Housing Scheme 2014
-
పేదల ఇళ్లకు తీపి కబురు
పేదల ఇళ్ల నిర్మాణంలో అన్ని రకాల జాగ్రత్తలు, నాణ్యతా ప్రమాణాలు పాటించాలి. పేదవాడిపై ఒక్క రూపాయి కూడా అప్పు అనేది లేకుండా ఇంటిని సమకూర్చాలి. అత్యంత పారదర్శకంగా, నాణ్యతతో పనులు కొనసాగాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: పేద వర్గాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో శుభవార్త వినిపించారు. గత సర్కారు పేదలకు పెట్టిన ఇళ్ల బకాయిలను చెల్లించాలని సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనివల్ల 3,38,144 మంది ఇళ్ల లబ్ధిదారులకు రూ.1,323 కోట్ల మేర ప్రయోజనం చేకూరనుంది. గత ప్రభుత్వం బకాయిలు పెట్టినా పేదలకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ స్పష్టం చేశారు. పొరపాట్లకు తావివ్వకుండా నిధులు సమీకరించుకుని చెల్లింపులకు ఒక తేదీ ప్రకటించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ నిర్మాణాలు నాసిరకంగా ఉంటాయనే అభిప్రాయం తొలగిపోవాలన్నారు. పేదల కోసం తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని అధికారులు చిత్తశుద్ధితో పూర్తి చేస్తే పుణ్యం దక్కుతుందని, చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ఇళ్ల పట్టాలు, గృహాల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణంపై సీఎం జగన్ మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ.. క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇళ్ల సంఖ్యను పెంచాలి... దివంగత వైఎస్సార్ జయంతి రోజైన జూలై 8వతేదీన పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ కార్యక్రమంపై సమీక్షించారు.భౌతిక దూరం పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలన్నారు. కేటాయించిన స్థలం వద్దే అక్కచెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్ పత్రాలు ఇవ్వాలని ఆదేశించారు. – తొలి విడతలో చేపట్టబోయే 15 లక్షల నిర్మాణాలపై సీఎం సమీక్షించారు. విశాఖ, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఇళ్ల సంఖ్యను పెంచాలని సీఎం ఆదేశించారు. రూపాయి కూడా అప్పు లేకుండా ఇల్లు.. – పేదలకు నిర్మించబోయే ఇళ్లలో కల్పించే సదుపాయాలపై అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. డిజైన్లో భాగంగా పడక గది, వంట గది, లివింగ్ రూం, మరుగుదొడ్డి, వరండా సహా సదుపాయాలన్నీ ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. – పేదల ఇళ్ల నిర్మాణంలో అన్ని రకాల జాగ్రత్తలు, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సీఎం స్పష్టం చేశారు. పేదవాడిపై ఒక్క రూపాయి కూడా అప్పు అనేది లేకుండా ఇంటిని సమకూర్చాలన్నారు. పేదలకు గృహ వసతి కల్పించాలనే సదుద్దేశంతో ఈ భారీ కార్యక్రమాన్ని ప్రారంభించామని, అత్యంత పారదర్శకంగా, నాణ్యతతో పనులు కొనసాగాలని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి.. – చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ఇళ్ల పట్టాలు, గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపడుతున్నామని, ప్రభుత్వం నాణ్యతతో పనులు చేస్తుందనే పేరు రావాలని సీఎం పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణం ద్వారా ఏర్పాటయ్యే కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. – సమీక్షలో గృహ నిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్జైన్, అధికారులు పాల్గొన్నారు. -
దరఖాస్తు పూర్తి ఇంకా సులువు
సాక్షి, న్యూఢిల్లీ: తాము నిర్మించిన ఇళ్లను కొనుగోలు చేయదలుచుకున్నవారికి ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) ఓ వెసులుబాటు కల్పించింది. తమ ఫారాన్ని ఎలా పూర్తిచేయాలో తెలియజేయడం కోసం ఆన్లైన్ వీడియోగైడ్ను తన వెబ్సైట్లో ఉంచిం ది. ఫారాన్ని నింపేటప్పుడు ఏయే జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని ఈ వీడియో వివరిస్తుంది. ఆరు నిమిషాల నిడివికలిగిన ఈ వీడియో డిడిఏ హౌసింగ్ స్కీమ్-2014 పేజీలో అందుబాటులో ఉంటుంది. ఫార ంను ఎలా పూర్తిచేయాలనే విషయాన్ని ఈ వీడియోలో కాలం వారీగా వివరించారు. దరఖాస్తుఫారాల పూర్తికి సంబంధించి పలువురు సందేహాలను వెలిబుచ్చుతుండడం,సలహాలు కోరుతున్నందువల్ల ఈ వీడియోను తన వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు డీడీఏ తెలియజేసింది. 25 వేలకు పైగా ఫ్లాట్ల కేటాయింపుకోసం డీడీఏ ప్రకటించిన హౌసింగ్ పథకాన్కి విశేష స్పందన లభిస్తోంది. ఈ నెల ఒకటో తేదీన ప్రారంభించిన ఈ పథకానికి అదే రోజునే 11 లక్షల హిట్లు రావడంతో వెబ్సైట్ కుప్పకూలిన సంగతి విదితమే. దీంతో ఆన్లైన్ ట్రాఫిక్ అవసరాలకు తగ్గట్టుగా డీడీఏ తన సర్వర్ను నవీకరించక తప్పలేదు. ఈ పథకం కోసం డీడీఏమొదట 15 లక్షల బ్రోచర్లను ముద్రించింది.అయితే డిమాండ్ విపరీతంగా ఉండడంతో మరో ఐదు లక్షల ప్రతులకు ఆర్డర్ ఇచ్చింది. ఇప్పటి వరకు 14 లక్షలకు పైగా ఫారాలు అమ్ముడుపోయాయి. దాదాపు 20 వేల దరఖాస్తులు డీడీఏకి అందాయి. ద రఖాస్తుల సమర్పణకు ఆఖరి రోజు వచ్చే నెల తొమ్మిది. -
పేదలకు ఎన్ని ఫ్లాట్లు కేటాయించారు?
న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వం ప్రారంభించిన జవహర్లాల్ నెహ్రూ జాతీయ పట్టణ పునర్ నిర్మాణ పథకం (జేఎన్ఎన్యూఆర్ఎం) కింద నగరంలోని నిరుపేదలకు కేటాయించిన ఫ్లాట్ల వివరాలను అందజేయాలని కేంద్ర ప్రభుత్వం... ఢిల్లీ సర్కారును కోరింది. ఆర్థికంగా వెనుకబడిన వారికి (ఈడబ్ల్యూఎస్) కేటాయించిన ఫ్లాట్ల సంఖ్యను తెలియజేయాలంటూ కేంద్ర గృహ, పట్టణ దారిద్య్ర నిర్మూలన మంత్రిత్వ శాఖ ... ఢిల్లీ ప్రభుత్వానికి ఓ లేఖ రాసింది. ఈ పథకం కింద పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న నిరుపేదలకు మొత్తం 67,784 ఫ్లాట్లను కేటాయించాల్సి ఉంది. ఇదిలాఉంచితే ఈ పథకం కింద ఇప్పటిదాకా నాలుగు వేలమందికే ఫ్లాట్లను కేటాయించామని ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లాంఛనంగా పంపించామన్నారు. అయితే నిరుపేదలకు కేటాయించిన ఫ్లాట్ల సంఖ్యను నిర్ధారించుకున్న తరువాతే కేంద్ర ప్రభుత్వానికి పంపుతామన్నారు. కేటాయింపుల సంఖ్య ఇంత స్వల్పంగా ఉండడానికిగల కారణమేమిటని ప్రశ్నించగా గుర్తింపే ప్రధాన సమస్య అని ఆయన వివరించారు. అనేకమందిని గుర్తించామని అన్నారు. కాగా జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద ఢిల్లీ ప్రభుత్వం మొత్తం 67,784 ఫ్లాట్లను నిర్మించాల్సి ఉంది. అయితే అందులో తొమ్మిది వేల ఫ్లాట్ల నిర్మాణాన్ని నిలిపివేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. సకాలంలో కేటాయింపు కష్టమే ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) నగర పరిధిలోని రోహిణి ప్రాంతంలో చేపట్టిన ఫ్లాట్ల నిర్మాణ పనులు ఇంకా పూర్తికాలేదు. దీంతో లబ్ధిదారులకు ఫ్లాట్లను సకాలంలో కేటాయించే అవకాశాలు అంతంతగానే ఉన్నాయి. దీంతో వీరంతా మరికొంతకాలం ఎదురుచూడక తప్పని పరిస్థితి నెలకొంది. స్థానికుల అభ్యంతరాల కారణంగా పనులు నిలిచిపోయాయి. నిర్మాణ పనులపై విధించిన స్టేని అత్యున్నత న్యాయస్థానం ఎత్తివేసినప్పటికీ స్థానికులు పనులను అనేక పర్యాయాలు అడ్డుకున్నారు. ఈ ప్రాంతంలో మొత్తం 18 వేల ఫ్లాట్లను డీడీఏ నిర్మించాల్సి ఉంది. ఈ విషయమై సంబంధిత అధికారి ఒక రు మాట్లాడుతూ స్థానికులు దాడులకు పాల్పడుతున్నారని, వారి నుంచి తమకు రక్షణ కల్పించాలంటూ పోలీసులకు విన్నవించామన్నారు.