సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తిచేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. బిల్లుల చెల్లింపును గృహనిర్మాణ శాఖ వేగంగా చేపడుతోంది. ఈ నెల 1వ తేదీ నుంచి 22వ తేదీ నాటికి రూ.1,500 కోట్ల విలువైన పనులు పూర్తిచేసి, బిల్లులు చెల్లించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీన్లో భాగంగా ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నారు. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద తొలిదశలో ప్రభుత్వం 15,60,227 ఇళ్లు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. వీటిలో 11,65,006 ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి.
16,784 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. గృహ నిర్మాణాలను వేగంగా పూర్తిచేసేందుకు ఉన్నతాధికారులు ప్రతి రెండు జిల్లాలకు ఓ ప్రత్యేక అధికారిని నియమించడమేగాక రోజూ జిల్లాల అధికారులతో సమీక్షిస్తున్నారు. పనులు ఊపందుకోవడంతో ఈ నెలలో ఇప్పటి వరకూ రూ.770 కోట్లు లబ్ధిదారులకు చెల్లించారు. దీంతో ఇప్పటివరకు ప్రభుత్వం లబ్ధిదారులకు చెల్లించిన సొమ్ము రూ.2,718.67 కోట్లకు చేరింది. మరోవైపు గురువారం నుంచి ఈ నెల 22వ తేదీ వరకు రోజుకు దాదాపు 57 కోట్ల రూపాయల చొప్పున ఖర్చు చేయనున్నారు. ఇందుకోసం చెల్లింపులు పెండింగ్‌లో లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. బ్యాంకు ఖాతా వివరాలు సరిగా అందజేయకపోవడం, ఇతర సాంకేతిక కారణాల వల్ల చెల్లింపులు నిలిచిపోయిన ఘటనలపైనా దృష్టి సారించారు.
పనులు పుంజుకున్నాయి
రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల నిర్మాణాల పనులు పుంజుకున్నాయి. రోజుకు సగటున 300 నుంచి 400 ఇళ్ల నిర్మాణాలు పూర్తవుతున్నాయి. ఈ సంఖ్య ఇంకా పెంచుతాం. బిల్లుల చెల్లింపులో ఆలస్యం కారణంగా నిర్మాణాలు నిలిచిపోవడానికి వీల్లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఎప్పటికప్పుడు బిల్లులు అప్‌లోడ్ చేయమని క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీచేశాం.
– నారాయణభరత్ గుప్తా, ఎండీ, గృహనిర్మాణ సంస్థ
Comments
Please login to add a commentAdd a comment