Hundi robbery
-
దేవుడా క్షమించు నీ హుండీ ఎత్తుకెళ్తున్నా!.. వీడియో వైరల్
భోపాల్: రాత్రి వేళ్లల్లో ఆలయాల్లోకి చొరబడి హుండీ ఎత్తుకెళ్లిన సంఘటనలు చాలానే చూసుంటారు. కానీ, మధ్యప్రదేశ్‌లోని జబల్పుర్లో జరిగిన ఈ హుండీ చోరీ అందులో ప్రత్యేకం. అర్ధరాత్రి గుడికి కారులో వచ్చిన ఓ దొంగ.. ముందుగా దేవుడికి ప్రార్థన చేశాడు. ఆ తర్వాత లోపలికి వెళ్లి హుండీని మాయం చేశాడు. సీసీటీవీ కెమెరాలో నమోదైన ఈ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ‘దేవుడా నన్ను క్షమించు నీ హుండీని ఎత్తుకెళ్తున్నా’ అని ఆ దొంగ ప్రార్థన చేశాడేమో అని వీడియో చూసినవారు అనుకుంటున్నారు! జబల్పుర్ గౌర్ చౌకిలో ఉన్న హనుమాన్ ఆలయానికి సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు కారులో వచ్చాడు దొంగ. అంతా దీపావళి హడావుడిలో ఉండగా.. తన చేతివాటాన్ని చూపించాడు. తెల్లవారి ఓ భక్తుడు గుడికి వెళ్లగా చోరీ జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా.. చేతికి విలువైన గడియారం ధరించిన వ్యక్తి గుడి ముందు చెప్పులు విడిచి లోపలికి వచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే జిల్లాలో గత ఆగస్టులో జరిగిన చోరీలాగే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదీ చదవండి: షాకింగ్.. బతికున్న మహిళను మింగిన 22 అడుగుల భారీ కొండచిలువ -
దేవుడంటే భయం..హుండీలంటే ఇష్టం
యశవంతపుర : వారికి దేవుడంటే భయం. అందుకే ఆలయంలోని గర్భగుడిలోకి అడుగు పెట్టరు. కేవలం హుండీల్లోని సొమ్ము మాత్రమే చోరీ చేస్తారు. ఆలయాల్లోని హుండీలను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్న ఆరుగురు సభ్యుల దొంగల ముఠా పోలీసులకు పట్టుబడింది. మైసూరుకు చెందిన కబ్బాళు అలియాస్ చంద్రు, కుమార అలియాస్ బజాక్, మంజు, విజయకుమార్ అలియాస్ జోగి, బసవ అలియాస్ హరిశ్, పిచ్చగున్న అనే నిందితులను అమృతహళ్లి పోలీసులు శుక్రవారం ఆరెస్ట్ చేశారు.వీరినుంచి రూ.3 లక్షల విలువైన నగలు, రూ.4.50 లక్షల నగదు, మూడు బైకులు, లగేజీ ఆటో స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సిటీకీ సమీపంలో టెంట్ వేసుకోని రాత్రి సమయాల్లో ఆలయాల్లోకి చొరబడి హుండీలను ధ్వంసం చేసి చోరీలకు పాల్పడేవారు. ఇదే క్రమంలో ఈ ఏడాది ఎప్రిల్ 18న అమృతహళ్లి మారెమ్మ ఆలయంలో హుండీని చోర చేశారు. నిందితులు దేవనహళ్లిలో మూడు చోట్ల, చిక్కమగళూరులో రెండు చోట్ల, దావణగెరెలో ఒక చోట చోరీలకు పాల్పడ్డారు. నిందితులు గర్భగుడిలోకి చొరబడకుండా కేవలం హుండీల్లోని సొమ్ము మాత్రమే చోరీ చేసేవారని పోలీసులు తెలిపారు. -
రామేశ్వరం ఆలయంలో దొంగల బీభత్సం
సాక్షి, రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలంలోని రాయికల్ గ్రామ శివారులోని రామేశ్వరం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఆలయంలోని కొన్ని హుండీలను దొంగలు ధ్వంసం చేశారు. హుండీల్లో ఉన్న నగదును దొంగలు తీసుకెళ్లారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆలయం వద్దకు చేరుకున్నారు. దొంగతనం జరిగిన నేపథ్యంలో ఆలయ పరిసర ప్రాంతాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇది స్థానిక దొంగల పనా లేక అంతరాష్ట్ర దొంగల పనా అన్న కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
దేవుడా..దేవుడా!
మర్రిపూడి: భక్తల కోర్కెలు తీర్చుతూ.. ఆధ్యాత్మిక ఆనందాలను పంచే దేవాలయాలకు దిక్కులేకుండా పోతోంది. మండల పరిధిలో ఆలయ దొంగలు రోజురోజుకు పేట్రేగి పోతున్నారు. గ్రామశివారులో ఉన్న ఆలయాలను టార్గెట్ చేస్తున్నారు. ఎన్నిసార్లు దొంగతనం చేసినా చాకచక్యంగా తప్పించుకు తిరుగుతున్నారు.మండలంలోని వల్లాయపాలెం పంచాయతీలోని నిర్మాపురంలో నూతనంగా నిర్మించుకున్న అభయ ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం రాత్రి దొంగలు ప్రవేశించారు. స్వాముల వారి హుండీ పగులగొట్టి అందులో ఉన్న దాదాపు రూ. 15000 అపహరించారు. వరుస ఘటనలు.. గ్రామాల శివారుల్లో లక్షలకు లక్షలు వెచ్చించి తమ ఇష్ట దైవాల ఆలయాలు ఏర్పాటు చేసుకుని కానుకలు వేసేందుకు హుండీలు ఏర్పాటు చేసుకున్నారు. ఇవే దొంగలకు పప్పూబెల్లాల్లా మారాయి. జనసంచారంలేని గుడుల్లోకి జొరబడి హుండీలను పగులగొట్టి అందులో ఉన్న నగదును ఇస్టానుసారంగా దోచుకుపోతున్నారు. ఇలాంటి సంఘటనలు దాదాపు ఆరుసార్లు జరగడంతో మండల ప్రజలు భీతిల్లిపోతున్నారు. అంకేపల్లి గ్రామ శివారులో సంవత్సరం క్రితం నూతన అమ్మవారి గుడిని ఏర్పాటు గ్రామశివారులో ఉన్న అమ్మవారి గుడిలోని హుండీపై దొంగల కన్నుపడింది. ఇప్పటికి మూడు సార్లు ఇక్కడ హుండీ పగుల గొట్టి నగదుతీసుకుని పరారయ్యారు. అలాగే మండలంలోని గుండ్లసముద్రం పంచాయతీ కోష్టాలపల్లి గ్రామ ప్రారంభంలో ఆంజనేయస్వామి ఆలయాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడైతే ఇటీవల పట్టపగలే హుండీ పగులగొట్టి నగదును అపహరించుకుని పోయారు. ఇక మర్రిపూడి పంచాయతీ పరిధిలోని రాజుపాలెం గ్రామంలో అభయాంజనేయస్వామి ఆలయం హుండీ పగులగొట్టి డబ్బులు తీసుకెళ్లారని, గార్లపేటలో ఇలాగే జరిగిందని గ్రామస్తులు తెలిపారు. మండలంలో ఇన్ని దొంగతనాలు జరుగుతున్నా అధికారులు, పోలీసులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
శివ శివా..!
జలుమూరు: ప్రసిద్ద శైవక్షేత్రం శ్రీముఖలింగేశ్వరుని సన్నిధిలో దొంగలు పడ్డారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది. హుండీ కొల్లగొట్టి నగదు దోచుకుపోయారు. తెల్లవారుజామున ఆలయానికి వెల్లిన అర్చకులు ప్రధాన ద్వారం వద్ద తలుపులు తెరిచిఉండడం చూసి అవాక్కయ్యారు. చోరీ జరిగిందని గుర్తించి ఈవోతో కలిసి పోలీసులకు సమాచారం అందించారు. సరిగ్గా పదేళ్ల క్రితం ఇదే నెల ఇదే రోజున ఇలాగే ప్రధాన ఆలయంలో చోరీ జరిగింది. ప్రముఖ దేవాలయంలో దొంగతనం పునరావృతం కావడంతో భక్తుల్లో ఆందోళన కలుగుతోంది. ఈ ఘటనపై పోలీసులు, ఆలయ అధికారులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలావున్నాయి. శ్రీముఖలింగంలోని శ్రీముఖలింగేశ్వరుని దేవాలయంలో రోజువారీ కార్యక్రమాలు నిర్వహించేందుకు అర్చకులు పంచాది ఈశ్వరరావు మంగళవారం తెల్లవారుజాము 5 గంటలకు ఆలయం వద ్దకు వెళ్లారు. ద్వారం వద్ద తలుపులకు తాళాలు పగులగొట్టి ఉండడం గుర్తించిన ఆయన ఆలయ ఈవో వీవీఎస్ నారాయణకు విషయం తెలిపారు. తర్వాత వీరు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఆలయంలో తూర్పు ద్వారం ముఖమండపంనకు ఉన్న తలుపులకు ఐదు తాళాలు ఉన్నాయి. వీటిలో నాలుగు తాళాలను దొంగలు విరగొట్టారు. ప్రధాన ఆలయంలో ఉన్న పాలరాతి నందీశ్వరుని వెనుక భాగాన గల మొదటి హుండీని ఎత్తుకెళ్లిపోయారు. ప్రధాన హుండీతో పాటు మరో హుండీని ముట్టలేదు. ప్రధానంగా ఉత ్తర దిశ గదిలో పార్వతి పరమేశ్వురుల విలువైన వెండి, బంగారు ఆభరణాలు ఉన్నాయి. వీటితో పాటు గర్భగుడిలోని స్వయంభూ లింగం వెండితొడుగు, ఇతర వెండి వస్తువులు అలాగే ఉన్నాయి. వీటిని కనీసం ముట్టకు ండా కేవలం ఒక్క హుండీతో సరిపెట్టుకోవడంపై చిల్లర దొంగలు చేసే పనిగా భావిస్తున్నారు. దొంగతనం చేసేం దుకు దుండగులు ఏ దిక్కు నుంచి గోడ దూకి ఆలయంలోకి ప్రవేశించారో అర్ధం కాని ప్రశ్న. తీసుకెళ్లిన హుండీ ని ఆలయం పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఉంచి తాళాలు పగలుగొట్టినట్టు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఈ హుండీలో సుమారు రూ. 10 వేలు నగదు చోరీకి గురైయింది. ఇందులో నోట్లను తీసుకుపోయి చిల్లర మాత్రం విడిచిపెట్టేశారు. హుండీని ఆలయం దగ్గరలో ఉన్న బీసీ బాలుర వసతి గృహం వెనుక భాగాన పడేశారు. బయటపడిన భద్రతలో డొల్లతనం ఎంతో విశిష్టత ఉన్న ఆలయానికి భద్రత కల్పించడంలో అధి కారులు విఫలమయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంతో పటిష్టమైన భద్రత ఉండాల్సినప్పటికీ కేవలం ఒక్క సెక్యూరిటీ గార్డును మాత్రం తాత్కాలిక పద్ధతిలో నియమించి చేతులు దులుపుకున్న ఆలయ అధికారుల తీరును అందరూ తప్పుపడుతున్నారు. అలాగే ఇటీవల ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా రసాయనాలు పూత వేస్తున్న దృష్ట్యా సీసీ కెమెరాలు తొలగించినట్టు ఈఓ వీవీఎస్ నారాయణ తెలిపారు. ఆలయంలో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డు త్రినాథరావు రాత్రి రెండు గంటల వరకూ మెలకువతో ఉన్నట్లు చెబుతున్నారు. వరుసగా మూడు ఆలయాల్లో చోరీ గడచిన మూడు రోజుల్లో తిమడాంలోని షిర్డీసాయిబాబా, శివాలయంతో పాటు అచ్యుతాపురంలో ఉన్న రామాలయంలో వరుసగా దొంగతనాలు జరిగాయి. ఈ నేపథ్యంలో మళ్లీ శ్రీముఖలింగేశ్వరుని ఆలయంలో చోరీ జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, దేవాలయంలో చోరీ జరిగిన విషయంపై స్థానిక ఎస్ఐ ఎం.గోవిందకు ఈవో ఫిర్యాదు చేశారు. దొంగతనం విషయం తెలుసుకున్న శ్రీకాకుళం క్లూస్‌టీమ్ సీఐ బీఎస్వీ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో గుడి తలుపులు, పగులుగొట్టిన తాళాలు, ఇనుప దండిలు, హుండీ మీద ఉన్న వేలిముద్రలను సేకరించారు. నరసన్నపేట సీఐ కె.పైడుపునాయడు, జలుమూరు, నరసన్నపేట ఎస్ఐ లు ఎం.గోవింద, జి.నారాయణ స్వామితో పాటు సిబ్బ ంది సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. ఈ చోరీ సమాచారం తెలియడంతో దేవాదాయ శాఖ ఏసీ వి.శ్యామలాదేవి సంఘటనా స్థలానికి వచ్చి గ్రామస్తులు, ఆలయ అధికారులతో పాటు సీఐతో మాట్లాడారు. డీఎస్పీ పరిశీలన జలుమూరు: శ్రీముఖలింగం ప్రధాన ఆలయంలో చోరీ జరగడంతో శ్రీకాకుళం డీఎస్పీ వి.భీమారావు మంగళవారం సాయంత్రం పరిశీలించారు. చోరీ ఎలా జరిగిందని.. గుడి ఎన్ని గంటలకు మూత వేస్తారు... మూసిన తర్వాత తాళాలు ఎవరి వద్ద ఉంటాయి... ఎన్ని గంటలకు మళ్లీ తెరుస్తారు... తదితర విషయాలను ఈఓ వీవీఎస్ నారాయణను అడిగారు. వీటితో పాటు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఆయనతో పాటు సిబ్బంది ఉన్నారు. -
లెక్కిస్తానని వచ్చి నొక్కేశాడు
వేములవాడ: సేవ పేరుతో రాజన్నకు ఉచిత సేవలందిస్తానని వచ్చిన చేగుంట నారాయణ అనే వ్యక్తి హుండీ లెక్కింపులో నోట్లు నొక్కేసి ఎస్పీఎఫ్ సిబ్బందికి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఈ ఘటన బుధవారం వేములవాడ రాజన్న సన్నిధిలో చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం మల్కాపూర్‌కు చెందిన చేగుంట నారాయణను అక్కడి సత్యసాయి ట్రస్ట్ ఇన్చార్జీ వలపి బాలశేఖర్ ద్వారా హుండీ లెక్కింపులో స్వామివారి సేవ చేసేందుకు బుధవారం ఉదయం వచ్చాడు. ఎస్పీఎఫ్ సిబ్బంది పర్యవేక్షణ, సీసీ కెమెరాల నిఘా ఉన్నప్పటికీ డబ్బులను చూసిన నారాయణ రూ.2 వేలనోట్లు 15, రూ.500 నోట్లు 64, ఒకటి రూ.వంద నోటు, తొమ్మిది పదిరూపాయల నోట్లు, రూ.ఇరవై నోటు ఒకదాన్ని తన నడుముకున్న లుంగీలో చుట్టేశాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ వి.సురేందర్ దీనిపై కన్నేశాడు. కాసేపటి తర్వాత మూత్రవిసర్జనకు బయటికి వెళతానంటూ నారాయణ మెల్లగా నడవసాగాడు. గమనించిన సురేందర్‌కు అనుమానం పెరిగి, నారాయణను ప్రశ్నించి, పక్కనే గదిలోకి తీసుకెళ్లి తనిఖీ చేశాడు. దీంతో రూ. 62,210 నగదు దొరికింది. వెంటనే విషయాన్ని ఈవో దూస రాజేశ్వర్‌కు తెలిపారు. ఈవో వెంటనే టౌన్ సీఐ శ్రీనివాస్‌కు సమాచారం అందించడంతో ఎస్సై సైదారావు, స్పెషల్‌పార్టీ పోలీసు మనోహర్ నారాయణను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. -
పిడుగురాళ్లలో దొంగల బీభత్సం
పిడుగురాళ్ల : గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలోని అయ్యప్ప ఆలయంలో చోరీ జరిగింది. ఆలయంలో ఉన్న ఆరు చిన్న హుండీలు, ఒక పెద్ద హుండీని శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు అపహరించుపోయారు. శనివారం ఉదయం గమనించిన నిర్వాహకులు చుట్టుపక్కల వెదకగా పక్కనే ఉన్న పత్తి చేనులో పగుల గొట్టిన హుండీలు కనిపించాయి. ఎంత సొత్తు పోయిందనేది తెలియాల్సి ఉంది. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు -
సాయిబాబా ఆలయంలో హుండీ చోరీ
అశ్వాపురం: ఖమ్మం జిల్లా అశ్వాపురం మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆలయంలో ఉన్న హుండీని ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం విషయం తెలుసుకున్న ఆలయ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
శివాలయంలో హుండీ చోరీ
నల్గొండ(భువనగిరి అర్బన్): భువనగిరి మండలం తాజ్పూర్ గ్రామంలోని శివాలయంలో దోపిడీ జరిగింది. శనివారం అర్ధరాత్రి సమయంలో దొంగలు హుండీ పగలగొట్టి అందులో ఉన్న నగదును దోచుకున్నారు. హుండీలో రూ.10 వేల నగదు ఉండవచ్చునని గ్రామస్తులు భావిస్తున్నారు. ఆదివారం ఉదయం గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు.