Temple theft
-
మొద్దునిద్ర వీడేదెన్నడో.. దొంగల నుండి రక్షించుకో దేవుడా!
కరీంనగర్‌కల్చరల్: రక్షించు దేవుడా అంటూ పొద్దున లేవగానే ప్రార్థించే దేవుడి సొమ్ముకు రక్షణలేకుండా పోతోంది. జిల్లాలోని ఆలయాల్లో వరుస చోరీలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేవుడి ఆభరణాలు.. హుండీ సొమ్ము దొంగలపాలు అవుతోంది. పరిరక్షించాల్సిన దేవాదాయశాఖ అధికారులు మొద్దునిద్ర వహిస్తుండగా.. ఆలయాల్లో సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. జిల్లాలోని పలు ఆలయాల్లో ఇటీవల జరుగుతున్న చోరీలు ఆందోళన కలిగిస్తుండగా.. దేవుడి సొమ్ము దొంగలపాలవుతోంది. ● జిల్లాలోని చాలా ఆలయాల్లో సీసీకెమెరాలు లేవు. ఉన్న ఆలయాల్లో పనిచేయడం లేదు. గతంలో పోలీసులు ఆలయాల్లో నైట్ వాచ్మెన్లను, స్థానికులను, సిబ్బందితో మాట్లాడి రిజిష్టర్‌లో సంతకం నమోదు చేసుకునేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితులే కనిపించడం లేదు. ● కరీంనగర్‌లోని వేంకటేశ్వర ఆలయంలో 12రోజుల క్రితమే హుండీ దొంగతనం కాగా.. మళ్లీ ఆదివారం అర్ధరాత్రి దొంగలు హుండీ చోరీ చేశారు. కరీంనగర్ వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు కూతవేటుదూరంలో ఉన్న ఆలయంలో పక్షంరోజుల్లో రెండుసార్లు దొంగతనం జరగడం పర్యవేక్షణకు అద్ధం పడుతోంది. ● హూజూరాబాద్‌లోని కేసీక్యాంపు వేంకటేశ్వర ఆలయంలో రూ.3లక్షల విలువ ఆభరణాలు, జమ్మికుంటలోని శ్రీవేంకటేశ్వర ఆలయంలో సుమారు రూ.5లక్షల ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. ● అక్టోబర్ 8న కరీంనగర్‌లోని ప్రశాంత్‌నగర్ హనుమాన్ ఆలయంలో హుండీ ఎత్తుకెళ్లారు. ఫిబ్రవరి 2న మంకమ్మతోట లేబర్ అడ్డా భక్తాంజనేయ ఆలయంలో సీసీ కెమెరా వైర్లు కట్‌చేసి హుండీ చోరీచేశారు. హుండీలే కీలకం ఆలయాల ఆదాయానికి హుండీలే కీలకం. భక్తులు హుండీల్లో వేసే కానుకలు చాలా ఆలయాల అభివృద్ధికి ఉపయోగంగా ఉంటున్నాయి. అయితే ఆలయాల్లో సీసీ కెమెరాలు లేకపోవడంతో హుండీ, దేవుళ్ల ఆభరణాలకు రక్షణలేకుండా పోతోంది. ఒక్కోఈవో మూడు నుంచి ఐదు ఆలయాల నిర్వహణ చూస్తుండడంతో పర్యవేక్షణ లోపిస్తోంది. ఆలయాల్లో తప్పనిసరిగా సెక్యూరిటీ గార్డు, నైట్వాచ్మెన్లను నియమించాలని, ఆలయం మూసే ముందు తాళాలు సరిగా వేశారోలేదో చూసుకోవాలని భక్తులు కోరుతున్నారు. సీసీ కెమెరాలు పనిచేసేలా చూడాలని, పోలీసు బీట్బుక్ నిర్వహించాలని సూచిస్తున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలి భక్తుల కానుకలకు భద్రతకల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఇందు కోసం అన్ని ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఈవోలకు ఆదేశాలిచ్చాం. ఆదాయం ఎక్కువగా ఉంటే దేవాదాయశాఖ కమిషనర్ అనుమతితో నైట్‌వాచ్ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశాం. ఆలయ హుండీలను పట్టిష్ఠంగా ఏర్పాటు చేసుకోవాలి. ఈవోలు, అధికారులు తరచూ పర్యవేక్షిస్తుండాలి. – ఆకునూరి చంద్రశేఖర్, ఉమ్మడిజిల్లా దేవాలయశాఖ సహాయ కమిషనర్ -
దేవుడా క్షమించు నీ హుండీ ఎత్తుకెళ్తున్నా!.. వీడియో వైరల్
భోపాల్: రాత్రి వేళ్లల్లో ఆలయాల్లోకి చొరబడి హుండీ ఎత్తుకెళ్లిన సంఘటనలు చాలానే చూసుంటారు. కానీ, మధ్యప్రదేశ్‌లోని జబల్పుర్లో జరిగిన ఈ హుండీ చోరీ అందులో ప్రత్యేకం. అర్ధరాత్రి గుడికి కారులో వచ్చిన ఓ దొంగ.. ముందుగా దేవుడికి ప్రార్థన చేశాడు. ఆ తర్వాత లోపలికి వెళ్లి హుండీని మాయం చేశాడు. సీసీటీవీ కెమెరాలో నమోదైన ఈ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ‘దేవుడా నన్ను క్షమించు నీ హుండీని ఎత్తుకెళ్తున్నా’ అని ఆ దొంగ ప్రార్థన చేశాడేమో అని వీడియో చూసినవారు అనుకుంటున్నారు! జబల్పుర్ గౌర్ చౌకిలో ఉన్న హనుమాన్ ఆలయానికి సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు కారులో వచ్చాడు దొంగ. అంతా దీపావళి హడావుడిలో ఉండగా.. తన చేతివాటాన్ని చూపించాడు. తెల్లవారి ఓ భక్తుడు గుడికి వెళ్లగా చోరీ జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా.. చేతికి విలువైన గడియారం ధరించిన వ్యక్తి గుడి ముందు చెప్పులు విడిచి లోపలికి వచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే జిల్లాలో గత ఆగస్టులో జరిగిన చోరీలాగే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదీ చదవండి: షాకింగ్.. బతికున్న మహిళను మింగిన 22 అడుగుల భారీ కొండచిలువ -
బాలలే హుండీ దొంగలు!
భీమవరం టౌన్/ఉండి : జిల్లాలోని ఉండి మండలం చిలుకూరు గ్రామం పైలమ్మ అమ్మవారి గుడి హుండీ పగులగొట్టి నగదు చోరీ చేసిన కేసును నాలుగు రోజుల్లోనే పోలీసులు ఛేదించారు. గుడి వద్ద సీసీ కెమెరా ఫుటేజీ దర్యాప్తు వేగవంతానికి దోహదపడింది. నలుగురు మైనర్లు మోటారు సైకిళ్లపై వచ్చి చోరీకి పాల్పడ్డారు. వీరిలో ఒక బాలిక కూడా ఉండటం విశేషం. వీరంతా బాల నేరస్తులే. భీమవరం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నరసాపురం డీఎస్పీ కె.నాగేశ్వరరావు వివరాలు వెల్లడించారు. ఈ నెల 3వ తేదీ తెల్లవారుజామున చోరీ జరిగినట్టు గుడి కమిటీ సభ్యుడు రుద్రరాజు శివ ఫిర్యాదు చేశారు. భీమవరం రూరల్ సీఐ ఎం.శ్యామ్‌కుమార్ ఆధ్వర్యంలో ఉండి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఎస్సై అప్పలరాజుకు అందిన సమాచారం మేరకు కానిస్టేబుళ్లు ఎన్.గోపి, పి.నాని బాబుతో కలిసి బుధవారం ఉండి మెయిన్ సెంటర్లో ఇద్దరు బాల నేరస్తులను పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి చోరీ సొత్తు రూ.8 వేలు రికవరీ చేసి విచారించగా మరో ఇద్దరు బాల నేరస్తులు కూడా ఉన్నట్లు తెలిపారు. ఆ ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. చెడు వ్యసనాలకు అలవాటుపడి రాత్రి వేళల్లో భీమవరం పరిసర గ్రామాల్లోని గుళ్లలో హుండీల సొత్తు చోరీ చేసి జల్సా చేస్తున్నారు. వీరిపై గతంలో భీమవరం వన్‌టౌన్, ఆకివీడు, వీరవాసరం, గుడివాడ వన్ టౌన్ పోలీస్స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయి. దొరికిన ఇద్దరూ మైనర్లు కావడంతో ఏలూరు జువైనల్ కోర్టులో హాజరు పరుస్తామని డీఎస్పీ చెప్పారు. ఉండి ఎస్సై అప్పలరాజును, ఇరువురు కానిస్టేబుళ్లను ఎస్పీ నారాయణ నాయక్ అభినందించారు. -
ఆలయాలే వీరి టార్గెట్..
సాక్షి, విశాఖపట్నం: విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను విజయనగరం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా 27 ఆలయాల్లో ఇటీవల కాలంలో నేరాలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. మధురవాడ వాంబే కాలనీకి చెందిన మొగిలిపల్లి నాగార్జున... తోట వీరబాబు మరుపల్లి ధనరాజుతో సహా ఆరుగురు ముఠాగా ఏర్పడి ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్నారు. ముఠా సభ్యులు ఒకరికే ఆటో ఉండడంతో ఆటో పై సంచరిస్తూ నేరాలు చేయడం వీరికి అలవాటుగా మారింది. తాజాగా విజయనగరం జిల్లాలో వరుసగా ఆలయాల్లో హుండీలు పగలగొట్టిన ఈ నేరస్థులను విజయనగరం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. (చదవండి: వివాహేతర సంబంధం: మెడలో చెప్పులతో) అవాస్తవాలను నమ్మొద్దు:డీఐజీ ఇటీవల ఆలయాల్లో జరిగే సంఘటన ఆధారంగా కొందరు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని విశాఖ రేంజ్ డీఐజీ కాళిదాసు రంగారావు పేర్కొన్నారు. ఇలాంటి అవాస్తవాలను నమ్మవద్దని ఆలయాల్లో చోరీలు జరిగితే ప్రజలు మత విద్వేషాలకు లోను కావొద్దని కోరారు. కొందరు నేరస్థులు చోరీలకు పాల్పడటానికి అలవాటు పడ్డారని నేరం జరిగినప్పుడు ప్రజలు పోలీస్ సహకారం తీసుకోవాలని, ఆందోళన వద్దని విశాఖ రేంజ్ డీఐజీ కాళిదాసు వెంకట రంగారావు సూచించారు. (చదవండి: బొగ్గు గనిలో ప్రమాదం, 16 మంది మృతి) -
ఉదయం పూజలు...రాత్రిళ్లు చోరీలు
సాక్షి, సిటీబ్యూరో : ‘ఉదయం భక్తుడిగా దేవాలయంలో జరిగే పూజలకు వస్తాడు. అక్కడ ఉన్న ఉత్సవ విగ్రహలతో పాటు ఇతర వస్తువులను పరిశీలిస్తాడు. ప్రవేశం దగ్గరి నుంచి నిష్క్రమణ వరకు ఏయే మార్గాలున్నాయో గుర్తు పెట్టుకుంటాడు. ఈ విషయాలను స్నేహితులకు వివరించి రాత్రి సమయాల్లో దేవుళ్లకే శఠగోపం పెడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను సైబరాబాద్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారి నుంచి 9.5 కిలోల వెండి ఆభరణాలు, బైక్, మూడు ఎల్ఈడీ టీవీలు, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నారు. గురువారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో క్రైమ్స్ డీసీపీ జానకి షర్మిల, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావుతో కలిసి సీపీ వీసీ సజ్జనార్ వివరాలు వెల్లడించారు. వివరాలు వెల్లడిస్తున్న సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ఇళ్లల్లో చోరీల నుంచి దేవాలయాలవైపు మేడ్చల్ జిల్లా, శామీర్‌పేటకు చెందిన నాగేంద్రబాబు, పల్లె హరీష్ బాబు సులభంగా డబ్బులు సంపాదించేందుకు మూడేళ్ల క్రితం చోరీలబాట పట్టారు. తొలినాళ్లలో ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న వీరు 2017 శామీర్‌పేట పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లి వచ్చారు. గతేడాది అక్టోబర్ నుంచి శామీర్‌పేటకు చెందిన విశాల్ చంద్ర సహకారంతో దేవాలయాల్లో చోరీలకు తెరలేపారు. విశాల్ చంద్ర ఉదయం వేళల్లో ఆలయాలకు వెళ్లి పూజా కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. ఆయా ఆలయాల్లో ఉన్న విగ్రహాలు, వస్తువులను క్షుణ్ణంగా పరిశీలించి తన స్నేహితులు నాగేంద్రబాబు, పల్లెహరీష్ బాబుకు సమాచారం అందించేవాడు. వారు ఇద్దరు అర్ధరాత్రి గుడి తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడేవారు. హుండీల్లో దొరికిన డబ్బులను పంచుకొని, బంగారు అభరణాలు, వెండి విగ్రహాలను పల్లె హరీష్ బాబు ఇంటికి తరలించేవారు. అనంతరం వాటిని అమ్మి డబ్బులను మిగిలిన ఇద్దరికి పంచేవాడు. ఈ తరహాలో వీరు సిద్ధిపేట, రాచకొండ, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 23 దేవాలయాల్లో చోరీలు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన బాలానగర్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ నేతృత్వంలో బృందం వేలిముద్రలను పరిశీలించింది. పాతనేరస్తుల వేలిముద్రలకు సరిపోవడంతో నాగేంద్రబాబు, హరీష్‌బాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారించగా విశాల్ చంద్ర విశాల్ చంద్ర విషయం వెల్లడించారు. దీంతో ముగ్గురిని అరెస్టు చేశారు. వీరి అరెస్టుతో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 13 చోరీలు చేధించినట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. -
పూజారికి టోకరా కొట్టి హారం అపహరణ
-
బోయకొండలో భద్రత కరువు
=ఆలయంలో మూడోసారీ చోరీయత్నం =సిబ్బంది పనేనన్న అనుమానాలు =ఆందోళనలో భక్తులు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా బోయకొండ విరాజిల్లుతోంది. ఇక్కడి అమ్మవారిని దర్శించుకోవడానికి ఇతర రాష్ట్రాల నుంచి సైతం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. అయితే ఆలయంలో చోరీకి యత్నాలు జరుగుతుండడం భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటి వరకు బోయకొండలో మూడు చోరీ యత్నాలు జరిగాయి. అయినా అధికారులు నిర్లక్ష్యం వీడడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. చౌడేపల్లె, : పుణ్యక్షేత్రమైన బోయకొండకు భద్రత కరువవుతోంది. ప్రధాన ఆలయంలో 2012లో రెండు సార్లు చోరీ యత్నాలు జరిగాయి. తాజాగా గురువారం రాత్రి ప్రధాన ఆలయానికి ముందున్న రణభేరి గంగమ్మ ఆలయంలో చోరీ యత్నం జరిగింది. ఆలయ భద్రత కోసం ఏడుగురు సెక్యూరిటీ సిబ్బంది, ఇద్దరు పోలీసులు ఉన్నారు. అయినా చోరీ యత్నాలు వెలుగు చూస్తుండడం ఆలయ అధికారులు, భద్రతా సిబ్బంది పనితీరు చె ప్పకనే చెబుతోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం, సిబ్బంది సక్రమంగా విధులకు హాజరుకాకపోవడమే ఇందుకు కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. అన్నీ అనుమానాలే బోయకొండ గంగమ్మ దర్శనార్థం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. గంగమ్మ దర్శనం అనంతరం రణభేరి గంగమ్మ ఆలయంలో పూజలు చేసి తిరుగు పయనమవుతారు. ఈ ఆలయంలో గురువారం రాత్రి చోరీ యత్నం జరిగింది. ఆలయానికున్న గేట్ల తాళాలు పగులకొట్టి లోపలకు ప్రవేశించిన తీరును చూస్తే అన్నీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన చోరీ యత్నాల్లో దుండగులు ఏ వస్తువులనూ తీసుకెళ్లలేదు. గడ్డపారలతో హుండీలను పగులకొట్టడం, వస్తువులను చిందర వందరగా పడేసి వెళ్లడం చోటు చేసుకుంది. అధికారులను ఇబ్బంది పెట్టడానికేనా ఆలయంలో పనిచేస్తున్న ఉన్నతస్థాయి అధికారులను ఇబ్బంది పెట్టడానికే ఎవరో పనిగట్టుకుని ఇదంతా చేస్తున్నారనే చర్చ సిబ్బంది మధ్య సాగుతోంది. ఆలయ ఈవోగా కస్తూరి ఉన్న సమయంలో (2012 ఆగస్టు 12)లో దుండగలు రెండు చోరీ యత్నాలు చేశారు. తర్వాత ఆమె బదిలీపై బుగ్గమఠం వెళ్లడం, బోయకొండ ఈవోగా హెచ్.జి.వెంకటేష్ బాధ్యతలు చేపట్టడం జరిగిపోయాయి. రాజకీయ, ఇతర కారణాలతో వెంకటేష్ సెలవుపై వెళ్లారు. ప్రస్తుతం ఇన్చార్జి ఈవోగా కస్తూరి బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మరోమారు చోరీ యత్నం జరగడం అనుమానాలకు తావిస్తోంది. ఇదంతా కొంతమంది ఆలయ సిబ్బందే పనిగట్టుకుని చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వెలుగులోకి నిఘా వైఫల్యం ఆలయంలో భద్రత కోసం నియమించిన సెక్యూరిటీ సిబ్బంది, పోలీసుల నిఘా డొల్లతనం మరోమారు బయటపడింది. ఆలయ భద్రత కోసం ఏడుగురు సెక్యూరిటీ ఉన్నారు. మంగళ, గురు, ఆదివారాల్లో ఏడుగురు విధులకు హాజరవుతారు. మిగిలిన రోజుల్లో నలుగురు ఉంటారు. వీరికి తోడుగా ఇద్దరు పోలీసులు ఉండాలి. అయితే గురువారం రాత్రి సెక్యూరిటీ సిబ్బంది శ్రీనాథరెడ్డి, రమణ, భాస్కర్ మాత్రమే విధులకు వచ్చారు. పోలీసులు రోజూ రాత్రి సమయాల్లో బోయకొండ ఔట్ పోస్టు నుంచి బోయకొండపై ఉన్న ఆలయం వరకూ వచ్చి వెళ్లిపోతారని తెలిసింది. ఈ విషయమై ఇన్చార్జి ఈవో కస్తూరిని విచారించగా విధులకు హాజరుకాని సెక్యూరిటీ సిబ్బందిని విధుల నుంచి తాత్కాలికంగా తొలగిస్తున్నామన్నారు. అలాగే పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు బోయకొండలో చోటు చేసుకుంటోన్న చోరీ యత్నాలు భక్తులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.