వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ కె.నాగేశ్వరరావు
భీమవరం టౌన్/ఉండి : జిల్లాలోని ఉండి మండలం చిలుకూరు గ్రామం పైలమ్మ అమ్మవారి గుడి హుండీ పగులగొట్టి నగదు చోరీ చేసిన కేసును నాలుగు రోజుల్లోనే పోలీసులు ఛేదించారు. గుడి వద్ద సీసీ కెమెరా ఫుటేజీ దర్యాప్తు వేగవంతానికి దోహదపడింది. నలుగురు మైనర్లు మోటారు సైకిళ్లపై వచ్చి చోరీకి పాల్పడ్డారు. వీరిలో ఒక బాలిక కూడా ఉండటం విశేషం. వీరంతా బాల నేరస్తులే. భీమవరం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నరసాపురం డీఎస్పీ కె.నాగేశ్వరరావు వివరాలు వెల్లడించారు. ఈ నెల 3వ తేదీ తెల్లవారుజామున చోరీ జరిగినట్టు గుడి కమిటీ సభ్యుడు రుద్రరాజు శివ ఫిర్యాదు చేశారు. భీమవరం రూరల్ సీఐ ఎం.శ్యామ్‌కుమార్ ఆధ్వర్యంలో ఉండి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
ఎస్సై అప్పలరాజుకు అందిన సమాచారం మేరకు కానిస్టేబుళ్లు ఎన్.గోపి, పి.నాని బాబుతో కలిసి బుధవారం ఉండి మెయిన్ సెంటర్‌లో ఇద్దరు బాల నేరస్తులను పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి చోరీ సొత్తు రూ.8 వేలు రికవరీ చేసి విచారించగా మరో ఇద్దరు బాల నేరస్తులు కూడా ఉన్నట్లు తెలిపారు. ఆ ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. చెడు వ్యసనాలకు అలవాటుపడి రాత్రి వేళల్లో భీమవరం పరిసర గ్రామాల్లోని గుళ్లలో హుండీల సొత్తు చోరీ చేసి జల్సా చేస్తున్నారు. వీరిపై గతంలో భీమవరం వన్‌టౌన్, ఆకివీడు, వీరవాసరం, గుడివాడ వన్ టౌన్ పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయి. దొరికిన ఇద్దరూ మైనర్లు కావడంతో ఏలూరు జువైనల్ కోర్టులో హాజరు పరుస్తామని డీఎస్పీ చెప్పారు. ఉండి ఎస్సై అప్పలరాజును, ఇరువురు కానిస్టేబుళ్లను ఎస్పీ నారాయణ నాయక్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment