Hyderabad Law and order
-
అప్పుడు సోనియాను ఎందుకు ప్రశ్నించలేదు
న్యూఢిల్లీ : గవర్నర్కు హైదరాబాద్ శాంతిభద్రతల అధికారం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఆయన శనివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ గవర్నర్కు అధికారం అంశంపై బీజేపీ పాత్రలేదన్నారు. తెలంగాణ బిల్లు పాస్ అయినప్పుడు సోనియా గాంధీని కలిసి కేసీఆర్ విందు తీసుకున్నారని, అప్పుడు ఈ విషయాన్ని సోనియాను ఎందుకు ప్రశ్నించలేదని కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ బెదిరింపులకు భయపడేది లేదని ఆయన స్ఫష్టం చేశారు. గవర్నర్ అధికారాలపై తెలంగాణ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని కిషన్ రెడ్డి తెలిపారు. -
సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం: అసదుద్దీన్ ఒవైసీ
హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపధ్యంలో హైదరాబాద్ నగర శాంతి భద్రతలను గవర్నర్కు అప్పగిస్తే తాము సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని ఎంఐఎం ఎంపి అసదుద్దీన్ ఓవైసీ హెచ్చరించారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ పాలనా పగ్గాలను గవర్నర్కు అప్పగించడాన్ని ఆయన మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఈ నిబంధనను సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని చెప్పారు. శాంతిభద్రతల అంశం రాష్ట్ర పరిధిలోని వ్యవహారమైనందున ఈ నిబంధన రాజ్యాంగ విరుద్ధమన్నారు. తెలంగాణ బిల్లును యథాతథంగా అమలు చేస్తే 620 చదరపు కిలోమీటర్ల జీహెచ్ఎంసీ ప్రాంతం మొత్తం గవర్నర్ చేతిలోకి వెళుతుంది. -
'హైదరాబాద్ శాంతిభద్రతలు కేంద్రానికి అప్పగించరాదు'
రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్ శాంతిభద్రతల అంశాన్ని కేంద్ర పరిధిలోకి తీసుకురావడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని విశ్రాంత డీజీపీ, టీఆర్ఎస్ నేత పేర్వారం రాములు అన్నారు. హైదరాబాద్ శాంతిభద్రతలు, ఇతర కీలక పరిపాలన అంశాలను గవర్నర్ ఆధీనంలో ఉంచనున్నట్టు వార్తలు రావడంతో ఆయన పైవిధంగా స్పందించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్, తెలంగాణలో స్థిరపడిన సీమాంధ్రులకు ఎటువంటి భయం అవసరం లేదని రాములు భరోసా ఇచ్చారు. వారికి పూర్తి భద్రత ఉంటుందని రాములు పేర్కొన్నారు.