అంకేపల్లి శివారులోని అమ్మవారిగుడి ఆలయంలో చోరీకి గురైన హుండీ
మర్రిపూడి: భక్తల కోర్కెలు తీర్చుతూ.. ఆధ్యాత్మిక ఆనందాలను పంచే దేవాలయాలకు దిక్కులేకుండా పోతోంది. మండల పరిధిలో ఆలయ దొంగలు రోజురోజుకు పేట్రేగి పోతున్నారు. గ్రామశివారులో ఉన్న ఆలయాలను టార్గెట్ చేస్తున్నారు. ఎన్నిసార్లు దొంగతనం చేసినా చాకచక్యంగా తప్పించుకు తిరుగుతున్నారు.మండలంలోని వల్లాయపాలెం పంచాయతీలోని నిర్మాపురంలో నూతనంగా నిర్మించుకున్న అభయ ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం రాత్రి దొంగలు ప్రవేశించారు. స్వాముల వారి హుండీ పగులగొట్టి అందులో ఉన్న దాదాపు రూ. 15000 అపహరించారు.
వరుస ఘటనలు..
గ్రామాల శివారుల్లో లక్షలకు లక్షలు వెచ్చించి తమ ఇష్ట దైవాల ఆలయాలు ఏర్పాటు చేసుకుని కానుకలు వేసేందుకు హుండీలు ఏర్పాటు చేసుకున్నారు. ఇవే దొంగలకు పప్పూబెల్లాల్లా మారాయి. జనసంచారంలేని గుడుల్లోకి జొరబడి హుండీలను పగులగొట్టి అందులో ఉన్న నగదును ఇస్టానుసారంగా దోచుకుపోతున్నారు. ఇలాంటి సంఘటనలు దాదాపు ఆరుసార్లు జరగడంతో మండల ప్రజలు భీతిల్లిపోతున్నారు. అంకేపల్లి గ్రామ శివారులో సంవత్సరం క్రితం నూతన అమ్మవారి గుడిని ఏర్పాటు గ్రామశివారులో ఉన్న అమ్మవారి గుడిలోని హుండీపై దొంగల కన్నుపడింది. ఇప్పటికి మూడు సార్లు ఇక్కడ హుండీ పగుల గొట్టి నగదుతీసుకుని పరారయ్యారు. అలాగే మండలంలోని గుండ్లసముద్రం పంచాయతీ కోష్టాలపల్లి గ్రామ ప్రారంభంలో ఆంజనేయస్వామి ఆలయాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడైతే ఇటీవల పట్టపగలే హుండీ పగులగొట్టి నగదును అపహరించుకుని పోయారు. ఇక మర్రిపూడి పంచాయతీ పరిధిలోని రాజుపాలెం గ్రామంలో అభయాంజనేయస్వామి ఆలయం హుండీ పగులగొట్టి డబ్బులు తీసుకెళ్లారని, గార్లపేటలో ఇలాగే జరిగిందని గ్రామస్తులు తెలిపారు. మండలంలో ఇన్ని దొంగతనాలు జరుగుతున్నా అధికారులు, పోలీసులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment