తగ్గిన గృహ రుణ అకౌంట్ల సంఖ్య
చెన్నై: గృహ రుణ అకౌంట్ల సంఖ్య 2013లో అసలు పెరక్కపోగా, 2.7 శాతం క్షీణించింది. కమర్షియల్ బ్యాంకుల్లో 2012లో గృహ రుణ అకౌంట్ల సంఖ్య 47.78 లక్షలుకాగా, ఈ సంఖ్య 2013లో 46.43 లక్షలకు తగ్గింది. కాగా రుణ మంజూరీ విలువ మాత్రం రూ.2.6 లక్షల కోట్ల నుంచి 7.3 శాతం వృద్ధితో రూ.2.8 లక్షల కోట్లకు పెరిగింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజా గణాంకాలు ఈ విషయాన్ని తెలిపాయి. నగరాల్లో రియల్టీ అధిక ధరలు కస్టమర్ల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణమని సంబంధిత వర్గాలు విశ్లేషించాయి. నిర్మాణం, ఆ రంగం ఆధారిత ఉత్పత్తుల ధరలు పెరగడం కూడా అకౌంట్ల వృద్ధికి అవరోధంగా మారింది. కాగా రూ.2 కోట్ల నుంచి రూ.8 కోట్ల శ్రేణిలో రుణం తీసుకున్న కస్టమర్ల సంఖ్య పెరిగిందని గణాంకాలు వెల్లడించాయి.