![Police Crack Down On Kalabhairava Swamy Temple Case Kurnool - Sakshi](/styles/webp/s3/article_images/2020/09/29/police-23.jpg.webp?itok=gAM0Q9bY)
నిందితుణ్ని అరెస్టు చూపుతున్న ఎస్పీ ఫక్కీరప్ప
సాక్షి, కర్నూలు: సంచలన కేసును ఆళ్లగడ్డ రూరల్ పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. పూల దండ ఆధారంగా కూపీ లాగి దుండగుడిని కటకటాల వెనక్కి పంపారు. పోలీస్ ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు. ఆళ్లగడ్డ మండలం చిన్నకందుకూరు గ్రామ పొలిమేరలోని కాలభైరవ స్వామి ఆలయంలో మూలవిరాట్ అంగ భాగాన్ని దొంగలించినట్లు ఈ నెల 19వ తేదీన పోలీసులకు ఫిర్యాదు అందింది. కేసు నమోదు చేసుకొని.. చిన్నకందుకూరుకు వెళ్లి పూజారులను, ఆలయ కమిటీ సభ్యులను విచారించారు. నేరం జరిగిన రోజు గుడి వాకిలికి పూలదండ వేసినట్లు గమనించారు. దానిని ఎవరు తయారు చేశారో ఆళ్లగడ్డ, చుట్టుపక్కల గ్రామాల్లో ఆరా తీశారు. ఎర్రగుంట్ల గ్రామంలో పూల వ్యాపారి దగ్గర గోస్పాడు మండలం ఒంటివెలగల గ్రామానికి చెందిన రాజశేఖర్ కొనుగోలు చేసినట్లు బయటపడింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది.
సంతానం కలుగుతుందని...
వివాహమై పదేళ్లయినా సత్తనపల్లి రాజశేఖర్‌కు సంతానం కలగలేదు. చిన్నకందుకూరు సమీపంలోని కాలభైరవస్వామి అంగ భాగానికి పూజలు చేస్తే ఫలితం ఉంటుందని స్థానికులు సూచించారు. దీంతో ప్రతి అమావాస్యకు గుడికి వెళ్లి పూజలు చేసి అక్కడే నిద్రించేవాడు. ఇలా రెండు సంవత్సరాలు గడిచినా సంతానం కలగలేదు. మూలవిరాట్ అంగభాగాన్ని కొద్దిగా తీసుకొచ్చి, ఇంట్లో పెట్టుకుని పూజలు చేస్తే ఫలితం ఉంటుందని కొంతమంది సలహా ఇచ్చారు. దీంతో ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు రాజశేఖర్..నేరాన్ని అంగీకరించాడు.
నిందితుడిని సోమవారం కర్నూలులో ఎస్పీ ఫక్కీరప్ప ఎదుట హాజరు పరిచారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఆలయాల్లో జరిగే ఘటనలకు రాజకీయ రంగు పులమొద్దన్నారు. ప్రార్థనా మందిరాలతో పాటు అన్ని ఆలయాల వద్ద సీసీ కెమెరాలను, రక్షణ దళాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కేసును ఛేదించిన ఆళ్లగడ్డ డీఎస్పీ పోతురాజు, రూరల్ సీఐ సుదర్శన్ ప్రసాద్, ఎస్‌ఐ వరప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు, హోంగార్డు శ్రీనివాసులును అభినందించి ప్రశంస పత్రాలను అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment