ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకానికి ఆదరణ పెరుగుతోంది. పథకం వినియోగించుకోవడానికి ముందుకు వస్తున్న వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతోంది. ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా 8,11,697 మంది ఈ పథకం కింద లబ్ధిపొందడానికి దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాల వారీగా పరిశీలించినట్లయితే తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 1.14 లక్షలు, పశ్చిమ గోదావరిలో 1.03 లక్షలు, గుంటూరు జిల్లాలో 89 వేల మంది లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు వచ్చాయి. 8.11 లక్షల మందిలో 6 లక్షల మంది గడిచిన 10 రోజుల్లో ముందుకు రావడం విశేషం.
రూ.10వేల కోట్ల రుణాల మాఫీ
ఇక గృహ నిర్మాణ సంస్థ ద్వారా 1983 నుంచి 2011 మధ్య రుణాలు పొంది ఇళ్లు నిర్మించుకున్న వారికి ప్రభుత్వం ఈ పథకంతో భారీ ఊరట కల్పించింది. ఓటీఎస్ రూపంలో రూ.10వేల కోట్ల మేర రుణాలు మాఫీ చేసింది. దీంతోపాటు పేదలపై తలకు మించిన భారం మోపకుండా తక్కువ మొత్తంలో ధరలు నిర్దేశించి వాటిని చెల్లించిన వారికి ఇళ్లను రిజిస్ట్రేషన్ చేసి ఇస్తోంది. ఎటువంటి రుసుములు లేకుండా రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా రూ.6వేల కోట్లు, ఇలా మొత్తంగా రూ.16 వేల కోట్ల మేర ప్రభుత్వం పేదలకు లబ్ధి చేకూరుస్తోంది.
రేపటి నుంచి పంపిణీ
స్వచ్ఛందంగా పథకం వినియోగించుకోవడానికి ముందుకు వచ్చిన వారి పేర్లపై ఇళ్ల రిజిస్ట్రేషన్లను గ్రామ, వార్డు సచివాలయాల్లోనే చేస్తున్నారు. ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా 26,023 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. ప్రభుత్వం రేపటి (మంగళవారం) నుంచి రిజిస్ట్రేషన్ ధ్రువపత్రాలను రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేపట్టనుంది. ఇందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ప్రారంభించనున్నారు.
గతంలో చెల్లించిన వారికి కూడా..
2000 నుంచి 2014 మధ్య వన్‌టైమ్ సెటిల్‌మెంట్ (ఓటీఎస్) వినియోగించుకుని, 2014–19 మధ్య ఓటీఎస్ లేకుండా రుణాలు చెల్లించిన వారికి కూడా ఇళ్లపై హక్కులు కల్పించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. 2000–2014 మధ్య 2.31 లక్షల మంది రుణాలు చెల్లించారు. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో వడ్డీ, అసలుతో కలిపి 43 వేల మంది లబ్ధిదారులు గృహ నిర్మాణ సంస్థకు రుణాలు చెల్లించారు.
అవగాహన కల్పిస్తున్నాం
పథకంతో కలిగే ప్రయోజనాలపై అర్హులకు అవగాహన కల్పిస్తున్నాం. అధికార యంత్రాంగం విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. 22ఏ జాబితా నుంచి స్థలాలను తొలగించి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసిస్తోంది. దీంతో బ్యాంకుల్లో ఇళ్లను తనఖా పెట్టుకోవడానికి, అమ్మడానికి, వారసుల పేర్లపై బదిలీ చేయడానికి వీలుంటుంది. గతంలో ఏ ప్రభుత్వం చేయని మేలును వైఎస్ జగన్ ప్రభుత్వం చేస్తోంది.
– చెరుకువాడ శ్రీరంగనాథరాజు, గృహ నిర్మాణ శాఖ మంత్రి
ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణ సంస్థ నుంచి ఐదుసార్లు సిఫార్సు చేసినా ఓటీఎస్ కింద వడ్డీలు మాఫీ చేయడానికి చంద్రబాబు ఒప్పుకోలేదు. ప్రస్తుతం వడ్డీ, అసలు రెండింటిలో రాయితీ ఇవ్వడంతో పాటు, ఇళ్లపై సంపూర్ణ హక్కులు కల్పిస్తుంటే టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది. అర్హులు దీన్ని గమనించాలి. అర్హులైన ప్రతిఒక్కరూ దీని ప్రయోజనాలను తెలుసుకుని పథకాన్ని వినియోగించుకోవాలి.
– దావులూరి దొరబాబు, గృహ నిర్మాణ సంస్థ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment