ఎప్పుడూ రద్దీనే.. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌కి ఆ పేరెలా వచ్చిందంటే..
అగ్ని ప్రమాదం ఘటన నేపథ్యంలో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ Falaknuma Express ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఎవరికీ ఏం కాకపోవడంతో అధికారులూ ఊపిరి పీల్చుకున్నారు. జరిగింది ప్రమాదమా? లేదంటే కుట్ర ఏమైనా ఉందా? అనే కోణంలోనూ చర్చ నడుస్తోంది. ఈ తరుణంలో రైలు నేపథ్యం గురించీ కొందరు గూగుల్ తల్లిని ఆరాలు తీస్తున్నారు.
ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌కు Falaknuma Express ఆ పేరు హైదరాబాద్ నగరంలోని ఫలక్‌నుమా ప్యాలెస్ పేరు మీద నుంచే వచ్చింది. ఫలక్‌నుమా అనేది పర్షియా పదం. దాని అర్థం గగన ప్రతిబింబం లేదా స్వర్గ ప్రతిబింబం అని.
🚆 ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ దక్షిణ మధ్య రైల్వే ఆధీనంలో నడిచే సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్.
🚆 1993 అక్టోబర్ 15వ తేదీన ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ తొలి సర్వీస్ పట్టాలెక్కింది.
🚆హౌరా జంక్షన్ నుంచి ఉదయం ప్రారంభమయ్యే ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్.. మరుసటి రోజు ఉదయం సికింద్రాబాద్ జంక్షన్ స్టేషన్‌కు చేరుకుంటుంది. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో సికింద్రాబాద్ జంక్షన్ నుంచి ప్రారంభమై.. మరుసటిరోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో చేరుకుంటుంది.
🚆 నిత్యం నడిచే ఈ రైలు.. 1,544 కిలోమీటర్లు (959 మైళ్ల) ప్రయాణిస్తుంది.
🚆 సగటు వేగం.. గంటకు 60కిలోమీటర్లు. గరిష్ట వేగం 110 కిలోమీటర్లుగా ఉంటుంది. 12703 హౌరా టు సికింద్రాబాద్, అలాగే 12704 సికింద్రాబాద్-హౌరా రూట్లోనే ఇదే సగటు వేగంగా.. దాదాపు 26 గంటలకు తన ట్రిప్ ముగిస్తుంది.
🚆 నిత్యం కిక్కిరిసిపోయే ప్రయాణికులతో తీవ్రరద్దీ మధ్య ఈ రైలు పరుగులు పెడుతుంది. అందుకు ప్రధాన కారణం.. తక్కువ స్టేషన్లలో ఈ రైలు ఆగడం.
🚆 సికింద్రాబాద్-హౌరా మధ్యలో 24 స్టేషన్లలో మాత్రమే ఈ రైలు ఆగుతుంది. ఏసీ ఫస్ట్‌క్లాస్‌తో పాటు ఏసీ టూ టైర్, ఏసీ త్రీ టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ అన్రిజర్వ్డ్ కోచ్‌లు ఉంటాయి. క్యాటరింగ్ సౌకర్యమూ ఉంది.
🚆 రైలు సాధారణంగా 24 ప్రామాణిక ICF కోచ్‌లను కలిగి ఉంటుంది.
🚆 నల్లగొండ, గుంటూరు జంక్షన్, విజయవాడ జంక్షన్, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట జంక్షన్, విశాఖపట్నం, విజయనగరం జంక్షన్, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మపూర్, ఖుర్దా రోడ్ జంక్షన్, భువనేశ్వర్, కటక్ జంక్షన్, భద్రక్, బాలాసోర్(తాజాగా ప్రమాదం జరిగింది ఈ పరిధిలోనే), ఖరగ్‌పూర్ జంక్షన్, హౌరా.. ఇలా ప్రధాన స్టేషన్లలో హాల్టింగ్ ఉంది.
🚆గతంలో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్.. నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్(సికింద్రాబాద్-తిరుపతి) రేక్స్(కోచ్‌లను) మార్చుకునేది. ప్రస్తుతం 17063/17064 అజంతా ఎక్స్‌ప్రెస్(సికింద్రాబాద్-మన్మాడ్(మహారాష్ట్ర) రైలుతో పంచుకుంటోంది.
🚆శతాబ్ధి, రాజధాని, దురంతో సూపర్‌ఫాస్ట్ రైళ్ల మాదిరి ఈ రైలును శుభ్రంగా మెయింటెన్ చేస్తుంది భారతీయ రైల్వేస్. అందుకే ప్రయాణికులు ఈ రూట్లో ఈ రైలుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు.
🚆🔥 అయితే.. గత కొంతకాలంగా ఈ రైలు నిర్వహణపై విమర్శలు వినిపిస్తున్నాయి. తాజా ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడి సికింద్రాబాద్ చేరుకున్న ప్రయాణికులు కొందరు.. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో సిగరెట్లు, గుట్కాలు అమ్ముతున్నారంటూ ఆరోపించడం గమనార్హం.
ఇదీ చదవండి: ఫలక్‌నుమా ప్రమాదం.. రాత్రిపూట జరిగి ఉంటేనా?