సాక్షి, అమరావతి: నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం(గృహనిర్మాణశాఖ)పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఇళ్ల నిర్మాణ ప్రగతి, జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనపై కార్యాచరణ ప్రణాళిక, టిడ్కో ఇళ్లపై సీఎం సమగ్ర సమీక్ష జరిపారు. ఇళ్ల నిర్మాణంపై ముఖ్యమంత్రికి అధికారులు వివరాలు అందించారు. కాలనీల్లో మ్యాపింగ్, జియో ట్యాగింగ్, జాబ్‌కార్డుల జారీ, రిజిస్ట్రేషన్ పనులు అన్నిచోట్ల దాదాపుగా పూర్తికావొచ్చాయని అధికారులు తెలిపారు. 3.03 లక్షల ఇళ్లు ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభమయ్యాయని అధికారులు పేర్కొన్నారు.
జులై 10 కల్లా మొత్తం 7 లక్షల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. ఆప్షన్‌లో భాగంగా ప్రభుత్వం కట్టే ఇళ్లు శ్రావణ మాసం ప్రారంభంకాగానే మొదలుపెడతామని అధికారులు తెలిపారు. జూన్ 2022 నాటికల్లా మొదటి విడత ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు. నాణ్యత నిర్ధారణ కోసం ఇంజనీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు శిక్షణ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఐఐటీలు ఇతర సంస్ధల సహకారంతో శిక్షణ ఇప్పిస్తున్నామన్నారు. అలాగే లే అవుట్ల వద్ద నీటి సదుపాయం, తదితర మౌలిక వసతుల కల్పనపైనా సీఎం సమీక్షించారు. రూరల్, అర్బన్ కలిపి 9,024 లే అవుట్లలో తాగునీరు, కరెంటు సదుపాయాలపై సీఎం సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే...:
►ఇళ్ల నిర్మాణానికి అవసరమైన నీళ్లు, కరెంటు సౌకర్యాలు ఏర్పాటులో ఏమైనా సమస్యలు ఉంటే శరవేగంగా పరిష్కరించాలని సీఎం ఆదేశం..
►దీనిమీద మరింత ధ్యాస పెట్టండి.
►వారంరోజుల్లో అన్ని లే అవుట్లలో పనులు పూర్తికావాలి.
►ఇళ్ల నిర్మాణాన్ని దృష్టిలో ఉంచుకుని రవాణా ఛార్జీలు సహా ఇతరత్రా రేట్లు అమాంతంగా పెరగకుండా తగిన చర్యలు తీసుకోవాలి.
►రూ.34వేల కోట్లతో జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం అన్నది ఒక కల.
►గతంలో రాష్ట్రంలోకాని, దేశంలోకాని మౌలిక సదుపాయాల కల్పనకు ఇలా ఖర్చు చేసిన దాఖలాలు లేవు
►ఇంత పెద్ద లక్ష్యాన్ని గతంలో ఎవరూ ఆలోచన చేయలేదు
►దేవుడి దయ వల్ల ఈ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టాం.
►అవినీతికి తావుండకూడదు.
►నాణ్యతకు పెద్ద పీట వేయాలి.
►మనసా, వాచా, కర్మేణా ఈ పనుల పట్ల అధికారులు అంకితభావాన్ని ప్రదర్శించాలి.
►అప్పుడే ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతాం.
►ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టాలన్న ఆలోచన కూడా గతంలో ఎవరూ చేయలేదు.
►దీన్ని నిజం చేయాలని నేను తపన పడుతున్నాను.
►నా కల నిజం కావాలంటే మీ అందరి సహకారం కావాలి.
మనందరి కల - పేదవాడి కల కావాలి
►నా కల మీ అందరి కల కావాలి.
►మనందరి కల పేదవాడి కల కావాలి.
►అప్పుడే ఈ కార్యక్రమం సాకారమవుతుంది.
►పేదవాడికి అత్యుత్తమ జీవన ప్రమాణాలు అందించాలన్నది మన లక్ష్యం.
►దేశం మొత్తం మనవైపు చూస్తోంది.
►పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా ఏర్పాటవుతున్న కాలనీలను మురికివాడలుగా కాదు, పేదవాళ్లకు మంచి ప్రమాణాలున్న ఆవాసాలుగా తీర్చిదిద్దాలి.
►దీనికి పై స్థాయి నుంచి కిందిస్థాయి అధికారి వరకూ సంకల్పంతో ముందుకు సాగాలి:
నాణ్యత పై ఫిర్యాదులు, సలహాలకు ప్రత్యేక నెంబరు
►అవినీతికి తావులేని, నాణ్యతతో కూడిన పనులు చేయాలి:
►నాణ్యతపై ఫిర్యాదులు, సలహాలకు ఒక ప్రత్యేక నెంబరు ఏర్పాటు చేయాలి.
►దీనికి సంబంధించి ప్రతి లేఅవుట్‌లో ఒక బోర్డు ఏర్పాటు చేయాలి.
►దీని ద్వారా వచ్చిన ఫీడ్ బ్యాక్‌పై కూడా ఎప్పటికప్పుడు సమీక్షించాలి.
టిడ్కో ఇళ్లపైనా సీఎం సమీక్ష
►18 నెలల కాలంలో 2,08,160 యూనిట్లు పూర్తిచేస్తామన్న అధికారులు
►దాదాపు రూ.10వేల కోట్లు వీటికోసం ఖర్చు చేస్తామన్న అధికారులు.
ఈ సమీక్షా సమావేశానికి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గృహ నిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్‌జైన్, ఆర్ధిక శాఖ కార్యదర్శి కెవివి సత్యనారాయణ, గృహనిర్మాణశాఖ కార్యదర్శి రాహుల్ పాండే, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ నారాయణ భరత్ గుప్తా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment