గుడ్లూరు: అనర్హులకు ఇందిరమ్మ బిల్లులు మంజూరు చేసి రూ.2.26 కోట్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేసిన నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్సై హుస్సేన్‌బాషా తెలిపారు. మంగళవారం రాత్రి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2007-08 ఇందిరమ్మ గృహాల నిర్మాణం ఫేజ్-1, ఫేజ్-2 కింద మండలంలోని అమ్మవారిపాలెం, బసిరెడ్డిపాలెం, మోచర్ల, నాయుడుపాలెం, పోట్లూరు, చినలాటరఫి, కొత్తపేట, గుడ్లూరుల్లో అనర్హులైన 1543 మందికి ఇళ్లు నిర్మించుకోకుండానే నిర్మించుకున్నట్లు, వారికి రూ.2.26 కోట్ల బిల్లులు చెల్లించినట్లు అప్పటి గృహ నిర్మాణ శాఖ ఏఈ భావన్నారాయణ రికార్డుల్లో నమోదు చేశారు.
దీనిపై జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారులు విచారణ చేయగా గృహాలు నిర్మించకుండానే బిల్లులు చెల్లించినట్లు తేలింది. 2009లో భావన్నారాయణను సస్పెండ్ చేయడంతో పాటు.. ఆయనపై గుడ్లూరు పోలీస్‌స్టేషన్‌లో అప్పటి డీఈ లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారు. ఐదేళ్లుగా భావన్నారాయణ తప్పించుకు తిరుగుతున్నారు. మంగళవారం తహశీల్దార్ కార్యాలయం వద్ద ఉన్నాడని సమాచారం అందుకున్న ఎస్సై హుస్సేన్‌బాషా ఆయన్ను అరెస్టు చేశారు. భావన్నారాయణను కందుకూరు కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్సై తెలిపారు.
రూ.2.26 కోట్ల ‘ఇందిరమ్మ’ స్కామ్ నిందితుడి అరెస్టు
Published Wed, Dec 17 2014 2:40 AM | Last Updated on Sat, Sep 2 2017 6:16 PM
Advertisement