గృహ రుణాలకు తగ్గని డిమాండ్
న్యూఢిల్లీ: గృహ రుణాలకు డిమాండ్ కొనసాగుతూనే ఉంది. రుణం తీసుకుని సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా గడిచిన ఐదేళ్ల కాలంలో బ్యాంకుల పుస్తకాల్లో గృహ రుణాలు రెట్టింపై రూ.16.85 లక్షల కోట్లకు చేరినట్టు ఆర్బీఐ డేటాను పరిశీలిస్తే తెలుస్తోంది. ముఖ్యంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లోనూ (ఏప్రిల్–ఆగస్ట్ వరకు) గృహ రుణాల్లో రెండంకెల వృద్ధి కనిపించింది. ఈ ఏడాది మే నుంచి ఆగస్ట్ వరకు ఆర్బీఐ 1.4 శాతం మేర రెపో రేటును పెంచడం తెలిసిందే. సెప్టెంబర్‌లోనూ అర శాతం మేర పెంచడం గమనార్హం. 2016–17 నాటికి బ్యాంకుల నుంచి గృహ రుణాల పోర్ట్‌ఫోలియో రూ.8,60,086 కోట్లుగా ఉండగా, 2022 మార్చి నాటికి రూ.16,84,424 కోట్లకు వృద్ది చెందింది.
రేట్ల పెంపు ప్రభావం ఉండదు..
వడ్డీ రేట్ల అన్నవి ముఖ్యమైనవే అయినప్పటికీ.. అవి గృహ కొనుగోలుకు అవరోధం కాదని, రుణ గ్రహీతల ప్రస్తుత ఆదాయం, భవిష్యత్తు ఆదాయ అంచనాలపైనే నిర్ణయం ఆధారపడి ఉంటుందని బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్ పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. గృహ రుణ కాలంలో (15–20 ఏళ్లు) వడ్డీ రేట్లు పెరగడం, తగ్గడం అన్నది సాధారణ ప్రక్రియగా ఇన్వెస్టర్లలోనూ అవగాహన పెరుగుతుండడాన్ని ప్రస్తావించాయి. రుణాలపై ఇళ్లను కొనుగోలు చేస్తున్నప్పుడు ఇంటి ధర కీలకం అవుతుందని బ్యాంక్ ఆఫ్ బరోడా మోర్ట్గేజ్, రిటైల్ అసెట్స్ జనరల్ మేనేజర్ హెచ్‌టీ సోలంకి పేర్కొన్నారు. ‘‘గృహ రుణం అన్నది దీర్ఘకాలంతో ఉంటుంది. ఈ సమయంలో వడ్డీ రేట్లలో మార్పులు ఉంటాయని కస్టమర్లకూ తెలుసు. దేశంలో సగటు వేతన పెంపులు 8–12 శాతం మధ్య ఉంటున్నందున పెరిగే రేట్ల ప్రభావాన్ని వారు తట్టుకోగలరు’’అని సోలంకి అభిప్రాయపడ్డారు.
ప్రణాళిక మేరకే..
వడ్డీ రేట్ల పెంపు గృహ రుణాల డిమాండ్‌పై పెద్దగా ఉంటుందని తాను అనుకోవడం లేదని హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఎండీ రేణు సూద్ కర్నాడ్ సైతం పేర్కొన్నారు. ఇల్లు కొనుగోలు అన్నది మిగిలిన ఉత్పత్తుల మాదిరిగా కాకుండా, కుటుంబ సభ్యుల మధ్య చర్చించిన తర్వాతే, ప్రణాళిక మేరకు ఉంటుందన్నారు. కారు, కన్జ్యూమర్ రుణాల మాదిరిగా కాకుండా, 12–15 ఏళ్లు, అంతకుమించి కాల వ్యవధితో ఉండే గృహ రుణాలపై ఫ్లోటింగ్ రేట్లు అమల్లో ఉంటాయని గుర్తు చేశారు. ‘‘కనుక వడ్డీ రేట్ల పెంపు వారి నగదు ప్రవాహాలపై తక్కువ ప్రభావమే చూపిస్తుంది. సాధారణంగా 12–15 ఏళ్ల కాలంలో రెండు మూడు విడతల్లో రేట్ల పెంపు ఉండొచ్చు. దీర్ఘకాలంలో రేట్లు దిగొస్తాయని వినియోగదారులకు సైతం తెలుసు’’అని కర్నాడ్ పేర్కొన్నారు.
ఇళ్లకు డిమాండ్ చక్కగా ఉన్నట్టు రియల్ ఎస్టేట్ వర్గాలు సైతం చెబుతున్నాయి. ‘‘ఇళ్ల విక్రయాలు బలంగా కొనసాగుతున్నాయి. 2022 చివరికి దశాబ్ద గరిష్టానికి చేరుకుంటాయి. స్థిరమైన ధరలకుతోడు, పండుగల డిమాండ్, గృహ రుణాలపై తక్కువ రేట్లు (గతంలోని 10–11 శాతంతో పోలిస్తే) సానుకూలతలు’’అని ప్రాపర్టీ కన్సల్టెంట్ జెల్ఎల్ ఇండియా చీఫ్ ఎకనమిస్ట్ సమంతక్ దాస్ వివరించారు. కాకపోతే అదే పనిగా గృహ రుణాల వడ్డీ రేట్లు పెరుగుతూ పోతే ఈఎంఐ పెరిగి, సెంటిమెంట్‌కు విఘాతం కలగొచ్చన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. ఈ ఏడాది జనవరి–సెప్టెంబర్ కాలంలో హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఎనిమిది పట్టణాల్లో ఇళ్ల అమ్మకాలు, క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 87 శాతం పెరిగి.. 2,72,709 యూనిట్లు అమ్ముడైనట్టు ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ ఇటీవలే వెల్లడించడం గమనార్హం.