సాక్షి, అమరావతి: పోలవరం హెడ్ వర్క్స్ (జలాశయం), 960 మెగావాట్ల జల విద్యుదుత్పత్తి కేంద్రం పనులకు రూ.4,987.55 కోట్ల అంచనా వ్యయంతో రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం శనివారం జారీచేసింది. ఇందులో హెడ్ వర్క్స్ అంచనా వ్యయం రూ.1,771.44 కోట్లు కాగా.. జల విద్యుదుత్పత్తి కేంద్రం పనుల వ్యయం రూ.3,216.11 కోట్లు. హెడ్ వర్క్స్‌కు ఎల్‌ఎస్(లంప్సమ్) పద్ధతిలో 24 నెలల్లోనూ, జల విద్యుదుత్పత్తి కేంద్రం పనులను ఈపీసీ(ఇంజనీరింగ్ ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్)–టర్న్‌కీ విధానంలో 58 నెలల్లో పూర్తిచేయాలని నిర్ణయించింది. ఈ–ప్రొక్యూర్‌మెంట్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో షెడ్యూళ్లను ఈనెల 22న ఉ.11 గంటల నుంచి సెప్టెంబరు 19 ఉ.11 గంటల వరకూ షెడ్యూళ్లను దాఖలు చేసుకోవచ్చు. టెండర్‌లో కాంట్రాక్టర్ల సందేహాలను సెప్టెంబరు 12న అధికారులు నివృత్తి చేస్తారు. అదేనెల 20వ తేదీ సా.5 గంటలకు టెక్నికల్ బిడ్ తెరుస్తారు. సెప్టెంబరు 27న ఉ.11 గంటలకు ప్రైస్‌బిడ్ తెరుస్తారు. అదే రోజున మ.1 గంట నుంచి ‘ఈ–ఆక్షన్’ నిర్వహించి, అతి తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టరుకు పనులు అప్పగించనున్నారు.
టీడీపీ హయాంలో అక్రమాలు
ఇంజనీరింగ్ పనులకు సంబంధించి టీడీపీ సర్కార్ హయాంలో జరిగిన అక్రమాలపై దర్యాప్తునకు నిపుణుల కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. పోలవరం పనుల్లో రూ.3,128.31 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు తేల్చిన నిపుణుల కమిటీ, రెండేళ్లలోగా ప్రాజెక్టును పూర్తిచేయాలంటే హెడ్ వర్క్స్, జల విద్యుదుత్పత్తి కేంద్రం పనులకు ఒకే ప్యాకేజీ కింద రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని.. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదా అయ్యే అవకాశం ఉందని ప్రతిపాదించింది. కాగా, గత ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా హెడ్‌వర్క్స్ పనులు దక్కించుకున్న నవయుగ, బీకెమ్ సంస్థలను కాంట్రాక్టు ఒప్పందం నుంచి పరస్పర అంగీకార పద్ధతిలో వైదొలగాలని కోరింది. ఆ తర్వాత హెడ్‌వర్క్స్ కాంట్రాక్టు ఒప్పందంతోపాటు పనులే ప్రారంభించని జల విద్యుదుత్పత్తి కేంద్రం ఒప్పందాన్ని రద్దుచేసింది. ఈ నేపథ్యంలో.. హెడ్ వర్క్స్, జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులకు ఒకే ప్యాకేజీ కింద రివర్స్ టెండర్ నోటిఫికేషన్‌ను జారీచేసింది. జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ శుక్రవారం జారీచేసిన మార్గదర్శకాల మేరకు ఈ రివర్స్ టెండరింగ్ నిర్వహించనున్నారు.
లెప్ట్ కనెక్టివిటీ పనులకు కూడా..
ఇదిలా ఉంటే.. పోలవరం జలాశయం నుంచి ఎడమ కాలువకు నీటిని సరఫరా చేసే కనెక్టివిటీ(అనుసంధానం) పనులకు కూడా రూ.275 కోట్ల అంచనా వ్యయంతో రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం జారీచేసింది. ఎల్‌ఎస్ (లంప్సమ్) విధానంలో 18 నెలల్లో ఈ పనులను పూర్తిచేయాలని నిర్దేశించింది. ఈనెల 19న ఉ.11 గంటల నుంచి షెడ్యూళ్లు స్వీకరిస్తారు. సెప్టెంబరు 2న సా.4 గంటల్లోగా షెడ్యూళ్లను దాఖలు చేసుకోవచ్చు.. సెప్టెంబరు 3వ తేదీ సా.5 గంటలకు టెక్నికల్ బిడ్ తెరుస్తారు. ఆ తర్వాత ప్రైస్ బిడ్ తెరిచే రోజును ఖరారు చేస్తారు. అదే రోజున ఈ–ఆక్షన్ నిర్వహించి.. టెండర్ ఖరారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వాస్తవానికి ఈ పనులను (65వ ప్యాకేజీ) 2005లో రూ.103.91 కోట్లకు ‘యూనిటి ఇన్‌ఫ్రా’ అనే సంస్థ దక్కించుకుంది. 919 మీటర్ల పొడవున సొరంగ తవ్వకం, హెడ్ రెగ్యులేటర్.. ఎగ్జిట్ ఛానల్ పనులను చేయాలి. ఇందులో రూ.13.92 కోట్ల విలువైన పనులను ఆ సంస్థ పూర్తిచేసింది. ఆ తర్వాత ఎన్‌సీఎల్‌టీ (నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్)లో దివాలా పిటిషన్ దాఖలు చేసింది. ఆ సంస్థపై వేటు వేయాలన్న పోలవరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ ప్రతిపాదనపై స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ (ఎస్‌ఎల్‌ఎస్‌సీ) ఆమోదముద్ర వేసింది. కాగా, ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి నెల ముందు మిగిలిపోయిన రూ.90.01 కోట్ల విలువైన పనుల వ్యయాన్ని టీడీపీ సర్కారు రూ.278.80 కోట్లకు పెంచేసి.. వాటిని అప్పటి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా బినామీ సంస్థ అయిన సూర్య కన్‌స్ట్రక్షన్స్‌కు నామినేషన్ పద్ధతిలో అప్పగించాలని ఆదేశించింది. కానీ.. పోలవరం ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు ఇందుకు నిరాకరించడంతో చేసేదిలేక టెండర్ నోటిఫికేషన్ జారీచేశారు. దీంతో నిబంధనలను అడ్డుపెట్టుకుని 4.77 శాతం అధిక ధరలకు అంటే రూ.292.09 కోట్లకు మ్యాక్స్ ఇన్‌ఫ్రాకు అప్పగించింది. మ్యాక్స్ ఇన్‌ఫ్రా ద్వారా వాటిని సూర్య కన్‌స్ట్రక్షన్స్‌కు అప్పగించేలా దేవినేని ఉమా స్కెచ్ వేశారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలవడంతో టెండర్ల సీన్ ‘రివర్స్’ అయింది.
‘పోలవరం’ రివర్స్ టెండరింగ్‌కు నోటిఫికేషన్
Published Sun, Aug 18 2019 3:18 AM | Last Updated on Sun, Aug 18 2019 3:18 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment