Humanities courses
-
హ్యుమానిటీస్‌లో హెచ్‌సీయూ టాప్
రాయదుర్గం(హైదరాబాద్): రౌండ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్(ఆర్‌యూఆర్)–2020లో గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ సత్తా చాటింది. హ్యుమానిటీస్ విభాగంలో దేశంలో మొదటి స్థానం, ప్రపంచంలో 276వ స్థానాన్ని సాధించింది. ఈ మేరకు హెచ్‌సీ యూ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. క్లారివేట్ అనలైటిక్స్ భాగస్వామ్యంతో ఆర్‌యూఆర్ ర్యాంకింగ్స్ ఏజెన్సీ.. ఆర్‌యూఆర్–2020 హ్యుమానిటీస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్‌ను విడుదల చేసింది. బోధన, పరిశోధన, అంతర్జాతీయ వైవిధ్యం, ఆర్థిక సస్టైనబిలిటీ వంటి అంశాలతోపాటు 20 సూచికలను పరిగణనలోకి తీసుకున్నారు. ప్రపంచంలో 800 పైగా విద్యా సంస్థలు ర్యాంకింగ్‌లో పాల్గొన్నాయి. ప్రపంచంలో హ్యుమానిటీస్ బోధనపరంగా హెచ్‌సీయూ 53వ స్థానం సాధించిందని వర్సిటీ వీసీ ప్రొఫెసర్ అప్పారావు తెలిపారు. -
హ్యుమానిటీస్‌కు కొత్త పాఠ్య పుస్తకాలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం హ్యుమానిటీస్‌కు కొత్త పాఠ్య పుస్తకాలను ఇంటర్మీడియట్ బోర్డు అందుబాటులోకి తెచ్చింది. ప్రతి ఐదేళ్లకోసారి సిలబస్ మార్పులో భాగంగా ఈసారి ప్రథమ సంవత్సర కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్, హిస్టరీ, జియోగ్రఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పుస్తకాల సిలబస్‌ను మార్పు చేసింది. ఆ పుస్తకాలను బోర్డు కార్యాదర్శి అశోక్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పుస్తకాలను ముద్రించిన తెలుగు అకాడమీ డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఐఐటీల్లో నయా జోష్..!
దేశంలో శాస్త్ర సాంకేతిక విద్యకు దిక్సూచిలవి.. యావత్ యువతరం చోటు కోసం కలలుగనే, పోటీ పడే విద్యా కుసుమాలవి... విద్యార్థులను బట్టీ చదువులు, మార్కుల యంత్రాలుగా మార్చడంపై కాకుండా యువ మస్తిష్కాలను నూతన ఆవిష్కరణలవైపు నడిపించే ‘ఫ్యాక్టరీ’లవి... ‘ఇన్ఫోసిస్’ నారాయణమూర్తి, ‘గూగుల్’ సుందర్ పిచాయ్, ‘ఫ్లిప్‌కార్ట్’ సచిన్ బన్సల్, ‘సాఫ్ట్ బ్యాంక్’ నికేష్ అరోరా వంటి ఎందరినో ప్రపంచానికి అందించిన కేంద్రాలవి... అవే...దేశ అత్యున్నత విద్యా సంస్థల్లో ఒకటిగా కీర్తిప్రతిష్టలు అందుకుంటున్న ఐఐటీలు (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు). ఇప్పుడు ఈ సంస్థలు పూర్వ వైభవానికి మరిన్ని హంగులు అద్దుకుంటూ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. దేశంలోని 23 ఐఐటీలలో ఉన్న సీట్లు దాదాపు ఏడు వేలు! కానీ పోటీ పడే విద్యార్థుల సంఖ్య మాత్రం లక్షలకు లక్షలు! ఈ ఒక్క విషయం చాలు దేశంలో ఐఐటీలకు ఉన్న క్రేజ్ ఏ పాటిదో అర్థం చేసుకునేందుకు. అయితే దశాబ్దాలుగా ఒకే రకమైన కోర్సులు, సిలబస్‌తో నడుస్తున్న ఈ సంస్థలు మారుతున్న కాలానికి అనుగుణంగా అడుగులేస్తున్నాయి. ప్రపంచంలోని అత్యుత్తమ సంస్థలు అనుసరించే బోధనా పద్ధతులు పాటించడంతోపాటు వేర్వేరు సమస్యల పరిష్కారానికి వేర్వేరు శాస్త్ర విభాగాలు కలసికట్టుగా పరిశోధనలు చేయడాన్ని ప్రోత్సహిస్తున్నాయి. సైన్స్ ఇంజనీరింగ్‌లతోపాటు కళలు, హ్యుమానిటీస్ అంశాల్లోనూ కోర్సులు ప్రారంభిస్తున్నాయి. కోర్సు పూర్తి చేసే విషయంలో విద్యార్థులకు స్వేచ్ఛ, సౌలభ్యం అందించేందుకు చర్యలు చేపట్టాయి. ఫలితంగా యువతరం మోసుకొచ్చే కొత్త ఆలోచనలు, పద్ధతులతో పరిశోధనలూ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ప్రొఫెసర్లుగా యువతకు ప్రాధాన్యం... ఐఐటీ ప్రొఫెసర్లంటే తల నెరసిన వారే ఉంటారన్న పాతకాలపు ఆలోచనలకు తెరదించుతూ యాజమాన్యాలు యువతరానికి పెద్దపీట వేస్తున్నాయి. దీంతో ఐఐటీ అధ్యాపకుల సగటు వయసు 1980 ప్రాంతంలో 60 ఏళ్లు కాగా.. ఇప్పుడు అది 40కు తగ్గిపోయింది. గత ఐదేళ్లలో స్వదేశానికి తిరిగొచ్చిన యువ శాస్త్రవేత్తల్లో అత్యధికులు ఐఐటీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ)లలో చేరుతున్నారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ లెక్కల ప్రకారం 2007–12తో పోలిస్తే ఆ తరువాతి ఐదేళ్లలో విదేశాల నుంచి తిరిగొస్తున్న శాస్త్రవేత్తలకు ఇచ్చే ఫెలోషిప్‌లు 70 శాతం పెరిగాయంటే పరిస్థితి ఏమిటన్నది అర్థమవుతుంది. కలివిడిగా.. వడివడిగా... పరిశోధనలంటే సామాన్యులకు ఉపయోగపడేవి కావన్న ఒకప్పటి అంచనాను తారుమారు చేస్తూ ఐఐటీ, ఐఐఎస్సీలు దేశానికి వ్యూహాత్మక ప్రాధాన్యమున్న ప్రాజెక్టులతోపాటు పరిశ్రమల సమస్యలను పరిష్కరించేందుకు, టెక్నాలజీతో సామాన్యుడి కష్టాలు తీర్చేందుకు ప్రాధాన్యమిస్తున్నాయి. ఫలితంగా మునుపటి కంటే వేగంగా ఐఐటీ కేంద్రంగా కొత్త స్టార్టప్‌లు, కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. ఐఐఎస్సీ గతంలోనే వేర్వేరు శాస్త్ర విభాగాలు కలసికట్టుగా పనిచేసేలా వాతవరణ మార్పులపై ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఆ తరువాత ఇదే తరహాలో ఇంధనం, నీటి సమస్యల పరిష్కారానికీ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. వీటితోపాటు ధ్వనికంటే వేగంగా దూసుకెళ్లే విమానాల కోసమూ ప్రత్యేక కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఐఐటీ మద్రాస్‌లోనూ 2014లో కంబషన్ (ఇంధనం మండే ప్రక్రియ)పై మొదలుపెట్టి.. నానో మెటీరియల్స్, కంప్యూటేషనల్ బ్రెయిన్ రీసెర్చ్, బయోలాజికల్ సిస్టమ్స్ ఇంజినీరింగ్, డేటా సైన్సెస్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లోనూ ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసింది. మరిన్ని కేంద్రాల ఏర్పాటు ఆలోచనలతో ముందుకొచ్చిన వారికి రూ. 2 కోట్ల నగదు బహుమతి కూడా ఇస్తోంది. ముందు వరుసలో ఐఐటీ బాంబే... ఐఐటీ బాంబే 2017లో తొలిసారి ఖగోళ శాస్త్రంలో కోర్సును ప్రారంభించింది. ఇదే సంస్థలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివి విదేశాల్లో ఖగోళశాస్త్రంలో ఉన్నత విద్య అభ్యసించిన వరుణ్ భలేరావును చదువు చెప్పేందుకు ఎంపిక చేసుకుంది. ఏడాది తిరిగేలోగా మరో నలుగురు మాజీ ఐఐటీయన్లు ఆయనకు జతకూడారు. వేర్వేరు అంశాల్లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన వీరు ఇప్పుడు ఖగోళశాస్త్రంలో కొత్త ఆవిష్కరణలకు పునాదులు వేస్తున్నారు. లడాఖ్‌లోని 18 ఏళ్ల పురాతన ఆప్టికల్ టెలిస్కోప్ దానంతట అదే పనిచేసేలా సరికొత్త ఆటోమేషన్ సాఫ్ట్‌వేర్‌ను వారు రూపొందిస్తున్నారు. అంతేకాదు... భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)తో కలసి గురుత్వ ఖగోళ శాస్త్రానికి సంబంధించిన ప్రయోగాలూ చేపట్టారు. భలేరావు మాదిరిగానే.. న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో ఆంథ్రోపాలజీ చదివిన అనూష్ కపాడియా.. ఇప్పుడు ఐఐటీ బాంబేలో సామాజిక శాస్త్రాల్లో విద్య నేర్పుతున్నారు. ఐఐటీ, ఐఐఎస్సీల్లో గత కొన్నేళ్లుగా జరుగుతున్న వినూత్న పరిశోధనల్లో కొన్ని... ► మానవ మెదళ్ల మాదిరిగా పనిచేసే మైక్రోచిప్‌ల తయారీపై ఐఐటీ ఢిల్లీలో మనన్ సూరీ అనే శాస్త్రవేత్త పరిశోధనలు చేస్తున్నారు. అతితక్కువ ఖర్చుతో సమాచారాన్ని దీర్ఘకాలంపాటు నిల్వ చేసుకోగల మెమరీని అభివృద్ధి చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. నానో ఎలక్ట్రానిక్స్, నానో టెక్నాలజీలపై ఫ్రాన్స్‌లో పీహెచ్డీ చేసిన మనన్ సూరికి మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) గతేడాది 35 ఏళ్ల వయసులోపు ఉన్న అద్భుత శాస్త్రవేత్తగా అవార్డు అందించింది. ► జల విద్యుత్ తయారీలో కీలకమైన టర్బైన్లను ప్రస్తుత పరిమాణంకంటే పదిరెట్లు తక్కువ సైజులో, అది కూడా వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్న కార్బన్ డయాక్సైడ్తో పనిచేయించేలా ప్రయోగాలు జరుగుతున్నాయి. 2012లో బెంగళూరులోని ఐఐఎస్సీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరిన ప్రమోద్ కుమార్ కార్బన్ డయాక్సైడ్ను ఒక ప్రత్యేక స్థితికి తీసుకెళ్లడం ద్వారా టర్బయిన్లలో వాడుకోవచ్చునని అంటున్నారు. ద్రవ, వాయు స్థితులకు మధ్యలో ఉండే ఈ ప్రత్యేక స్థితిలో కార్బన్ డయాక్సైడ్ను వాడినప్పుడు తక్కువ సైజున్న టర్బయిన్లతోనే సమర్థంగా విద్యుదుత్పత్తి చేయవచ్చని అంచనా. ఈ టర్బయిన్ సంప్రదాయేతర ఇంధన వనరులతోపాటు అణు రియాక్టర్లలోనూ అత్యంత కీలక పాత్ర పోషించనుందని అంచనా. ► 2007లో ఐఐటీ బాంబే నుంచి పట్టభద్రుడైన నిషాంత్ డోంగరి ప్రస్తుతం హైదరాబాద్ ఐఐటీలో పనిచేస్తూ క్షిపణి రక్షణ వ్యవస్థలపై పరిశోధనలు నిర్వహిస్తున్నారు. ఆయన ఇప్పటికే వినూత్న సౌరశక్తి పరికరాల తయారీతోపాటు రూఫ్‌టాప్ సోలార్ ప్యానళ్ల సమర్థ వినియోగం వంటి అంశాల్లో సేవలందించేందుకు ‘ప్యూరెనర్జీ’ పేరుతో కంపెనీ స్థాపించారు. ► స్మార్ట్ఫోన్లలో ఇంటర్నెట్ వేగాన్ని పదుల రెట్లు ఎక్కువ చేసే 5జీ టెక్నాలజీకి తగిన ప్రమాణాలను రూపొందించే విషయంలో ఐఐటీ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న కూచి కిరణ్ విజయం సాధించారు. గతేడాదే ఈ టెక్నాలజీపై పేటెంట్‌కు కిరణ్‌తోపాటు ఇతర శాస్త్రవేత్తలు దరఖాస్తు చేశారు. — సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
దేశంలోనే రెండో పెద్ద క్యాంపస్
మై క్యాంపస్ లైఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) - రూర్కెలా.. దేశంలో ఉన్న 30 ఎన్ఐటీల్లో టాప్-10లో నిలుస్తున్న విద్యా సంస్థ. అంతేకాకుండా బీటెక్ - ఎంటెక్ (డ్యుయెల్ డిగ్రీ), ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ, ఎంటెక్, ఎంబీఏ, పీహెచ్డీ వంటి కోర్సులను అందిస్తూ విద్యార్థుల ప్రశంసలు దక్కించుకుంటోంది. ఇక్కడ కంప్యూటర్‌సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో బీటెక్-ఎంటెక్డ్యుయెల్ డిగ్రీ చదువుతున్న ధరహాస్ తన క్యాంపస్ కబుర్లను మనతో పంచుకుంటున్నాడిలా.. మాది నల్గొండ జిల్లాలోని సూర్యాపేట. ఇంటర్మీడియెట్ తర్వాత జేఈఈ-మెయిన్‌లో ర్యాంకు సాధించి ఎన్ఐటీ - రూర్కెలాను ఎంచుకున్నాను. ఇక్కడ బీటెక్‌లో అన్ని బ్రాంచ్‌లు కలుపుకుని తెలుగు విద్యార్థులు 600 మంది వరకు ఉంటారు. క్యాంపస్ మొత్తం 1200 ఎకరాల్లో ఉంది. ఐఐటీ-ఖరగ్‌పూర్ తర్వాత దేశంలోనే రెండో అతిపెద్ద క్యాంపస్ ఇది. ప్రవేశం లభించిన విద్యార్థులందరికీ హాస్టల్ వసతి ఉంటుంది. సాధారణంగా ఉదయం 8.00 నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు తరగతులు, ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. ఈ సమయంలో ఆయా బ్రాంచ్‌లు, సబ్జెక్టులను బట్టి క్లాసులు ఉంటాయి. ప్రతి సెమిస్టర్లో మిడ్ టర్మ్, ఎండ్ టర్మ్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. పరిశోధనల దిశగా ప్రోత్సాహం ఫ్యాకల్టీ అంతా వారివారి సబ్జెక్టుల్లో అత్యంత నిష్ణాతులు. స్నేహపూరిత వాతావరణంలో అన్ని విషయాలపైనా అవగాహన కల్పిస్తారు. పరిశోధనలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. విద్యార్థులను పరిశోధనల దిశగా ప్రోత్సహిస్తారు. సబ్జెక్టుపరంగా ఏవైనా సందేహాలు ఎదురైతే మెయిల్ ద్వారా ఫ్యాకల్టీని సంప్రదించే వీలుంది లేదా స్వయంగా ఎప్పుడైనా ఫ్యాకల్టీని కలవొచ్చు. క్యాంపస్‌లో తెలుగు ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. వారు కూడా తెలుగు విద్యార్థులకు అన్ని విధాలా సహాయసహకారాలు అందిస్తారు. ప్రముఖ విద్యా/పరిశోధన సంస్థల నుంచి గెస్ట్ లెక్చరర్లు కూడా వస్తారు. హ్యుమానిటీస్ కోర్సులు చదవాలి సోమవారం నుంచి శుక్రవారం వరకు తరగతులు ఉంటాయి. బోధన వినూత్నంగా ఉంటుంది. నిజ జీవితంలో ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారాలు కనుగొనడం లేదా పాఠం చెప్పి.. ప్రాక్టికల్స్ చేయిస్తారు. విద్యార్థులే ఆయా అంశాలపై సొంతంగా ఆలోచించేలా, నేర్చుకునేలా ప్రోత్సహిస్తారు. వివిధ అంశాలపై అవగాహన కల్పించడానికి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్స్, ప్రొజెక్టర్, ఆన్‌లైన్‌ను వినియోగిస్తారు. ఇంజనీరింగ్ సబ్జెక్టులతోపాటే ప్రతి విద్యార్థీ హ్యుమానిటీస్/సోషల్ సెన్సైస్ కోర్సులను అభ్యసించాలి. నేను హ్యూమన్ సెన్సైస్‌ను అధ్యయనం చేశాను. పాఠ్యేతర కార్యక్రమాలకు కూడా పెద్దపీట వేస్తారు. విద్యార్థులు అన్ని రంగాల్లో నిష్ణాతులుగా తయారయ్యేలా ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, ఫిజికల్ ఎడ్యుకేషన్స్, గేమ్స్‌లలో శిక్షణనిస్తారు. స్టార్టప్స్‌కు సలహాలు యువ పారిశ్రామికవేత్తలుగా రాణించాలనుకునేవారికి క్యాంపస్‌లో మంచి అవకాశాలున్నాయి. ప్రత్యేకంగా ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ సెంటర్ ఉంది. సొంత స్టార్టప్ ఏర్పాటు చేయాలనుకునేవారికి ఈ-సెల్ ఆధ్వర్యంలో సూచనలు, సలహాలు అందిస్తారు. అంతేకాకుండా ఐడియా కాంపిటీషన్స్, వర్క్‌షాప్స్ నిర్వహిస్తారు. క్యాంపస్.. కలర్‌ఫుల్ ఏటా క్యాంపస్‌లో టెక్నికల్ ఫెస్ట్, కల్చరల్ ఫెస్ట్, స్పోర్ట్స్ ఫెస్ట్‌లు నిర్వహిస్తారు. కల్చరల్ ఈవెంట్స్‌లో భాగంగా డ్యాన్స్, పాటలు, డ్రామాలు, చిన్నచిన్న స్కిట్లు వంటి వి ఉంటాయి. ఇక టెక్నికల్ ఫెస్ట్‌లో భాగంగా టెక్నికల్ ఈవెంట్స్, రోబో కాంపిటీషన్స్తోపాటు వివిధ పరిశోధన సంస్థల నుంచి వచ్చే శాస్త్రవేత్తల లెక్చర్స్ ఉంటాయి. సదుపాయాలెన్నో.. క్యాంపస్‌లో రుచికరమైన ఆహారాన్ని అందించే భోజనశాలలు, విద్యార్థులు సేదతీరడానికి క్రీడా మైదానాలున్నాయి. అత్యాధునిక పరికరాలతో లేబొరేటరీలున్నాయి. వివిధ పుస్తకాలు, జర్నల్స్‌తో అతిపెద్ద లైబ్రరీ కూడా ఉంది. ఈ ఏడాది క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఏడాదికి సగటున రూ. 8 లక్షలు, గరిష్టంగా రూ.40 లక్షల వేతనాలు కంపెనీలు ఆఫర్ చేశాయి. నా కోర్సు పూర్తయ్యాక క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో మంచి ఆఫర్ వస్తే జాబ్ చేస్తా లేదంటే ఎంఎస్ చదువుతా. -
హ్యుమానిటీస్తో వైవిధ్యమైన కొలువులెన్నో..
నగరంలో గత నెలలో వివిధ కళాశాలల్లో జరిగిన అడ్మిషన్లలో ఎక్కువ మంది విద్యార్థులు బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్(బీఏ) కోర్సులో చేరడానికే మొగ్గుచూపారు. వీరిలో ఎంపీసీ/బైపీసీ కోర్సులు అభ్యసించినవారూ ఉండటం గమనార్హం. గ్రాడ్యుయేషన్ తర్వాత చేసే పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌కు డిమాండ్ పెరిగింది. హ్యుమానిటీస్ కోర్సులు చదివినవారికి కార్పొరేట్ కంపెనీలు ప్రాధాన్యత ఇస్తుండడమే ఇందుకు కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంతేకాకుండా సివిల్స్, గ్రూప్స్ వంటి పోటీ పరీక్షల్లో సోషల్ సెన్సైస్‌కు ఉన్న డిమాండ్ తో ఈ కోర్సులను ఎంచుకుంటున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో హ్యుమానిటీస్ కోర్సులను అందించే విద్యా సంస్థలు, అర్హతలు, ప్రవేశ విధానం, ఉద్యోగావకాశాలపై ఫోకస్.. నిన్నమొన్నటివరకు క్రేజీ కోర్సులంటే.. ఇంజనీరింగ్.. మెడిసిన్. ఈ రెండూ కాకుంటే బీఎస్సీ. విద్యార్థులతోపాటు, వారి తల్లిదండ్రులు కూడా వీటివైపే మొగ్గుచూపేవారు. బీఏ కోర్సులకు ఆదరణ అంతంత మాత్రంగానే ఉండేది. పరిస్థితుల్లో ఇప్పడిప్పుడే మార్పు వస్తోంది. టెక్నికల్, మెడిసిన్ సంబంధిత కోర్సులకు దీటుగా హ్యుమానిటీస్/సోషల్ సెన్సైస్ కూ ఆదరణ పెరుగుతోంది. ఇక సివిల్ సర్వీసెస్ పోటీ పరీక్షల్లోనూ డిగ్రీలో ఏ విభాగాల విద్యార్థులైనా సోషల్ సెన్సైస్ సబ్జెక్టులను ఆప్షనల్స్‌గా ఎంచుకుని విజయం సాధిస్తున్నారు. రాష్ట్రస్థాయిలో నిర్వహించే గ్రూప్-1, గ్రూప్-2లు సోషల్ సెన్సైస్ చదివినవారికి అనుకూలంగా ఉంటాయి. సిలబస్‌లో ఎక్కువశాతం వీటికి సంబంధించినదే. సోషల్ సెన్సైస్.. పాపులర్ కోర్సులు హ్యుమానిటీస్/సోషల్ సెన్సైస్‌లో ఎన్నో పాపులర్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఎప్పటి నుంచో ఉన్నవాటితోపాటు కొత్త స్పెషలై జేషన్లు/సబ్జెక్టులను యూనివర్సిటీలు ప్రవేశపెడుతున్నాయి. దేశ సామాజిక, ఆర్థిక పరిస్థితులు, కంపెనీలు, కార్పొరేట్ల అవసరాలకు తగిన కోర్సులను ఆఫర్ చేయడంలో ముం దుంటున్నాయి. బీఏ/ఎంఏలో జాగ్రఫీ, హిస్టరీ, యా నిసెంట్ ఇండియన్ హిస్టరీ- కల్చర్ అండ్ ఆర్కియాలజీ, సోషియాలజీ, సోషల్ వర్క్, రూరల్ డెవలప్మెంట్, ఎకనామిక్స్, ఇంగ్లిష్, స్పానిష్, ఫ్రెంచ్, జర్మన్, పాలిటీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్, పబ్లిక్ రిలేషన్స్, ఎడ్యుకేషన్, ఉమెన్స్ స్టడీస్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ వంటి కోర్సులు చదివిన వారికి నేడు వివిధ రంగాల్లో అపారమైన అవకాశాలు ఎదురు చూస్తున్నాయి. ప్రభుత్వ రంగంలో కొలువులు ప్రభుత్వ విభాగాల్లో సోషల్ సెన్సైస్, హ్యుమానిటీస్ కోర్సులు చదివినవారికి ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయి. ఏటా యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసి అత్యున్నత అధికారులుగా రాణించొచ్చు. ఈ పరీక్షల్లో సైన్స్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో ఎక్కువమంది ఆప్షనల్‌గా జాగ్రఫీ/సోషియాలజీ/తెలుగు సాహిత్యం/పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్/హిస్టరీ వంటి సబ్జెక్టులను ఎంచుకుని పరీక్ష రాస్తున్నారు. చిన్నతనం నుంచే సివిల్ సర్వీసెస్‌ను లక్ష్యంగా నిర్దేశించుకున్నవారు బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్‌లో చేరుతున్నారు. గ్రూప్-1, గ్రూప్-2 వంటి పోటీ పరీక్షలు రాసి డిప్యూటీ కలెక్టర్(ఆర్డీవో), డీఎస్పీ, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ తహసీల్దార్ వంటి ఉద్యోగాలను దక్కించుకోవచ్చు. బీఈడీ కూడా పూర్తిచేస్తే డీఎస్సీ రాసి ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుడిగా పనిచేయొచ్చు. సంబంధిత సబ్జెక్టులో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ పూర్తిచేస్తే.. పోటీ పరీక్షల్లో విజయం సాధించి ప్రభు త్వ జూనియర్ కళాశాలల్లో లెక్చరర్‌గా విధులు నిర్వర్తించవచ్చు. బ్యాంకు పరీక్షలు కూడా రాసుకోవచ్చు. సీఎస్ఆర్తో విస్తృత అవకాశాలు సోషల్‌వర్క్/రూరల్ డెవలప్మెంట్ కోర్సులు పూర్తిచేసిన వారికి వివిధ స్వచ్ఛంద సంస్థల్లో, గ్రామీణాభివృద్ధి సంస్థల్లో ఎన్నో ఉద్యోగావకాశాలున్నాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద కంపెనీలు కొంత మొత్తాన్ని సామాజిక, ప్రజోపయోగ కార్యక్రమాలకు ఖర్చు చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిబంధనల నేపథ్యంలో ఆయా కంపెనీలు ప్రత్యేకంగా సీఎస్ఆర్ విభాగాలను ఏర్పాటు చేశాయి. వీటిని పర్యవేక్షించడానికి సోషల్ వర్క్ కోర్సులను చేసినవారిని నియమించుకుంటున్నాయి. ఇందుకోసం భారీ వేతనాలు చెల్లిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో సోషల్ వర్క్, రూరల్ డెవలప్మెంట్ కోర్సులు చేసినవారికి ఉద్యోగాలు కోకొల్లలు. ఆర్కియాలజిస్టులు తవ్వకాల్లో బయటపడిన ప్రాచీన కళాఖండాలను, ఆయుధాలు వస్తువులను భద్రపరిచే నిపుణులకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఆయా వస్తువులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రదర్శనశాలలను నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చరిత్రకారులు, ఆర్కియాలజిస్టుల అవసరం ఎంతో ఉంది. ఇప్పుడున్న కట్టడాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, నిర్మాణాలు దెబ్బతినకుండా వాటిని పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఇలా చరిత్రకు సంబంధించి వివిధ విభాగాల్లో ఆర్కియాలజిస్టు లుగా అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక నిపుణులు దేశంలో ఆర్థిక సంస్కరణల అమలు, విదేశీ సంస్థల పెట్టుబడుల ప్రవాహం, కొత్త కంపెనీల ఏర్పాటుతో ఆర్థిక శాస్త్రం చదివిన వారికి అవకాశాలు పెరిగాయి. ఆర్థిక శాస్త్రం ప్రాధాన్యతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా యూపీఎస్సీ ద్వారా ఇండియన్ ఎకనమిక్ సర్వీస్ (ఐఈఎస్)ను ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వ విభాగంలోని వివిధ శాఖల్లో ఆర్థికాధికారుల భర్తీకి ప్రతి ఏటా ఐఈఎస్ పరీక్షను నిర్వహిస్తున్నారు. లైబ్రరీ సైన్స్, జర్నలిజం లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ చేసినవారికి వివిధ ప్రభుత్వ గ్రంథాలయాల్లో, కళాశాలలు, యూనివర్సిటీల లైబ్రరీలు, పత్రికల్లో అవకాశాలుంటాయి. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్, పబ్లిక్ రిలేషన్స్ కోర్సులు పూర్తిచేసినవారు.. వివిధ పత్రికలు, మ్యాగజైన్లు, టీవీ చానళ్లు, సినీ రంగం, ప్రభుత్వ విభాగాల్లో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించవచ్చు. ప్రభుత్వ సమాచార, ప్రసార శాఖ, ప్రజా సంబంధాల కార్యాలయాల్లో పబ్లిక్ రిలేషన్స్, సమాచార శాఖాధికారులుగా పనిచేయొచ్చు. ముందునుంచే కెరీర్ ప్రణాళిక విద్యార్థులు కోర్సుల్లో చేరడానికి ముందుగానే తాము ఎలాంటి కెరీర్లో స్థిరపడాలనుకుంటున్నారో ఒక నిర్ణయానికి రావాలి. ఆ కెరీర్‌కు రాబోయే ఐదు/పదేళ్లలో ఎలాంటి అవకాశాలుంటాయో కూడా తెలుసుకోవాలి. ఇందుకనుగుణంగా కోర్సును ఎంపిక చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే విలువైన సమయం/డబ్బు వృథా అవుతాయని అంటున్నారు. విజయవంతమైన కెరీర్‌ను అందుకోవా లంటే పోటీ పరీక్షల్లో విజయం సాధించాలి. వీటి కోసం ముందునుంచీ సిద్ధం కావాలని చెబుతున్నారు. అవసరమైన స్కిల్స్: విస్తృత అధ్యయనం సమాచార సేకరణ, పరిశోధన నైపుణ్యాలు క్రిటికల్, లాజికల్ థింకింగ్ వర్తమానాంశాలపై పట్టు నెట్, సెట్‌తో.. రాష్ట్ర స్థాయిలో స్టేట్ లెవల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సెట్) రాసి డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్ పరీక్షలకు అర్హత సాధించొచ్చు. జాతీయస్థాయిలో యూజీసీ ఏటా రెండుసార్లు నిర్వహించే నేషనల్ లెవల్ ఎలిజిబిలిటీ టెస్ట్(నెట్) రాసి.. జాతీయస్థాయి విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, ఐఐఎంలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, రాష్ట్రస్థాయి యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా అవకాశాలందుకోవచ్చు. నెట్ ద్వారా జేఆర్ఎఫ్కు ఎంపికైతే ప్రతినెలా ఫెలోషిప్ పొందుతూ.. పీహెచ్డీ చేసే అవకాశం కూడా ఉంది. కోర్సులను అందిస్తున్న సంస్థలు ఐఐటీ - మద్రాస్ వెబ్సైట్: http://hsee.iitm.ac.in/. ఐఐటీ-ఖరగ్‌పూర్. వెబ్సైట్: www.iitkgp.ac.in/ ఐఐటీ-ఢిల్లీ. వెబ్సైట్: www.iitd.ac.in ఐఐటీ-కాన్పూర్. వెబ్సైట్: www.iitk.ac.in ఐఐటీ- బాంబే. వెబ్సైట్: www.iitb.ac.in హైదరాబాద్‌లో.. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వెబ్సైట్: www.uohyd.ac.in ఉస్మానియా యూనివర్సిటీ వెబ్సైట్: www.osmania.ac.in మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం - హైదరాబాద్ వెబ్సైట్: http://www.manuu.ac.in/ ఇగ్నో - హైదరాబాద్ వెబ్సైట్: http://rchyderabad.ignou.ac.in/ నిజాం కాలేజ్ వెబ్సైట్: www.nizamcollege.ac.in బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వెబ్సైట్: www.braou.ac.in టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్ వెబ్సైట్: http://campus.tiss.edu/hyderabad/