మంకమ్మతోట భక్తాంజనేయ స్వామి ఆలయంలో చోరీ (ఫైల్)
కరీంనగర్‌కల్చరల్: రక్షించు దేవుడా అంటూ పొద్దున లేవగానే ప్రార్థించే దేవుడి సొమ్ముకు రక్షణలేకుండా పోతోంది. జిల్లాలోని ఆలయాల్లో వరుస చోరీలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేవుడి ఆభరణాలు.. హుండీ సొమ్ము దొంగలపాలు అవుతోంది. పరిరక్షించాల్సిన దేవాదాయశాఖ అధికారులు మొద్దునిద్ర వహిస్తుండగా.. ఆలయాల్లో సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. జిల్లాలోని పలు ఆలయాల్లో ఇటీవల జరుగుతున్న చోరీలు ఆందోళన కలిగిస్తుండగా.. దేవుడి సొమ్ము దొంగలపాలవుతోంది.
● జిల్లాలోని చాలా ఆలయాల్లో సీసీకెమెరాలు లేవు. ఉన్న ఆలయాల్లో పనిచేయడం లేదు. గతంలో పోలీసులు ఆలయాల్లో నైట్ వాచ్‌మెన్‌లను, స్థానికులను, సిబ్బందితో మాట్లాడి రిజిష్టర్‌లో సంతకం నమోదు చేసుకునేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితులే కనిపించడం లేదు.
● కరీంనగర్‌లోని వేంకటేశ్వర ఆలయంలో 12రోజుల క్రితమే హుండీ దొంగతనం కాగా.. మళ్లీ ఆదివారం అర్ధరాత్రి దొంగలు హుండీ చోరీ చేశారు. కరీంనగర్ వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు కూతవేటుదూరంలో ఉన్న ఆలయంలో పక్షంరోజుల్లో రెండుసార్లు దొంగతనం జరగడం పర్యవేక్షణకు అద్ధం పడుతోంది.
● హూజూరాబాద్‌లోని కేసీక్యాంపు వేంకటేశ్వర ఆలయంలో రూ.3లక్షల విలువ ఆభరణాలు, జమ్మికుంటలోని శ్రీవేంకటేశ్వర ఆలయంలో సుమారు రూ.5లక్షల ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు.
● అక్టోబర్ 8న కరీంనగర్‌లోని ప్రశాంత్‌నగర్ హనుమాన్ ఆలయంలో హుండీ ఎత్తుకెళ్లారు. ఫిబ్రవరి 2న మంకమ్మతోట లేబర్ అడ్డా భక్తాంజనేయ ఆలయంలో సీసీ కెమెరా వైర్లు కట్‌చేసి హుండీ చోరీచేశారు.
హుండీలే కీలకం
ఆలయాల ఆదాయానికి హుండీలే కీలకం. భక్తులు హుండీల్లో వేసే కానుకలు చాలా ఆలయాల అభివృద్ధికి ఉపయోగంగా ఉంటున్నాయి. అయితే ఆలయాల్లో సీసీ కెమెరాలు లేకపోవడంతో హుండీ, దేవుళ్ల ఆభరణాలకు రక్షణలేకుండా పోతోంది. ఒక్కోఈవో మూడు నుంచి ఐదు ఆలయాల నిర్వహణ చూస్తుండడంతో పర్యవేక్షణ లోపిస్తోంది. ఆలయాల్లో తప్పనిసరిగా సెక్యూరిటీ గార్డు, నైట్‌వాచ్‌మెన్లను నియమించాలని, ఆలయం మూసే ముందు తాళాలు సరిగా వేశారోలేదో చూసుకోవాలని భక్తులు కోరుతున్నారు. సీసీ కెమెరాలు పనిచేసేలా చూడాలని, పోలీసు బీట్‌బుక్ నిర్వహించాలని సూచిస్తున్నారు.
సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలి
భక్తుల కానుకలకు భద్రతకల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఇందు కోసం అన్ని ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఈవోలకు ఆదేశాలిచ్చాం. ఆదాయం ఎక్కువగా ఉంటే దేవాదాయశాఖ కమిషనర్ అనుమతితో నైట్‌వాచ్ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశాం. ఆలయ హుండీలను పట్టిష్ఠంగా ఏర్పాటు చేసుకోవాలి. ఈవోలు, అధికారులు తరచూ పర్యవేక్షిస్తుండాలి.
– ఆకునూరి చంద్రశేఖర్, ఉమ్మడిజిల్లా దేవాలయశాఖ సహాయ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment