human traffickers
-
మానవ అక్రమ రవాణా.. ఎయిర్ ఇండియా సిబ్బంది, ప్రయాణికుడి అరెస్టు
ఫ్రాన్స్‌లో ఇటీవల నిలిపివేసిన భారతీయులు ప్రయాణిస్తున్న విమానంలో పది మంది ఎవరూ తోడు లేని మైనర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. తాజాగా నలుగురు ఎయిర్ ఇండియా సిబ్బంది, ఒక భారతీయ ప్రయాణికుడిని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. వీరు యూకే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న తరుణంలో ఆ సంఘటన చోటుచేసుకుంది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) వారిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. విమానాశ్రయంలోని ఇమిగ్రేషన్ అధికారులకు దిల్జోత్సింగ్ అనే ప్రయాణికుడి డాక్యుమెంట్లపై కొంత అనుమానం రావడంతో వివరాలు సేకరించారు. దాంతో ఆయన ఎయిర్‌లైన్ సిబ్బందిని సంప్రదించడానికి బదులుగా ఎయిర్ ఇండియా సాట్స్ సిబ్బంది సహాయం కోరాడు. వెంటనే అధికారులకు అనుమానం రెట్టింపైంది. సీఐఎస్ఎఫ్ బృందం అప్రమత్తమై దిల్లీ ఎయిర్పోర్ట్ అథారిటీ సహకారంతో విచారణ చేపట్టింది. అయితే సింగ్‌కు సహకరించిన మరో నలుగురు ఎయిర్ ఇండియా స్టాఫర్లను సైతం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఇదీ చదవండి: టెస్లా యూనిట్‌కు సర్వం సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం..? ఫ్రాన్స్‌లో నిలిపివేసిన విమానంలో మైనర్లు ఉన్నట్లు అధికారులు ఇటీవల గుర్తించారు. మానవ అక్రమ రవాణా కోణంలో ఈ కేసును విచారిస్తున్నట్లు తెలిసింది. ఎయిర్ ఇండియా సాట్స్ సీఈఓ సంజయ్‌గుప్తా స్పందిస్తూ నిందితుడికి సహకరించిన సంస్థ సిబ్బందిని విధుల్లో నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. మానవ అక్రమ రవాణాపై కంపెనీ పకడ్బందీ చర్యలు చేపడుతుందని తెలిపారు. -
విశాఖ రైల్వే స్టేషన్లో కలకలం
సాక్షి, విశాఖపట్నం : విశాఖ రైల్వే స్టేషన్లో మంగళవారం ఓ ఘటన కలకలం సృష్టించింది. హ్యుమన్ ట్రాఫికింగ్ చేస్తున్న బంగ్లాదేశ్ చెందిన ముఠా ప్లాట్‌ఫాం నెంబర్ 7 నుంచి హౌరా-యశ్వంత్‌పూర్ వెళ్తున్న రైల్లో ప్రయాణిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఈ ముఠాను పట్టుకోడానికి సూమారు వంద మంది సివిల్, ఇంటిలిజెన్స్, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో హ్యుమన్ ట్రాఫికింగ్ చేస్తున్న నలుగురు పురుషులు, ముగ్గురు స్త్రీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఆలస్యంగా వెలుగుచూసిన దారుణం
సిద్ధార్థనగర్: ఉత్తరప్రదేశ్ కు చెందిన 16 ఏళ్ల బాలికను అపహరించి, సామూహిక అత్యాచారం చేసి... నేపాల్ లో ఆమెను అమ్మేసేందుకు ప్రయత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు దుండగులను పోలీసులు అరెస్ట్ చేశారు. విజయపాల్, అతని మేనల్లుడు చింకు.. ఎత్వా ప్రాంతం నుంచి బాలికను అపహరించి నేపాల్ కు తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఆమెపై 20 రోజుల పాటు వారు అత్యాచారానికి పాల్పడ్డారు. చింకు తండ్రి తకావు, బరాన్సి అనే వ్యక్తితో కలిసి బాలికను మరొకరికి విక్రయించేందుకు ప్రయత్నించారు. వీరి బారి నుంచి తప్పించుకున్న బాలిక పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగుచూసింది. విజయపాల్, చింకులను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.