Hydro electric power
-
‘పోలవరం’ రివర్స్ టెండరింగ్‌కు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: పోలవరం హెడ్ వర్క్స్ (జలాశయం), 960 మెగావాట్ల జల విద్యుదుత్పత్తి కేంద్రం పనులకు రూ.4,987.55 కోట్ల అంచనా వ్యయంతో రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం శనివారం జారీచేసింది. ఇందులో హెడ్ వర్క్స్ అంచనా వ్యయం రూ.1,771.44 కోట్లు కాగా.. జల విద్యుదుత్పత్తి కేంద్రం పనుల వ్యయం రూ.3,216.11 కోట్లు. హెడ్ వర్క్స్‌కు ఎల్ఎస్(లంప్సమ్) పద్ధతిలో 24 నెలల్లోనూ, జల విద్యుదుత్పత్తి కేంద్రం పనులను ఈపీసీ(ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్)–టర్న్‌కీ విధానంలో 58 నెలల్లో పూర్తిచేయాలని నిర్ణయించింది. ఈ–ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో షెడ్యూళ్లను ఈనెల 22న ఉ.11 గంటల నుంచి సెప్టెంబరు 19 ఉ.11 గంటల వరకూ షెడ్యూళ్లను దాఖలు చేసుకోవచ్చు. టెండర్లో కాంట్రాక్టర్ల సందేహాలను సెప్టెంబరు 12న అధికారులు నివృత్తి చేస్తారు. అదేనెల 20వ తేదీ సా.5 గంటలకు టెక్నికల్ బిడ్ తెరుస్తారు. సెప్టెంబరు 27న ఉ.11 గంటలకు ప్రైస్‌బిడ్ తెరుస్తారు. అదే రోజున మ.1 గంట నుంచి ‘ఈ–ఆక్షన్’ నిర్వహించి, అతి తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టరుకు పనులు అప్పగించనున్నారు. టీడీపీ హయాంలో అక్రమాలు ఇంజనీరింగ్ పనులకు సంబంధించి టీడీపీ సర్కార్ హయాంలో జరిగిన అక్రమాలపై దర్యాప్తునకు నిపుణుల కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. పోలవరం పనుల్లో రూ.3,128.31 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు తేల్చిన నిపుణుల కమిటీ, రెండేళ్లలోగా ప్రాజెక్టును పూర్తిచేయాలంటే హెడ్ వర్క్స్, జల విద్యుదుత్పత్తి కేంద్రం పనులకు ఒకే ప్యాకేజీ కింద రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని.. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదా అయ్యే అవకాశం ఉందని ప్రతిపాదించింది. కాగా, గత ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా హెడ్‌వర్క్స్ పనులు దక్కించుకున్న నవయుగ, బీకెమ్ సంస్థలను కాంట్రాక్టు ఒప్పందం నుంచి పరస్పర అంగీకార పద్ధతిలో వైదొలగాలని కోరింది. ఆ తర్వాత హెడ్‌వర్క్స్ కాంట్రాక్టు ఒప్పందంతోపాటు పనులే ప్రారంభించని జల విద్యుదుత్పత్తి కేంద్రం ఒప్పందాన్ని రద్దుచేసింది. ఈ నేపథ్యంలో.. హెడ్ వర్క్స్, జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులకు ఒకే ప్యాకేజీ కింద రివర్స్ టెండర్ నోటిఫికేషన్‌ను జారీచేసింది. జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ శుక్రవారం జారీచేసిన మార్గదర్శకాల మేరకు ఈ రివర్స్ టెండరింగ్ నిర్వహించనున్నారు. లెప్ట్ కనెక్టివిటీ పనులకు కూడా.. ఇదిలా ఉంటే.. పోలవరం జలాశయం నుంచి ఎడమ కాలువకు నీటిని సరఫరా చేసే కనెక్టివిటీ(అనుసంధానం) పనులకు కూడా రూ.275 కోట్ల అంచనా వ్యయంతో రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం జారీచేసింది. ఎల్ఎస్ (లంప్సమ్) విధానంలో 18 నెలల్లో ఈ పనులను పూర్తిచేయాలని నిర్దేశించింది. ఈనెల 19న ఉ.11 గంటల నుంచి షెడ్యూళ్లు స్వీకరిస్తారు. సెప్టెంబరు 2న సా.4 గంటల్లోగా షెడ్యూళ్లను దాఖలు చేసుకోవచ్చు.. సెప్టెంబరు 3వ తేదీ సా.5 గంటలకు టెక్నికల్ బిడ్ తెరుస్తారు. ఆ తర్వాత ప్రైస్ బిడ్ తెరిచే రోజును ఖరారు చేస్తారు. అదే రోజున ఈ–ఆక్షన్ నిర్వహించి.. టెండర్ ఖరారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి ఈ పనులను (65వ ప్యాకేజీ) 2005లో రూ.103.91 కోట్లకు ‘యూనిటి ఇన్ఫ్రా’ అనే సంస్థ దక్కించుకుంది. 919 మీటర్ల పొడవున సొరంగ తవ్వకం, హెడ్ రెగ్యులేటర్.. ఎగ్జిట్ ఛానల్ పనులను చేయాలి. ఇందులో రూ.13.92 కోట్ల విలువైన పనులను ఆ సంస్థ పూర్తిచేసింది. ఆ తర్వాత ఎన్సీఎల్టీ (నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్)లో దివాలా పిటిషన్ దాఖలు చేసింది. ఆ సంస్థపై వేటు వేయాలన్న పోలవరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ ప్రతిపాదనపై స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ (ఎస్ఎల్ఎస్సీ) ఆమోదముద్ర వేసింది. కాగా, ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి నెల ముందు మిగిలిపోయిన రూ.90.01 కోట్ల విలువైన పనుల వ్యయాన్ని టీడీపీ సర్కారు రూ.278.80 కోట్లకు పెంచేసి.. వాటిని అప్పటి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా బినామీ సంస్థ అయిన సూర్య కన్స్ట్రక్షన్స్కు నామినేషన్ పద్ధతిలో అప్పగించాలని ఆదేశించింది. కానీ.. పోలవరం ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు ఇందుకు నిరాకరించడంతో చేసేదిలేక టెండర్ నోటిఫికేషన్ జారీచేశారు. దీంతో నిబంధనలను అడ్డుపెట్టుకుని 4.77 శాతం అధిక ధరలకు అంటే రూ.292.09 కోట్లకు మ్యాక్స్ ఇన్ఫ్రాకు అప్పగించింది. మ్యాక్స్ ఇన్ఫ్రా ద్వారా వాటిని సూర్య కన్స్ట్రక్షన్స్కు అప్పగించేలా దేవినేని ఉమా స్కెచ్ వేశారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలవడంతో టెండర్ల సీన్ ‘రివర్స్’ అయింది. -
జలవిద్యుదుత్పత్తి పనుల్లో గోల్మాల్!
సాక్షి, అమరావతి: పోలవరం పేరుతో టీడీపీ అధికారంలో ఉండగా సాగించిన అక్రమాల చిట్టాలో ఇది మరొకటి. పోలవరం జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టు పనుల్లో తట్టెడు మట్టెత్తకుండానే కాంట్రాక్టర్‌కు రూ.481 కోట్లకుపైగా చెల్లించేశారు. కాంట్రాక్టు ఒప్పందం చేసుకోగానే నిబంధనలకు విరుద్ధంగా రూ.331.04 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్సుగా చెల్లించడం, జలవిద్యుద్పుత్తి కేంద్రం పనుల కోసం 3–డీ నమూనాలో పరిశోధనల పేరుతో రూ.వంద కోట్లు ఇచ్చేయడం గమనార్హం. సర్వే, ఇన్వెస్టిగేషన్ పనులు చేయకున్నా రూ.50 కోట్లు ధారాదత్తం చేయడంపై ఏపీ జెన్కో (ఆంధ్రప్రదేశ్ విద్యుదుత్పత్తి సంస్థ) వర్గాలే నివ్వెరపోతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో సాగిన ఈ నిర్వాకాల్లో లోగుట్టు ఏమిటన్నది బహిరంగ రహస్యమే. కోటరీ కాంట్రాక్టర్‌కు పనులు దక్కేదాకా.. పోలవరానికి అనుబంధంగా 960 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించే విద్యుదుత్పత్తి ప్రాజెక్టు పనులకు సంబంధించి రూ.3,157.93 కోట్లను ఐబీఎం (అంతర్గత అంచనా విలువ)గా నిర్ణయిస్తూ 2017 జనవరి 9వతేదీన ఈపీసీ(ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ విధానం)లో టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఎంపిక చేసిన కాంట్రాక్టర్‌కు పనులు దక్కే అవకాశం లేకపోవడంతో అప్పటి ప్రభుత్వ పెద్దలు మూడుసార్లు టెండర్లు రద్దు చేయించారు. చివరకు తాము కోరుకున్న కాంట్రాక్టర్‌కే పనులు దక్కేలా చేసి 2017 అక్టోబర్ 11న టెండర్ల ప్రైస్ బిడ్ తెరిపించారు. 4.83 శాతం అధిక ధర (రూ.3,310.46 కోట్లు) కోట్ చేసి ఎల్–1గా నిలిచిన నవయుగ సంస్థకు జలవిద్యుత్పత్తి కేంద్రం పనులు అప్పగిస్తూ 2017 డిసెంబర్లో ఒప్పందం చేసుకున్నారు. దీని ప్రకారం 60 నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తి కావాలి. నిబంధనలు తుంగలోకి.. కాంట్రాక్టు ఒప్పందంలో అంచనా విలువలో పది శాతం (ఐదు శాతం మెటీరియల్‌కు, ఐదు శాతం లేబర్‌కు) మొబిలైజేషన్ అడ్వాన్సుగా కాంట్రాక్టర్‌కు చెల్లించవచ్చు. నిబంధనల ప్రకారం తొలుత అంచనా వ్యయంలో 1 శాతాన్ని సర్వే పనుల కోసం మొబిలైజేషన్ అడ్వాన్సుగా చెల్లించాలి. తర్వాత మెటీరియల్ కోసం రెండు శాతాన్ని ఒకసారి, యంత్రాలు సమీకరించాక మిగతా రెండు శాతాన్ని మొబిలైజేషన్ అడ్వాన్సుగా చెల్లించాలి. పనులు ప్రారంభించాక లేబర్ కాంపొనెంట్ కింద తొలుత ఒక శాతం, తర్వాత రెండు దఫాలుగా రెండు శాతం చొప్పున మొబిలైజేనేషన్ అడ్వాన్సు చెల్లించాలి. అయితే జెన్కో అధికారులు పనుల వ్యయంలో పది శాతం అంటే రూ.331.04 కోట్లను కాంట్రాక్టర్‌కు చెల్లించేశారు. మొబిలైజేషన్ అడ్వాన్సులు బడా‘బాబు’ జేబులోకి చేరాయని, అందుకే నిబంధనలకు విరుద్ధంగా చెల్లించారని జెన్కో అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. డబ్బుల్ ధమాకా.. పోలవరం జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులను నవయుగ దక్కించుకున్నాకే అదే సంస్థకు హెడ్ వర్క్స్ పనులను చంద్రబాబు కట్టబెట్టారు. వాస్తవంగా పోలవరం హెడ్‌వర్క్స్‌ను ట్రాన్స్ట్రాయ్ రూ.4,054 కోట్లకు దక్కించుకుంది. అనంతరం ఈ వ్యయాన్ని రూ.5,535.91 కోట్లకు పెంచేశారు. ట్రాన్స్‌ట్రాయ్‌ని అడ్డం పెట్టుకుని హెడ్‌వర్క్స్ పనులన్నీ ‘సబ్’ కాంట్రాక్టర్లకు అప్పగించి ఫిబ్రవరి 2018 వరకు చేసిన పనులకు రూ.2,362.22 కోట్ల బిల్లులు చెల్లించి చంద్రబాబు కమీషన్లు వసూలు చేసుకున్నారు. 60సీ నిబంధన కింద ట్రాన్స్‌ట్రాయ్‌ని తొలగించి స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులను ఎల్ఎస్(లంప్సమ్)–ఓపెన్ విధానంలో రూ.3,102.37 కోట్లకు నవయుగ సంస్థకు నామినేషన్‌పై కట్టబెట్టేశారు. ట్రాన్స్‌ట్రాయ్‌తో ఈపీసీ ఒప్పందాన్ని రద్దు చేసుకోకుండా ఎల్ఎస్–ఓపెన్ విధానంలో మరో కాంట్రాక్టర్‌కు అప్పగించడం నిబంధనలకు విరుద్ధం. ఒకే సంస్థకు పోలవరం హెడ్‌వర్క్స్, జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులు కట్టబెట్టడం వెనుక లోగుట్టు ఏమిటన్నది బహిరంగ రహస్యమే. పనులు చేయకుండా.. చేస్తామంటూ పోలవరం హెడ్‌వర్క్స్ పనులు చేపట్టిన నవయుగ సంస్థే జలవిద్యుదుత్పత్తి కేంద్రం పునాది పనులను పూర్తి చేసి ఏపీ జెన్కోకు అప్పగించాలి. అయితే ఇప్పటివరకూ పునాది పనులను కూడా పూర్తి చేయని నవయుగ తమకు జలవిద్యుదుత్పత్తి కేంద్రం ప్రాంతాన్ని అప్పగిస్తే పనులు ప్రారంభిస్తామంటూ ఏపీ జెన్కో అధికారులకు పదేపదే లేఖలు రాస్తోంది. దీని ఆధారంగా జలవిద్యుత్పత్తి కేంద్రం పనులు చేపట్టే ప్రాంతాన్ని తమకు అప్పగించాలంటూ ఏపీ జెన్కో అధికారులు పోలవరం ఈఎన్సీకి లేఖలు రాస్తున్నారు. కానీ ఆ పనులు చేయాల్సిన నవయుగ సంస్థ ఇప్పటికీ వాటిని పూర్తి చేయలేదు. దీంతో పోలవరం ఈఎన్సీ ఆ ప్రాంతాన్ని ఏపీ జెన్కోకు అప్పగించలేదు. దీన్ని అడ్డంపెట్టుకుని జలవిద్యుత్పత్తి కేంద్రం పనులను నవయుగ ప్రారంభించలేదు. కాంట్రాక్టు ఒప్పందం చేసుకున్నప్పటి నుంచి ఇప్పటివరకూ అంటే 20 నెలలుగా ఆ సంస్థ పనులు చేపట్టలేదు. జలవిద్యుదుత్పత్తి కేంద్రం ప్రాంతాన్ని తమకు అప్పగించడంలో జాప్యం వల్లే పనులు ప్రారంభించలేకపోయామని, ఇందుకు అదనంగా పరిహారం చెల్లించాలని, ధరల సర్దుబాటు కింద అదనపు నిధులు చెల్లించాలని డిమాండ్ చేసేందుకు నవయుగ సంస్థ అప్పుడే సిద్ధమైందని ఏపీ జెన్కో అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఖజానాను కొల్లగొట్టి.. జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులు చేపట్టాలంటే నీటి ఉద్ధృతిని అంచనా వేసి డిజైన్ రూపొందించాలి. ఈ బాధ్యత కాంట్రాక్టర్‌దే. మొబిలైజేషన్ అడ్వాన్సు నిధులతో ఈ సర్వే పనులు చేయాలి. అయితే 3–డీ నమూనాలో పరిశోధనలు చేసి డిజైన్లు రూపొందించాలనే సాకుతో రూ.వంద కోట్లను నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టర్‌కు చెల్లించడం గమనార్హం. ఖజానాను కొల్లగొట్టి చెల్లింపులు చేయడంపై అధికారవర్గాలు నివ్వెరపోతున్నాయి. ఇక జలవిద్యుదుత్పత్తి కేంద్రం సర్వే పనులు చేయకున్నా మరో రూ.50 కోట్లను కాంట్రాక్టర్‌కు చెల్లించడం అక్రమాలకు పరాకాష్ట. -
‘కృష్ణా బోర్డు’కు ఫిర్యాదు చేస్తాం
ఏపీ మంత్రి దేవినేని ఉమ * తెలంగాణ సర్కార్ ఉల్లంఘనను సీడబ్ల్యూసీ దృష్టికి తీసుకెళతాం * రైతులను కాపాడాలన్న చిత్తశుద్ధి తెలంగాణ ప్రభుత్వానికి లేదు సాక్షి, న్యూఢిల్లీ: శ్రీశైలంలో జల విద్యుదుత్పత్తికి నీటి వాడకంలో బోర్డు ఇచ్చిన తీర్పును తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘించడాన్ని కృష్ణానది యాజమాన్యబోర్డు దృష్టికి తీసుకెళ్లనున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఉదయం ఆయన ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావుతో కలసి కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతితో ఢిల్లీ అక్బర్‌రోడ్డు-6లోని ఆమె నివాసంలో భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘనకు పాల్పడుతోందని, ఏపీ ప్రభుత్వం తరఫున పలు అభ్యర్థనలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం దేవినేని ఉమ, కంభంపాటి రామ్మోహనరావు మీడియాతో మాట్లాడుతూ ఏం చెప్పారంటే... కృష్ణానది యాజమాన్య బోర్డు ఇచ్చిన తీర్పు అమలు విషయంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే బోర్డు దృష్టికి తీసుకెళ్లాలని కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతి చెప్పారు. సోమవారం తనను కలిసిన తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావుకు అదే విషయాన్ని చెప్పినట్టు ఆమె మాతో చెప్పారు. అయితే విద్యుత్ ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం తమకు అనుమతిచ్చిందంటూ తెలంగాణ మంత్రి హరీష్‌రావు చెప్పుకోవడం సరికాదు. పంతాలకు పోయి శ్రీశైలం నీటి మట్టాన్ని 854 అడుగుల కంటే తగ్గిస్తే ఎస్ఆర్బీసీకి నీరందించలేం. ఇదే జరిగితే రాయలసీమలోని రెండు లక్షల ఎకరాల పంట ఎండుతుంది. కేసీకెనాల్‌కు నీరు సరఫరా చేయలేము. రాయలసీమ ప్రాంతానికి మంచినీరు సైతం అందించలేని దుస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే శ్రీశైలం, నాగార్జున సాగర్‌లో 60 టీఎంసీలు తక్కువగా ఉన్నాయి. కరెంటు ఉత్పత్తి చేస్తూ నీళ్లని సముద్రంలోకి వ దిలితే తెలంగాణ జిల్లాల్లో నల్లగొండ, ఖమ్మంతోపాటు కృష్ణ, ప్రకాశం జిల్లాలకు భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయి. నీటిని కాపాడుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు పెద్దమనసుతో తెలంగాణ 300 మెగావాట్ల విద్యుత్ ఇచ్చేందుకు ముందుకు వస్తే కేసీఆర్ అంగీకరించలేదు. కేసీఆర్ ఇచ్చిన ప్రతిపాదనలతోనే విభజన చట్టంలో కృష్ణానది యాజమాన్యబోర్డు అంశాన్ని యూపీఏ చేర్చింది. సీలేరు విద్యుత్‌ను తెలంగాణకు ఇవ్వాలని గోదావరి బోర్డు ఆర్డర్ ఇవ్వలేదు, అలా ఉంటే కేసీఆర్‌ని చూపించమనండి. -
మన డ్యామ్‌లు సురక్షితమేనా?
భూకంప ప్రభావిత ప్రాంతాల్లో 600 డ్యామ్‌లు పాత ఆనకట్టలను కూల్చేయాలంటున్న నిపుణులు న్యూఢిల్లీ: దేశంలోని ఆనకట్టల భద్రతపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక సర్వే నిర్వహించింది. భూకంపాలకు అత్యంత ఎక్కువ అవకాశం ఉన్న ప్రాంతాల్లో 600లకు పైగా భారీ డ్యామ్‌లు ఉన్నాయని ఆ సర్వేలో తేలింది. గత యాభై ఏళ్లలో నిర్మించిన 3 వేల డ్యామ్‌లు సహా దేశవ్యాప్తంగా 5 వేల భారీ ఆనకట్టలు ఉన్నాయి. మొత్తంమీద 9 కోట్ల హెక్టార్ల వ్యవసాయ భూమికి ఇవి సాగు వసతి కల్పిస్తున్నాయి. వీటిలో కేవలం 3% ప్రాజెక్టుల్లో జలవిద్యుదుత్పత్తి జరుగుతోంది. 2011లో జపాన్‌లో వచ్చిన భారీ భూకంపం, ఆ ప్రభావంతో వచ్చిన సునామీ అక్కడి ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రాన్ని నాశనం చేసిన ఉదంతంలో వెయ్యి మంది దుర్మరణం పాలవడంం తెలిసిందే. దీంతో భారత్‌లోని భారీ ఆనకట్టల భద్రతపై అనుమానాలు ప్రారంభమయ్యాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లోని డ్యామ్‌లన్నీ అత్యంత తీవ్రతతో వచ్చిన భూకంపాలను, సునామీలను కూడా తట్టుకోగలవని ఇప్పటివరకు అన్ని ప్రభుత్వాలు చెబుతూ వస్తున్నాయి. ‘ఫుకుషిమా ఘటన అనంతరం దేశంలోని అన్ని ఆనకట్టలు, అణు విద్యుత్కేంద్రాలపై భద్రతకు సంబంధించిన పరీక్షలు జరిపారు. అవన్నీ 100% సురక్షితం’ అని ఇటీవల కేంద్రం చెప్పింది. అయితే, నిపుణుల అభిప్రాయం వేరేలా ఉంది. భారత్‌లోని చాలా డ్యామ్‌లు చాలాఏళ్ల క్రితం నిర్మించినవని, అవి ఇప్పుడు సురక్షితం కావని, వాటిని కూల్చి మళ్లీ కొత్తగా నిర్మించాల్సి ఉందని వారు స్పష్టం చేస్తున్నారు. వంద పాత డ్యామ్‌లు ప్రమాదకరంగా ఉన్నాయని సౌత్ ఏషియా నెట్వర్క్ ఆఫ్ డ్యామ్స్ కోఆర్డినేటర్ హిమాంశు ఠక్కర్ చెప్పారు. చాలా డ్యామ్‌లు భారీ వరదలు వచ్చే ప్రాంతాల్లో, బలహీనమైన ప్రదేశాల్లో నిర్మించారని, అవి భూకంపాలకు కారణమవుతాయని రామస్వామి అయ్యర్ అనే నిపుణుడు అన్నారు. అయితే, డ్యామ్‌ల కూల్చివేతకు చాలాకాలం పడుతుందని, కొత్త ఆనకట్టల నిర్మాణం భారీ ఖర్చుతో కూడుకొని ఉన్నదని జనవనరుల శాఖ వారి వాదన. 118 ఏళ్లనాటి ముళ్లపెరియార్ ఆనకట్టపై వ్యక్తమవుతున్న భయాందోళనలు సమంజసమేనని చాలామంది అభిప్రాయం. కేరళలో ఉన్న ఆ డ్యామ్ వల్ల తమిళనాడులోని లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతోంది. అయితే, భద్రతాకారణాల దృష్ట్యా ఇప్పుడు ఆ డ్యామ్‌ను కూల్చేయాలని కేరళ డిమాండ్ చేస్తుండగా.. ఆ ఆనకట్ట సురక్షితమేనని తమిళనాడు ప్రభుత్వం వాదిస్తోంది. భారత్‌లో డ్యామ్ ప్రమాదాలు * 1979లో గుజరాత్‌లోని మొర్బి డ్యామ్ కూలడంతో 5 వేల మంది చనిపోయారు. భారీ వర్షాలతో భారీగా నీరురావడంతో గోడలు బలహీనమై డ్యామ్ కూలిపోయింది. * 2008లో భారత్- నేపాల్ సరిహద్దుల్లోని సప్తకోషి నదిపై నిర్మించిన డ్యామ్ ఒక్కసారిగా బద్ధలవడంతో భారీ వరదలు బీహార్‌ను ముంచెత్తాయి. * 1969లో మహారాష్ట్రలోని కోయినానగర్లో సంభవించిన భారీ భూకంపానికి అక్కడి రిజర్వాయర్ వల్ల ఏర్పడే భూప్రకంపనలు ఒక కారణమని భూ విజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయం.