hyderabad crime rate
-
వివాహేతర సంబంంధం: పెళ్లికి నిరాకరించిందని హత్య
సాక్షి, ఘట్కేసర్(హైదరాబాద్): పెళ్లికి నిరాకరించి మరొకరితో చనువుగా ఉంటున్న వివాహితను ఓ వ్యక్తి హత్య చేశాడు. ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఘట్కేసర్ ఇన్స్పెక్టర్ చంద్రబాబు గురువారం తెలిపిన మేరకు..శ్రీకాకుళం చెందిన లిమ్మ సంతోష(28) భర్తతో గొడవపడి సొంతూరికి వెళ్లిపోయింది. తల్లితండ్రులు, సోదరుడు, ముగ్గురు పిల్లలతో కలిసి ఏదులాబాద్‌లో ఉంటోంది. అదే ప్రాంతంలో ఉంటున్న మహారాష్ట్రకు చెందిన వినోద్ పర్స్‌రాం(28)తో వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది. పెళ్లి చేసుకోవాలని వినోద్ కోరగా ఆమె నిరాకరించింది. ఇతరులతో సన్నిహితంగా ఉండటాన్ని వినోద్ భరించలేకపోయాడు. దీంతో డిసెంబర్న 3న తాడుతో ఉరి వేసి సంతోషను హత్యచేశాడు. దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడు వినోద్‌ను శామీర్‌పేట్ మండలం తూముకుంటలో అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. -
కాపీ.. పేస్ట్.. చేసేయ్ చీట్!
సాక్షి, సిటీబ్యూరో: ఫేస్బుక్లో అందుబాటులోకి వచ్చిన మార్కెట్‌ప్లేస్ కేంద్రంగా కొత్త తరహా మోసాలు జరుగుతున్నాయి. అక్కడ ఉన్న ప్రకటనల్ని కాపీ చేసి, సొంతంగా పేస్ట్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు ఆకర్షితులైన వారి నుంచి అందినకాడికి దండుకుంటున్నారు. ప్రధానంగా రియల్ఎస్టేట్ సంబంధిత వాటినే ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఈ వ్యవహారంలో సైబర్ నేరగాళ్లు కొన్ని బోగస్ డాక్యుమెంట్లనూ సృష్టించి పంపిస్తుండటం కొసమెరుపు. ఇటీవలి కాలంలో ఈ తరహా మోసాలు పెరిగినట్లు చెబుతున్న సైబర్ క్రైమ్ పోలీసులు కనీస జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఒకప్పుడు సెకండ్‌హ్యాండ్ వస్తువులే... వాట్సాప్, ట్విటర్, ఇన్‌స్ట్రాగామ్... ఇలా ప్రజాదరణ పొందిన ప్రతి సోషల్‌మీడియాను సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. సెకండ్ హ్యాండ్‌తో పాటు కొన్ని రకాలైన ఫస్ట్‌హ్యాండ్ వస్తువులు అమ్మడానికి, కొనడానికి ఆన్‌లైన్‌పై ఆధారపడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఖరీదు చేసే వారు సైతం వాటికి సంబంధించిన సమాచారం సేకరించడాని కి ఇంటర్నెట్పై ఆధారపడుతున్నారు. వీటికి తో డు ఫేస్‌బుక్‌లోనూ ప్రత్యేకంగా మార్కెట్ ప్లేస్ పేరుతో పేజ్‌లు పుట్టుకొచ్చాయి. ద్విచక్ర వాహనా లు, కార్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను తక్కువ ధరకు విక్రయిస్తున్నామంటూ మార్కెట్ ప్లేస్‌లో ప్రకటనలు ఇవ్వడం ఇటీవల పెరిగింది. కొన్నిసార్లు తాము భద్రతా బలగాల్లో పని చేస్తున్నామని, హఠాత్తుగా బదిలీ అయిన నేపథ్యంలో ఆయా వస్తువులను తీసుకువెళ్ళలేక విక్రయిస్తున్నట్లు పేర్కొంటున్నారు. దీంతో అనేక మందికి వారిపై నమ్మకం కలుగుతోంది. అలా బుట్టలో పడిన వారు ఆయా వస్తువుల్ని కొనేందుకు ఆసక్తి చూపి సంప్రదిస్తున్నారు. బేరసారాల తర్వాత అడ్వాన్స్ చెల్లించాలంటూ సైబర్ చీటర్లు షరతు పెడుతున్నారు. అప్పటికే పూర్తిగా వారి వల్లో పడిన బాధితులు వివిధ వాలెట్స్‌లోకి నగదు బదిలీ చేస్తున్నారు. డబ్బు తమకు చేరిన వెంటనే సైబర్ నేరగాళ్ల నుంచి స్పందన ఉండట్లేదు. ఇలా నగరానికి చెందిన అనేక మంది మోసపోయిన దాఖలాలు ఉన్నాయి. తాజాగా రియల్టర్ల అవతారంలో... ఇటీవల కాలంలో మార్కెట్ ప్లేస్‌ను ఆధారంగా చేసుకుని రియల్ఎస్టేట్ వ్యాపారం కూడా పుంజుకుంది. ఇళ్లు, స్థలాలు అమ్మాలని భావించిన ప్రైవేట్ వ్యక్తులు, రియల్టర్లు సైతం మార్కెట్ ప్లేస్‌ను ఆశ్రయిస్తున్నారు. తాము అమ్మదలచిన దాని ఫొటోను పొందుపరుస్తూ ఏ రేటుకు విక్రయించనున్నామో అందులో పేర్కొంటున్నారు. ఆకర్షితులైన వారు మెసెంజర్ ద్వారా సంప్రదించి బేరసారాలు చేసుకుంటున్నారు. అనేక మంది మార్కెట్‌ప్లేస్ కేంద్రంగా స్థలాలు, ఇళ్ళు కొనుగోలు చేసిన వారూ ఉన్నారు. ఇదే సైబర్ నేరగాళ్లను ఆకర్షించింది. ప్రధానంగా మెట్రో నగరాల కేంద్రంగా వ్యవహారాలు నడిపే ఈ కేటుగాళ్లు అప్పటికే మార్కెట్‌ప్లేస్‌లో ఉన్న ప్రకటనల్ని కాపీ చేసి తమ సొంత వాటిగా పేస్ట్ చేస్తున్నారు. వాస్తవానికి ఆ నేరగాళ్ళు ఉండేది ఇతర నగరంలో అయినా డిమాండ్ ఉన్న ప్రాంతాలవి ఇలా కాపీ–పేస్ట్ చేస్తున్నారు. ఎవరైనా వీటికి ఆకర్షితులై మెసెంజర్ ద్వారా సంప్రదిస్తే స్థానికుల మాదిరిగానే జవాబు ఇస్తున్నారు. ఓ రేటు ఖరారైన తర్వాత కొనుగోలుదారులు ఆ స్థలానికి సంబంధించిన పత్రాలను సరిచూసుకోవడానికికోరుతుంటారు. ఇలా చేసిన వారి కోసం సదరు ప్రకటనలో ఉన్న సర్వే నెంబర్లు, ఇతర అంశాల ఆధారంగా బోగస్ ధ్రువీకరణలు తయారు చేస్తున్నా రు. వీటినే వాట్సాప్ లేదా ఈ–మెయిల్ ద్వా రా పంపి అడ్వాన్స్ పేరు తో అందినకాడికి కాజేస్తున్నారు. వాలెట్స్ ద్వారానే కాజేస్తున్నారు.. ఈ సైబర్‌నేరగాళ్లు నగదు లావాదేవీలన్నీ వివిధ రకాలైన వాలెట్స్ ద్వారానే నెరపుతారు. ఒక బాధితుడి నుంచి డబ్బు డిపాజిట్ చేయించుకున్న తర్వాత ఆ ఖాతాలు కనుమరుగు కావడం, ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపితే ఆ నెంబర్లు స్విచ్ఛాఫ్‌లో ఉండటం జరుగుతోంది. ఇలా వాలెట్స్‌లోకి వెళ్లిన డబ్బును సైబర్ నేరగాళ్లు తమ ఖాతాల్లోకి మళ్ళించుకుని కాజేస్తున్నారు. ఈ ఖాతాలు, వాలెట్స్ ఓపెన్ చేయడం కోసం ఆ కేటుగాళ్లు బోగస్ పేర్లు, తప్పుడు చిరునామాలు, గుర్తింపుకార్డులు సమర్పిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే పోలీసుల దర్యాప్తు ఏమాత్రం ముందుకు సాగడం లేదు. ఇటీవల మార్కెట్ ప్లేస్ బాధితుల ఫిర్యాదులు ఎక్కువయ్యాయని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. ఈ తరహా మోసాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించుకున్నారు. దీంతో మార్కెట్ ప్లేస్ కేంద్రంగా జరుగుతున్న మోసాల పైనా ప్రచారం నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. అపరిచితులతో ఆర్థిక లావాదేవీలు వద్దని సైబర్‌క్రైమ్ వారిస్తున్నారు. తప్పనిసరై చేయాల్సి వచ్చినా వ్యక్తిగతంగా కలిసిన తర్వాతే చేపట్టాలని, కేవలం ఫోన్‌కాల్స్, మెసెంజర్స్ సంప్రదింపుల్ని ఆధారంగా చేసుకుని డబ్బు చెల్లించవద్దని స్పష్టం చేస్తున్నారు. -
పనిచేసే దుకాణానికే కన్నం
దుండిగల్: పని చేసే దుకాణంలోనే దొంగతనానికి పాల్పడిన యువకుడిని పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దుండిగల్ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పేట్ బషీరాబాద్ ఏసీపీ ఏవీఆర్ నర్సింహరావు వివరాలు వెల్లడించారు. విద్యానగర్ ప్రాంతానికి చెందిన శివకుమార్ సుభాష్‌నగర్ డివిజన్ కృషి కాలనీలో ఉంటూ కార్పెంటర్‌గా పని చేసేవాడు. కుత్బుల్లాపూర్ లోని పలు దుకాణాల్లో సామాగ్రిని తీసుకు వచ్చి పీస్ వర్క్ పనులు చేసేవాడు. ఇటీవల గోదావరి హోమ్స్‌లోని సాయిబాలాజీ ఉడ్ డోర్ వర్క్స్ షాపులో పని మాట్లాడుకున్నాడు. తరచూ దుకాణానికి వచ్చే శివకుమార్ యజమానుల వద్ద ఎక్కువ డబ్బులు ఉండడాన్ని గుర్తించి వాటిని కాజేసేందుకు పథకం పన్నాడు. ఈ నెల 11న దుకాణానికి వచ్చిన అతను వేతనం తీసుకుని వెళ్లాడు. అదే సమయంలో క్యాష్ కౌంటర్లో డబ్బులు ఉండటాన్ని గుర్తించిన అతను అదే రోజు రాత్రి నిచ్చెన సాయంతో దుకాణం సీలింగ్ రూఫ్ ను తొలగించి లోపలికి ప్రవేశించాడు. క్యాష్ కౌంటర్లో ఉన్న రూ.5.10 లక్షల నగదు, రెండు సెల్ఫోన్లను దొంగిలించాడు. అయితే చోరీ సమయంలో మద్యం మత్తులో ఉన్న శివకుమార్ కిందికు దిగుతున్న సమయంలో పట్టుజారి కింద పడటంతో గాయపడ్డాడు. దుకాణ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు శివకుమార్‌పై అనుమానంతో అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా చేసిన నేరం అంగీకరించాడు. అతడి నుంచి రూ.5.06 లక్షల నగదు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. -
క్రైమ్స్ డౌన్
సాక్షి, సిటీబ్యూరో: సిటీ కమిషనరేట్ పరిధిలో నేరాలు తగ్గుముఖం పట్టాయి. వీటిని కొలిక్కి తేవడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషించాయి. పీడీ యాక్ట్ ప్రయోగం వంటి చర్యలతో నేరగాళ్ల దూకుడుకు కళ్లెం పడింది. దీంతో గత ఏడాదితో పోలిస్తే అన్ని రకాల నేరాలూ సరాసరి ఆరు శాతం తగ్గాయి. తీవ్రమైన నేరాల్లో పోలీసులు 92 శాతం రికవరీ సాధించారు. వరకట్న మరణాలు నగరంలో 38 శాతం నమోదు కాగా, మహిళలపై జరిగే దాడులు కూడా తగ్గాయి. హత్య కేసులు మాత్రం గత ఏడాదికంటే 8 శాతం పెరిగాయి. బుధవారం చౌమొహల్లా ప్యాలెస్‌లో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో కొత్వాల్ అంజనీ కుమార్ 2018 నేర గణాంకాలను విడుదల చేశారు. ప్రతి అంకంలోనూ టెక్నాలజీ వినియోగం... నేరాలు కొలిక్కి తీసుకురావడంలో సీసీ కెమెరాల కీలకపాత్ర... నేరాలు నిరోధించడంలో పీడీ యాక్ట్ ప్రయోగం వంటి చర్యలు... వెరసి నగరంలో నేరాలు నమోదు గణనీయంగా తగ్గింది. గత ఏడాదితో పోలిస్తే అన్ని రకాలైన నేరాల్లోనూ కలిపి సరాసరిన ఆరు శాతం తగ్గుదల నమోదు చేసుకుంది. సొత్తు సంబంధం నేరాలు 20.5 శాతం తగ్గాయి. తీవ్రమైన నేరాల్లో రికవరీ 92 శాతానికి చేరుకుంది. వరకట్న చావుల్లో 38 శాతం తగ్గుదల కనిపించడంతో పాటు మహిళలపై నేరాలు సైతం తగ్గాయి. కేవలం హత్య కేసులు మాత్రం గత ఏడాదితో పోలిస్తే 8 శాతం పెరిగాయి. పాతబస్తీలోని చౌమొహల్లా ప్యాలెస్‌లో బుధవారం నిర్వహించిన వార్షిక విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించిన కొత్వాల్ అంజనీ కుమార్ ఆ గణాంకాలను విడుదల చేశారు. కోర్టుల్లో కేసుల నిరూపణ సైతం 10 శాతం పెరిగి 34కి చేరిందని తెలిపారు. ట్రాఫిక్ విభాగం అధికారులు తీసుకున్న చర్యల కారణంగా నగరంలో మరణాలు, రోడ్డు ప్రమాదాలు తగ్గడంతో పాటు సరాసరి వేగం గంటలకు 18 నుంచి 25 కిమీకి చేరిందని వివరించారు. ఈ ఏడాది కొత్తగా సిటీ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, వెరీ ఫాస్ట్ యాప్, ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్, ఉమెన్ ఆన్ వీల్స్ (వావ్) బృందాలను రంగంలోకి దింపారు. ‘ఈ ఏడాది సాధించిన విజయాలపై నేను మాట్లాడుతున్నా... అవి సాధించడంలో కొత్వాల్ నుంచి కానిస్టేబుల్ వరకు అహర్నిశలు శ్రమించారు’ అని అంజనీకుమార్ పేర్కొన్నారు. ‘ఫోర్స్’ చూపిన ‘టాస్క్’... నగర పోలీసు కమిషనర్ టాస్క్‌ఫోర్స్‌లో ప్రస్తుతం డీసీపీ, అదనపు డీసీపీలతో పాటు ఐదు జోన్లకు ఐదుగురు ఇన్స్పెక్టర్లు ఉన్నారు. కేసుల్ని కొలిక్కి తీసుకురావడంతో పాటు ఇతర రాష్ట్రాల ముఠాలను చెక్ చెప్పడంతో వీటిది ప్రత్యేక పాత్ర. సిటీలో నమోదైన భారీ, సంచలనాత్మక నేరాల్లో దాదాపు 80 శాతం ఈ టీమ్స్ ద్వారానే కొలిక్కి వచ్చాయి. ఈ ఏడాది టాస్క్‌ఫోర్స్ టీమ్స్ 20 హత్య, 54 దోపిడీ, 4 బందిపోటు దొంగతనం, 100 చోరీలు, 33 స్నాచింగ్స్, 29 దాడులు, 63 డ్రగ్ కేసుల్లో నిందితుల్ని పట్టుకున్నాయి. 54 క్రికెట్ బెట్టింగ్ ముఠాలపై దాడులు చేసి 101 మందిని అరెస్టు చేశాయి. ఇతర నేరాల్లో 85 మందిని పట్టుకున్నాయి. 107 చీటింగ్ కేసుల్లో 121 మందిని అరెస్టు చేశాయి. వీటితో పాటు పెండింగ్‌లో ఉన్న 103 నాన్–బెయిలబుల్ వారెంట్లను ఎగ్జిక్యూట్ చేశాయి. -
హైదరాబాద్‌లో పెరిగిన నేరాలు
హైదరాబాద్ : భాగ్యనగరంలో ఈ ఏడాది నేరాల సంఖ్య పెరిగినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. ఆయన శనివారం 2014లో జరిగిన నేరాలపై మాట్లాడుతూ.. 40 శాతం సైబర్ క్రైమ్ కేసులు నమోదు కాగా, మహిళలపై నేరాలు తగ్గాయన్నారు. నేరాల సంఖ్యను తగ్గించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని సీపీ తెలిపారు. నేరాలను నిరోధించడానికి ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటున్నట్లు చెప్పారు. ఈ ఏడాది 2,564 టాస్క్‌ఫోర్స్ కేసులు ఛేదించామని తెలిపారు. ఇక రాజధాని పరిధిలో 10 శాతం చోరీలు, 5 శాతం అత్యాచారం కేసులు పెరిగినట్లు సీపీ వెల్లడించారు. రూ.46 కోట్ల సొమ్ము చోరీ కాగా, అందులో రూ. 26.72 కోట్లు రికవరీ చేసినట్లు మహేందర్ రెడ్డి తెలిపారు. అలాగే ట్రాఫిక్ చలానాల ద్వారా రూ.34 కోట్లు వసూలు అయినట్లు వెల్లడించారు. పోలీస్ వాహనాలకు జీపీఎస్ అనుసంధానం చేశామని, ఫ్రెండ్లీ పోలీసింగ్ కోసం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు మహేందర్ రెడ్డి తెలిపారు. -
హైదరాబాద్‌లో పెరిగిన నేరాలు