భోపాల్: రాత్రి వేళ్లల్లో ఆలయాల్లోకి చొరబడి హుండీ ఎత్తుకెళ్లిన సంఘటనలు చాలానే చూసుంటారు. కానీ, మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌లో జరిగిన ఈ హుండీ చోరీ అందులో ప్రత్యేకం. అర్ధరాత్రి గుడికి కారులో వచ్చిన ఓ దొంగ.. ముందుగా దేవుడికి ప్రార్థన చేశాడు. ఆ తర్వాత లోపలికి వెళ్లి హుండీని మాయం చేశాడు. సీసీటీవీ కెమెరాలో నమోదైన ఈ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ‘దేవుడా నన్ను క్షమించు నీ హుండీని ఎత్తుకెళ్తున్నా’ అని ఆ దొంగ ప్రార్థన చేశాడేమో అని వీడియో చూసినవారు అనుకుంటున్నారు!
జబల్‌పుర్ గౌర్ చౌకిలో ఉన్న హనుమాన్ ఆలయానికి సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు కారులో వచ్చాడు దొంగ. అంతా దీపావళి హడావుడిలో ఉండగా.. తన చేతివాటాన్ని చూపించాడు. తెల్లవారి ఓ భక్తుడు గుడికి వెళ్లగా చోరీ జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా.. చేతికి విలువైన గడియారం ధరించిన వ్యక్తి గుడి ముందు చెప్పులు విడిచి లోపలికి వచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే జిల్లాలో గత ఆగస్టులో జరిగిన చోరీలాగే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇదీ చదవండి: షాకింగ్.. బతికున్న మహిళను మింగిన 22 అడుగుల భారీ కొండచిలువ
Comments
Please login to add a commentAdd a comment