్మ’ ఇళ్లలో స్వాహాపర్వం
- అధికారులు తేల్చింది రూ.18 కోట్లే
- రికవరీ రూ.20 లక్షలు మాత్రమే
- అక్రమాలపై సీబీసీఐడీ విచారణ
- అక్రమార్కుల గుండెళ్లో గుబులు
సాక్షి, కరీంనగర్: ఇల్లు లేని పేదలకు గూడు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహనిర్మాణ పథకంలో అడుగడుగునా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. లబ్ధిదారుల ఎంపిక మొదలు బిల్లు మంజూరు వరకు అధికారులు, దళారులు పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు. అధికారాన్ని అదునుగా చేసుకుని కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు బినామీ పేర్లతో ఇళ్లు మంజూరీ చేయించుకుని బిల్లులు కాజేశారు. అధికారులు, ప్రజాప్రతినిధుల అండదండలతో కొందరు దళారులు ఇల్లు ఉన్నవారికే లబ్ధి చేకూర్చారు. మరికొందరైతే ఏకంగా పాత ఇళ్లకే సున్నం వేయించి సర్కారు ఖజానాకు కన్నం వేయించిన సంఘటనలు జిల్లాలో వెలుగులోకి వచ్చాయి.
ఇలా వేలాది ఇళ్లు పునాదులు కూడా తవ్వకుంటే బిల్లులు డ్రా చేశారు. జిల్లావ్యాప్తంగా రూ.70 కోట్లకు పైనే నిధులు దుర్వినియోగమయ్యాయి. కానీ.. ఇప్పటివరకు రూ.18 కోట్ల మేర కే అవినీతి జరిగినట్టు అధికారులు విచారణలో తేల్చారు. ఇందులో కేవలం రూ.20 లక్షలు మాత్రమే అక్రమార్కుల నుంచి రికవరీ చేసినట్టు హౌసింగ్ అధికారులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా 9,80,789 ఇళ్లు ఉండగా, ఇందులో నివాసయోగ్యమైనవి 2,91,248 వరకు ఉన్నాయి.
శిథిలావస్థదశలో.. వసతులు లేని మిగిలిన ఇళ్లలో ప్రజలు కాలం వెళ్లదీస్తున్నారు. ఇందిరమ్మ మూడు విడతల్లో జిల్లాకు 2.90 లక్షల ఇళ్లు మంజూరు కాగా, ఇందులో 55వేల ఇళ్లు కూడా పూర్తి కాలేదు. కొన్ని నిర్మాణ దశలో ఉండగా, చాలాచోట్ల అసలు పునాదులే తవ్వలేదు. జిల్లాల్లో 57 మండలాలు, 1207 గ్రామాలుంటే.. ఇప్పటివరకు ఏడువందల గ్రామాల్లో అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులున్నాయి. అధికారులు వందకు మించి గ్రామాల్లో విచారణ చేపట్టలేదు.
మంథనిలో అధికం..
జిల్లావ్యాప్తంగా మంథని నియోజకవర్గంలోనే అధికంగా నిధులు దుర్వినియోగమైనట్టు ఆరోపణలున్నాయి. అప్పటి అధికార పార్టీ నేతలు పలు గ్రామాల్లో ఉన్న ఇళ్ల సంఖ్యకన్నా ఎక్కువ ఇళ్లు మంజూరు చేయించుకుని బిల్లులు మింగినట్టు తెలుస్తోంది. ఈనెల 25న జిల్లా పరిషత్ సమావేశమందిరంలో ‘మన జిల్లా-మన ప్రణాళిక’ సమావేశంలో అవినీతి విషయం చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కాటారం జెడ్పీటీసీ సభ్యుడు, గత ప్రభుత్వంలో జిల్లా మంత్రి అనుచరుడే గృహనిర్మాణాల్లో అవినీతిని ప్రస్తావించారు. గతంలో కాటారం, మహాముత్తారం, మహదేవపూర్ మండలాల్లో రూ.50 కోట్ల అవినీతి జరిగిందని లెక్కతేల్చారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ను కోరారు.
స్పందించిన మంత్రి విచారణకు హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని మరుసటి రోజే ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన సీఎం నాలుగు వేల మంది సిబ్బందితో రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు విచారణ నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ కేసును సీబీసీఐడీకి అప్పజెప్పడం జిల్లాలో చర్చనీయాంశమైంది. అక్రమాలపై సమగ్రంగా, పకడ్బందీంగా విచారణ జరిపిస్తే జిల్లాలో మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి.
కాగా.. ఈ అక్రమ వ్యవహారం దళారులతో పాటు అధికారులను కలవరానికి గురిచేస్తోంది. గతంలో గ్రామాల్లో పలువురు ప్రజాప్రతినిధుల సహకారంతో విలేజ్ ఆర్గనైజర్(వీవో)లు బిల్లులు చెల్లించకుండా డబ్బులు కాజేశారు. పనుల ప్రగతి చూసి బిల్లులు మంజూరు చేయాల్సిన వర్క్ ఇన్‌స్పెక్టర్లు ఇళ్లు లేకున్నా నిధులిచ్చేశారు. నిధుల దుర్వినియోగంపై గతంలో ఎన్నోసార్లు హౌసింగ్ అధికారులు విచారణ కూడా చేపట్టారు. కానీ అప్పట్లో ప్రజాప్రతినిధుల ఒత్తిడి కారణంగా అక్రమార్కులపై చర్యలకు వెనుకడుగు వేశారు. తాజాగా అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.