Hussain Basha
-
రూ.2.26 కోట్ల ‘ఇందిరమ్మ’ స్కామ్ నిందితుడి అరెస్టు
గుడ్లూరు: అనర్హులకు ఇందిరమ్మ బిల్లులు మంజూరు చేసి రూ.2.26 కోట్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేసిన నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్సై హుస్సేన్‌బాషా తెలిపారు. మంగళవారం రాత్రి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2007-08 ఇందిరమ్మ గృహాల నిర్మాణం ఫేజ్-1, ఫేజ్-2 కింద మండలంలోని అమ్మవారిపాలెం, బసిరెడ్డిపాలెం, మోచర్ల, నాయుడుపాలెం, పోట్లూరు, చినలాటరఫి, కొత్తపేట, గుడ్లూరుల్లో అనర్హులైన 1543 మందికి ఇళ్లు నిర్మించుకోకుండానే నిర్మించుకున్నట్లు, వారికి రూ.2.26 కోట్ల బిల్లులు చెల్లించినట్లు అప్పటి గృహ నిర్మాణ శాఖ ఏఈ భావన్నారాయణ రికార్డుల్లో నమోదు చేశారు. దీనిపై జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారులు విచారణ చేయగా గృహాలు నిర్మించకుండానే బిల్లులు చెల్లించినట్లు తేలింది. 2009లో భావన్నారాయణను సస్పెండ్ చేయడంతో పాటు.. ఆయనపై గుడ్లూరు పోలీస్‌స్టేషన్‌లో అప్పటి డీఈ లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారు. ఐదేళ్లుగా భావన్నారాయణ తప్పించుకు తిరుగుతున్నారు. మంగళవారం తహశీల్దార్ కార్యాలయం వద్ద ఉన్నాడని సమాచారం అందుకున్న ఎస్సై హుస్సేన్‌బాషా ఆయన్ను అరెస్టు చేశారు. భావన్నారాయణను కందుకూరు కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్సై తెలిపారు. -
చిన్నారికి పెద్ద కష్టం..!
డోన్ రూరల్: ఆ పసిబాలుడికి పెద్ద కష్టమొచ్చింది. ఏడు నెలలు నిండని వయసులో విధిని ఎదిరించి పోరాటం చేస్తున్నాడు. కాలేయ వ్యాధితో బాధపడుతున్న బిడ్డను బతికించుకునేందుకు తల్లిదండ్రులు పడుతున్న ఆరాటం అంతా ఇంతా కాదు. ఇప్పటికే లక్షల రూపాయలు ఖర్చు చేసినా ప్రయోజనం లేకపోవడంతో వారు ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారు. డోన్ మండలం యు. కొత్తపల్లె గ్రామానికి చెందిన జరీనాకు అదే గ్రామానికి చెందిన హుసేన్‌బాషాతో నాలుగేళ్ల క్రితం పెళ్లయింది. పెళ్లయినా మూడేళ్ల తర్వాత ఆమెకు మగపిల్లాడు పుట్టాడు. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే వారిని విధి చిన్నచూపు చూసింది. ఏడునెలల ఇమ్రాన్‌కు అనారోగ్యంగా ఉండడంతో ఆసుపత్రిలో చూపించారు. చిన్నారిని పరిశీలించిన వైద్యులు చిన్నారికి కాలేయ వ్యాధి ఉందని చెప్పారు. దీంతో వారు జబ్బు నయం కోసం రూ. 3 లక్షల వరకు ఖర్చు చేశారు. అయినా నయం కాలేదు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో, కర్నూలులోని ప్రైవేటు ఆసుపత్రుల్లో చిన్నారిని చూపించగా రూ. 30 లక్షల వరకు ఖర్చు అవుతుందని.. ఈ ఆపరేషన్ కూడా 16 రోజులలోనే చేయాలని వైద్యులు చెప్పారు. ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు: హుసేన్‌బాషా, జరీనాలది నిరుపేద కుటుంబం. కూలీనాలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కుమారుడి జబ్బు నయం కోసం అందిన చోటల్లా అప్పులు చేశారు. అయినా జబ్బు నయం కాలేదు. అయితే ఇప్పుడు రూ. 30 లక్షలు అవుతుందని చెప్పడంతో తల్లిదండ్రుల పరిస్థితి దిక్కుతోచని పరిస్థితిగా తయారైంది. ఆరోగ్యశ్రీ పథకం వర్తించదని చెప్పడంతో వారికి దిక్కుతోచడం లేదు. మూడేళ్లతర్వాత పుట్టిన కుమారుడిని రక్షించుకోలేక ఆత ల్లిదండ్రులు పడుతున్న ఆవేదన అందరినీ కలిచివేస్తోంది. ఎవరైనా దాతలు ముందుకొచ్చి తన కుమారుడిని రక్షిస్తే జీవితాంతం వారికి రుణపడి ఉంటామని ఆ తల్లిదండ్రులు కన్నీటితో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాతలెవరైనా ఉంటే సెల్: 9959277796కు ఫోన్ చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.